Tuesday, July 5, 2011

టీవీ ఇలా వాడుదాం

టెలివిజన్ లేని ఇళ్ళు మీ ఊళ్ళో ఎన్ని ఉన్నాయి? ఒకప్పుడీ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడా ఇబ్బంది లేదు. ఇప్పుడీ ప్రశ్న ఎవర్ని అడిగినా, వాళ్ళు, తడుముకోకుండా చెప్పేస్తారు జవాబు. ఎందుకంటే, వేళ్ళమీద లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే ఈ ఇళ్ళు ఉండేవి. టెలివిజన్ ప్రాముఖ్యత అంతలా పెరిగి పోయింది. మరి. కానీ టెలివిజన్ సెట్ ఇంట్లో ఉన్నా, దాని గురించి ఎవరూ ఏ జాగ్రత్త కూడా తీసుకోరన్నది నిజం. ఈ టెలివిజన్ సెట్‌ల విషయంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలను పాటించటం వలన ఏ సమస్యలూ తలెత్తకుండా చూసుకోవచ్చు.

టెలివిజన్ కొనుగోలు సమయంలో దానితో పాటుగా సూచనలు కూడా ఇస్తారు. దీనినే ఆపరేటింగ్ మాన్యువల్ అనీ, ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ అనీ, యూజర్స్ మాన్యువల్ అనీ కూడా పిలుస్తారు. ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. సెట్‌తో పాటుగా షాప్‌వాళ్ళు ఈ పుస్తకం ఇవ్వకపోతే అడిగి మరీ తీసుకోవాలి. ఈ చిన్న పుస్తకంలో సాధారణంగా క్రింది అంశాలు ప్రధానంగా ఉంటాయి.

* టివి సెట్‌ను సురక్షితంగా వినియోగించుకొనే విషయంలో హెచ్చరికలు, జాగ్రత్తలు

* లొకేషన్ కంట్రోల్స్‌కు సంబంధించిన సచిత్ర సమాచారం

* ట్యూనింగ్ ప్రొసీజర్, పిక్చర్ కంట్రోల్ ఎడ్జస్ట్‌మెంట్‌లకు సంబంధించిన సమాచారం.

* టివి సెట్ టెక్నికల్ స్పెసిఫికేషన్లు

* విసిడి లేదా డివిడి ప్లేయర్‌ను అమర్చుకొనే విధానం

* వారంటీ నియమ నిబంధనలు

టెలివిజన్ సెట్‌ను సరిగ్గా ఉపయోగించుకొనే విధానం గూర్చి తెలిపే ఈ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌ను ఉత్పత్తిదారులే రూపొందించి, ప్రతి సెట్‌తోనూ దీనిని తప్పనిసరిగా అందించాలి. ఓల్టేజి స్టెబిలైజర్ అవసరమా? కలర్ టెలివిజన్‌ను ఉంచిన గదిలో కాంతి ఏ స్థాయిలో ఉండవచ్చు? ఎంత దూరంలో కూర్చుని చూడటం మంచిది? ఎటువంటి ట్రాలీమీద ఉంచవచ్చు. ఇటువంటి వివరాలు ఒక్కో తరహా టీవీకి ఒక్కో రకంగా ఉంటాయి. కనుక సంబంధిత మాన్యువల్‌ను కనీసం ఒకసారి అయినా వినియోగదారులు చదవటం మంచిది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్‌ఐ మార్కు పొందిన టీవీ రిసీవర్లు తగు రక్షిత ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతాయి. అయినప్పటికీ వీటి విషయంలో కూడా ప్రమాదాలకు, నష్టాలకు గురి కాకూడదంటే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు.

ఇవే చిన్నచిన్న జాగ్రత్తలు...
* స్థిరంగా ఉండే టేబుల్ లేదా ట్రాలీ పైన మాత్రమే టెలివిజన్‌ను ఉంచాలి.

* పవర్ కార్డుమీద వస్తువులు ఉంచడం, దానిని తొక్కుతూ నడవడం చేయకూడదు. ‘ఆన్’ పొజిషన్‌లో ఉన్నప్పుడు రిసీవర్‌ను అటూ ఇటూ మార్చకూడదు. ఒక్కోసారి చిన్నపాటి జర్క్ కూడా పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు.

* టెలివిజన్ తెర మధ్య భాగం, ప్రేక్షకుల కళ్ళు ఒకే మట్టంలో ఉండేలా కూర్చోవాలి.

* తెర ఎత్తుకు ఆరు రెట్ల దూరంలో కూర్చుని టెలివిజన్‌ను చూడటం మంచిది. ఉదాహరణకి 51 సెంటీమీటర్ల డయాగనల్ సైజ్ స్క్రీన్‌కు రెండు మీటర్ల దూరంలో కూర్చుని చూడవచ్చు.

* దీర్ఘకాలంపాటు సెట్‌ను ఉపయోగించనప్పుడు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తున్నప్పుడు కేబుల్ కనెక్షన్లను తొలగించడం మంచిది.

* ఎక్కువకాలం పాటు టెలివిజన్ సెట్‌ను ఉపయోగించనప్పుడు పవర్ పాయింట్ నుంచి ప్లగ్‌ను తీసివేయాలి.

* ఎలక్ట్రికల్ షాక్‌లకు గురి కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా సెట్‌ను వానజల్లు పడే ప్రాంతానికీ, తేమ ప్రదేశాలకూ దూరంగా ఉంచాలి.

* వాల్ ఔట్‌లెట్స్, ఎక్స్‌టెన్షన్ కార్డుల విషయంలో ఓవర్ లోడ్ కాకుండా జాగ్రత్త పడాలి. కాదంటే ఎలక్ట్రిక్ షాక్, అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది.

* తగిన గాలి సోకే విధంగా సెట్‌ను అమర్చుకోవాలి. రిసీవర్ ఎక్కువగా వేడెక్కకుండా చేసేందుకు ఇది అవసరం.

* ఎండపడే విధంగా సెట్‌ను ఉంచకూడదు. అలాగే వేడి ప్రదేశాల్లో ఉంచకూడదు.

* కాబినెట్‌నీ, స్క్రీన్‌ని శుభ్రపరిచేందుకు మైల్డ్ డిటర్జెంట్ కలిపిన నీటిలో మెత్తని గుడ్డను తడిపి ఉపయోగించవచ్చు. బెంజాల్, పెట్రోలియం, లేదా కెమికల్ క్లాత్‌ను ఉపయోగించకూడదు. శుభ్రపరిచే ముందు పవర్ పాయింట్ నుంచి ప్లగ్‌ను తీసివేయాలి.

* కాబినెట్ వెనుక ఉన్న కవర్‌ను తొలగించే ప్రయత్నం చేయకూడదు. ప్రాణాంతక ఓల్టేజీలకు గురయ్యే ప్రమాదం ఉంది.

* వెంటిలేషన్ హోల్స్, ఓపెనింగ్‌ల నుంచి నాణేలు, చిన్న చిన్న ఆటవస్తువులు, గుండీల వంటి వస్తువులను రిసీవర్‌లోకి పిల్లలు నెట్టకుండా చూడాలి.

* కలర్ టెలివిజన్‌లకు సమీపంలో అయస్కాంత పదార్థాలు ఉంచకూడదు. స్పీకర్, ఆడియో సిస్టమ్స్ వంటి వాటిని టెలివిజన్‌కు సమీపంలో ఉంచినప్పుడు అనవసరమైన రంగు గీతలు తెరపై రావచ్చు.

* తెగిపోయిన, పాడైపోయిన కార్డును ఉపయోగించడం వలన అగ్నిప్రమాదాలు, కరెంటు షాక్ వంటివి జరగవచ్చు. కనుక పవర్ కార్డుపైన బరువయిన వస్తువులను ఉంచవద్దు. ఎక్కువ ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే గృహోపకరణాలకు విద్యుత్ వైర్లు దూరంగా ఉండేలా చూడాలి. సాకెట్ నుంచి ప్లగ్‌ను తీసేటప్పుడు కార్డ్‌ను పట్టుకొని లాగకూడదు. ప్లగ్‌ను పట్టుకొని లాగాలి.
ఇటువంటి మరికొన్ని జాగ్రత్తల వివరాలు ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌లో ఉంటాయి. టెలివిజన్ కొన్న తర్వాత ఈ చిన్న పుస్తకాన్ని ఒకసారి చదివి, అందులో సూచనలను, సలహాలను పాటించటం వలన టెలివిజన్ ఎక్కువ కాలం పనిచేస్తుంది. రిపరెన్స్ కోసం ఈ పుస్తకాన్ని ఒకచోట పదిలంగా భద్రపర్చుకోవాలి.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment