Monday, May 23, 2011

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి


  • కరుణానిధి సిఎంగా కూతురు కనిమొళికి కలైనార్‌ టివి
  • వైఎస్సార్‌ సిఎంగా కుమారుడు జగన్‌కి సాక్షి పత్రిక, టివి
  • నిధుల సేకరణలో ప్రేరణ ఒక్కటే
  • అక్కడ కమ్యూనికేషన్‌ శాఖలో అక్రమ కేటాయింపుల ద్వారా కలైనార్‌కు కాసుల పోగు
  • ఇక్కడ గనులు, భూముల పందేరంతో సాక్షికి నిధుల వరద
  • ప్రత్యర్థుల్ని దెబ్బతియ్యడమే లక్ష్యంగా సొంత మీడియా ఏర్పాటు
  • తమిళనాడులో ఫార్ములా వికటించి జైలు పాలైన కనిమొళి
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ప్రాంతీయ పార్టీలకు సొంత మీడియా సంస్థల ఆపేక్ష పెరిగింది. ఇదే వారి పతనానికి కారణమౌతోంది. అక్కడ కలైనార్‌, జయ టివిలు, ఇక్కడ సాక్షి టివి, పత్రికలు ఇలా ఏర్పాటైనవే. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కుమార్తె కనిమొళి పేరిట కలైనార్‌ టివిని ప్రారంభించారు. వైఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే కుమారుడు జగన్‌ పేరిట సాక్షి పత్రిక, టివిలను మొదలెట్టారు. నిధుల సేకరణలో ఈ రెండింటికీ సారూప్యత ఉంది. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలోని విలువైన గనులు, ప్రకృతి వనరులు, భూముల్ని ఆయాచితంగా పొందడం ద్వారా లగడపాటి రాజ్‌గోపాల్‌, మేట్రిక్స్‌ ప్రసాద్‌, ఇందు గ్రూప్‌ ప్రతినిధులు సాక్షి మీడియాలోకి నిధులు భారీగా సమకూర్చారు.

కేంద్ర స్థాయిలో డిఎంకె పార్టీకి చెందిన రాజా మంత్రిగా ఉన్న కమ్యూనికేషన్‌ శాఖలో అక్రమ కేటాయింపులు జరిపి స్వాన్‌, అడాగ్‌, ఎయిర్‌సెల్‌, యునినార్‌ వంటి సంస్థల ద్వారా దొడ్డిదారిలో కలైనార్‌ టివికి నిధుల్ని పోగేశారు. అన్ని అంశాల్లోనూ ఈ రెండింటికీ పోలికలు కనిపిస్తున్నాయి. గతంలోనే ఈ రెండింటిపై కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా కలైనార్‌ టివి నిధుల విషయంలో కరుణానిధి కుమార్తె కనిమొళి జైలుపాలయ్యారు.

అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అక్రమాలకు పదవులు పోయాక ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తోంది. అక్కడ ముఖ్యమంత్రి కూతురు, ఇక్కడ ముఖ్యమంత్రి కొడుకుల పేరిట ఏర్పాటైన మీడియా సంస్థలకు వందలు, వేలకోట్లు సమకూరిన విషయం దేశంలో చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఇలాంటి సంస్కృతి మరెక్కడా లేదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే నెలకొంది. అధికారంలో ఉన్నప్పుడు తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియాపై కక్ష సాధింపు చర్యగా సొంతంగా పేపర్లు, చానల్స్‌ పెట్టి తమ ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. తమపై వచ్చిన ఆరోపణలకు వివరణలిస్తున్నారు. ప్రతిపక్షాల్ని దుమ్మెత్తిపోస్తున్నారు. జయలలితతో సరిసమాన స్థాయిలో తన కూతురు కనిమొళిని తమిళరాజకీయ వేత్తగా తీర్చిదిద్దాలన్న కరుణానిధి ఆకాంక్షలన్నీ కుప్పకూలిపోయాయి. కలైనార్‌ టివిలోకి అక్రమ నిధుల వరద విషయాన్ని సిబిఐ పసిగట్టింది. విచారణలో ఆధారాల్ని సేకరించింది. కేంద్రస్థాయిలో కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాలేవీ ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడ్డంలేదు. అవి మీడియాను మీడియాగానే చూస్తున్నాయి. తమ విధానాల్తో మీడియాను ఆకర్షిస్తున్నాయి. తమ సిద్ధాంతాలకనుగుణంగా ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నాయి. తమపై వచ్చిన ఆరోపణలకు కూడా మీడియా ద్వారానే బదులిస్తున్నాయి. రాజ్యాంగంలో మీడియాకు పొందుపర్చిన ప్రతిపత్తిని కాలరాచేందుకు ప్రయత్నాలు చేయడంలేదు. మీడియా గౌరవాన్ని, హోదాను కొనసాగించేందుకు సహకరిస్తున్నాయి.

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment