Wednesday, May 11, 2011

T ఛానల్ TRSదా? తెలంగాణదా?

తెలంగాణ కోసమే పుట్టిందని పదే పదే చెప్పుకుంటున్న టీ ఛానల్ లో తెలంగాణ అంటే కేసీఆర్ తప్పించి మిగిలిన తెలంగాణ వాదులు కానీ.. నాయకులు కానీ పెద్దగా కనిపించరు.. అక్కడ కేసీఆర్ కుటుంబ రాజ్యం  నడుస్తుందనేది  బహిరంగ సత్యం. తెలంగాణ ఉద్యమం ఎవరు చేసినా..  ఎక్కడ చేసినా దానిని ప్రత్యేకంగా కవర్ చేయాల్సిన బాధ్యత టీ ఛానల్ పై ఉంది.  ఎందుకంటే అది తెలంగాణ వాదుల అందించే పైసల మీద నడుస్తుంది కాబట్టి.. కానీ నాగం జనార్థన్ రెడ్డి పాలమూరు జిల్లాలో భారీ ఎత్తున నగరా నిర్వహిస్తే… దానిని లైవ్ కవరేజ్  మాత్రం టీ ఛానల్ లో కనిపించదు.. అందులో కనిపించేది..చంద్రబాబుకు వ్యతిరేకంగా  వచ్చేది మాత్రమే..లేదంటే తెలుగుదేశం పార్టీని చీల్చడానికో.. టీఆర్ ఎస్ పార్టీని పొగడానికో తప్పించి..తెలంగాణ కోసం మాత్రం కాదనేది నాగం నగరా సమయంలో టీ ఛానల్ వ్యవహరించిన తీరే అద్దం పడుతుంది. తెలంగాణ ప్రతినిధుల సభను గొప్పగా లైవ్ చేసిన  టీ ఛానల్… అదే జిల్లాలో నాగం పెద్ద ఎత్తున తెలంగాణ  నగరా మోగిస్తుంటే.. అది టీ ఛానల్ చెవికెక్కలేదు. నాగం మాట్లాడిన దానిలో తెలుగుదేశం ఎమ్మేల్యేలను చీల్చడానికో… తెలుగుదేశాన్ని చిత్తు చేయడానికో పనికొచ్చే వాటిని కట్ చేసుకుని ప్రసారం చేసుకున్న ఆ ఛానల్.. నాగం తెలంగాణ పోరాటాన్ని ఎందుకు లైవ్ చేయలేదు. తెలంగాణ కోసమే పుట్టామని చెబుతున్న ఈ ఛానల్ టీఆర్ ఎస్ స్వప్రయోజనాల కోసమే పుట్టిందనేది ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది. చంద్రబాబును ఎదిరించి.. తెలంగాణ కోసం తెలుగుదేశంలో తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్న నాగం ఎందుకు టీ ఛానల్ కు కనిపించలేదు. బాబు తెలంగాణ పై కక్కలేక .. మింగలేక పరిస్థితులను కల్పిస్తూ.. బాబును ముప్పుతిప్పలు పెడుతున్న..నాగం జనార్థన్ రెడ్డిని  టీ ఛానల్  ఎందుకు సపోర్ట్ చేయడం లేదు. ఎవరు  ఎన్ని ఛానళ్లైనా పెట్టుకోవచ్చు.. కానీ తప్పులేదు.. పార్టీలు ఎన్నైనా పెట్టుకోవచ్చు.. తప్పులేదు.. కానీ తెలంగాణ నినాదం మారు మ్రోగేలా చేయాల్సిన బాధ్యత టీఆర్ ఎస్ పై ఉంది. ఎందుకంటే ఆ పార్టీ కట్టుకున్న ఇంద్ర భవనం.. అందులో పెట్టుకున్న ఛానల్.. అన్నీ.. తెలంగాణ వాదులు తమ సొంత జేబుల్లో నుంచి ఇచ్చిన పైసల్లోవే కానీ.. సొంత డబ్బులు కావన్న విషయం టీఆర్ ఎస్ అధినేత మరిచిపోతున్నారు. జిట్టా బాలక్రిష్ణా రెడ్డి, గద్దర్ లాంటి వాళ్లు తెలంగాణ పై గర్జించిన సందర్భాలెన్నో.. వారు ఎన్ని సభలు.. ధూం..ధాంలు పెట్టినా టీ ఛానల్ లో ఇచ్చే ప్రాముఖ్యం తక్కువ.. ఎందుకంటే అక్కడ టీఆర్ ఎస్  జెండా లేదు కాబట్టి.. అయినా టీ ఛానల్ తెలంగాణ కోసమే పని చేస్తుందా..? టీఆర్ ఎస్ కోసమే పని చేస్తుందా..? లేదంటే కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే పని చేస్తుందా అనేది కూడా స్పష్టం కావాలి. ఎందుకంటే ఇఫ్పుడు అక్కడంతా కుటుంబ స్వామ్యమే నడుస్తోందనేది బహిరంగ సత్యం.  టీ ఛానల్ ను కేసీఆర్  కొడుకు రామరావు పర్యవేక్షిస్తున్నారు..కాబట్టే ఆయన కేవలం తన కుటుంబాన్ని హైలెట్ చేసుకుంటారు.. తప్పించి… మిగిలిన నాయకులను పట్టించుకోరు. వారికి కేసీఆర్ చేసే ఉద్యమమే కనిపిస్తుంది తప్పించి.. తెలంగాణ వాదులు.. నాయకులు చేసే ఉద్యమాలు.. త్యాగాలు కనిపించవు.. వారికి కావాల్సిందల్లా.. సొంత పార్టీకి  ఓ గొట్టం మైకు.. అదే టీ ఛానల్.. మీరు కాదంటారా..?

Source: telugushakthi.com

No comments:

Post a Comment