Tuesday, July 5, 2011

గిఫ్ట్ కొట్టు - రేటింగ్ పట్టు

ప్రేక్షకో రక్షతి రక్షితః అన్నట్లు ఛానల్స్ వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌కి ఏ మాత్రం తీసిపోని రీతిలో న్యూస్ ఛానెల్స్ కూడా వ్యవహరిస్తున్నాయి. లంచానికి మరో అందమైన పేరు గిఫ్ట్. బహుమతి ఎంతటి కిక్ నిస్తుందో అది అందుకున్న వారికే తెలుస్తుంది. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ బహుమతులు ఎరగా వేసి ప్రేక్షకులను రక్షించుకునే పనిలో పడిపోతున్నాయి.

ప్రేక్షకుడిని ఎటూ కదలిపోకుండా తమ ఛానల్ వైపేలా చూసేటట్లు చేసుకోగలిగితే టిఆర్‌పి రేటింగ్ బావుంటుంది. అది బావుంటే ప్రకటన ఆదాయం వస్తుంది. అప్పుడు ఛానల్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుందని ఓ అంచనా. అయితే రోజురోజుకి పుట్టుకొస్తున్న న్యూస్ ఛానల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ దాడిని తట్టుకునేందుకు, మరింతగా బలపడేందుకు ప్రేక్షకులను బహుమతుల వల విసరక తప్పడం లేదు.

మొదట్లో బహుమతి గెలుచుకుంటే ఆనందపడిపోయే ప్రేక్షకుడు ఛానల్స్ మధ్య పోటీ పుణ్యమాని దానికి బాగా అలవాటు పడిపోయాడు. ఇప్పుడు కొత్తదనం కోసం కాకుండా ఏ ఛానల్ వారు ఏ ఎర వేస్తున్నారో గమనించి అటువైపు పరుగు పెట్టడానికి రిమోట్‌ని ఉపయోగిస్తున్నాడు. ఆఖరికి అదేదో సినిమా డైలాగ్ మాదిరి ‘నాకేంటంట?’ అని ప్రశ్నించుకుంటూ ఛానల్స్ వారికి టిఆర్‌పి ఛాలెంజ్ విసురుతున్నాడు.

ప్రస్తుతం ఏదైనా కొత్త ప్రోగ్రాం, సీరియల్ స్టార్స్ అవుతున్నాయంటే ‘నాకేంటంట?’ అన్నట్లు ప్రోమోలను గమనిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే మొదట కొన్ని ఎపిసోడ్ల వరకు తృణమో పణమో ప్రేక్షకులకు చెల్లించుకుంటూ ప్రోగ్రాంలు స్టార్ట్ కావడం విశేషం! శ్లాట్స్ ప్రకారం టైమ్ తీసుకున్న నిర్మాతలు బిజినెస్ బావుండాలని టిఆర్‌పి రేటింగ్ కోసం మొదట్లో ఎటువంటి ఎర వేయకపోయినా ప్రేక్షకులు జారిపోతున్నారని గమనిస్తే మాత్రం ఎరవేసి కాపాడుకోక తప్పడం లేదు. అయితే ఇక్కడో లింకు పెడుతున్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు గమనించి అప్పుడు అడిగే ప్రశ్నలకు ఎస్‌ఎంఎస్‌లు చేస్తే బహుమతి ఇస్తామంటున్నారు. బహుమతి మరీ విలువైనదైతే ప్రేక్షకులు ఫాలోకాక తప్పడంలేదు.

ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ పరిస్థితి ఈ విధంగా ఉంటే న్యూస్ ఛానల్స్ వారు కూడా ఎస్‌ఎంఎస్‌లతో ప్రేక్షకుల నుండి నిలువుదోపిడీ చేస్తున్నారు. అయితే వీరి తీరు వేరు. డిబేట్‌లు, చక్కగా ఇంటర్వ్యూలు నిర్వహించేటపుడు మీరు ఏకీభవిస్తారా? అంటూ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అభిప్రాయాలను సేకరించేస్తుంటారు. ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు, వివిధ సినిమా ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు న్యూస్ ఛానల్స్ వారు మీడియా పార్ట్‌నర్‌లుగా వ్యవహరిస్తూ ఎంట్రీ పాస్‌లు దక్కించుకోమని ప్రేక్షకులకు ఎస్‌ఎంఎస్‌ల ఎర వేస్తున్నాయి. వీటన్నింటికి భిన్నంగా టీవీ5 వారు కొన్ని ఆదివారాల పాటు ‘్ధనలక్ష్మీ ఐ లవ్‌యూ’ ప్రోగ్రాం నిర్వహించి క్యాష్ ప్రైజులిచ్చారు. ‘మహా’ ఛానల్ వారు వెండి కుంకుమ భరిణిలను ఓ ప్రోగ్రాం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇవికాక పండుగలకు స్పెషల్ గిఫ్ట్‌లను కూడా విసరడం జరుగుతుంది.

ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ‘పట్టుకుంటే పట్టు చీర’ సంవత్సరాల తరబడి జెమినిలో ప్రతి ఆదివారం ప్రసారవౌతుంటే ఈ మధ్యనే 2 గ్రాముల బంగారం గెలుచుకోండని ‘నెం.2 మహాలక్ష్మి నివాసం’ సీరియల్ వారు కొన్ని వారాలపాటు నిర్వహించారు. వారమంతా చూసి మూడు ప్రశ్నలకు సమాధానమిచ్చి ‘లేడీస్ బైక్’ గెలుచుకోమని ‘అపరంజి’ సీరియల్ వారు కొన్ని వారాలపాటు ప్రేక్షకులను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మధ్యనే ‘బంగారు కోడిపెట్ట’ అంటూ కొత్త గేమ్ షో కూడా స్టార్టయ్యింది.
మాటీవీ ఏకంగా ‘కొంగుబంగారం’ ప్రోగ్రాంతో దాదాపు 4 నెలలపాటు ప్రేక్షకులను మత్తెక్కించేసింది. ప్రతిరోజూ దాదాపు 10 గ్రాముల బంగారాన్ని కేవలం మాటలకే పంచిపెట్టేసి క్రేజీ ఛానల్‌గా మారిపోయింది. పాపులర్ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ ప్రోగ్రాం ‘ఇట్స్ మై షో’కు కూడా బంగారం, వెండితో వల విసిరింది. వేసవి సినిమాలకు సైతం గిఫ్ట్‌లు పెట్టి ప్రేక్షకులను కట్టేసింది మాటీవీ.

బంగా రం, వెండి కానుకలను ప్రవేశపెట్టడంలో జీ తెలుగుదే అగ్రస్థానమని చెప్పాలి. జీ తెలుగులో ప్రసారమైన ముద్దుబిడ్డ, కృష్ణావతారాలు, లేత మనసులు, డాక్టర్ చక్రవర్తి ఇలా ఎన్నో సీరియల్స్‌కి బహుమతుల వర్షం కురిపించింది. దాదాపు 2 వేల ఎపిసోడ్స్ దాటుతున్న ప్రతిరోజూ ‘మీ ఇంటి వంట’ ప్రోగ్రాంలో రోజూ ప్రేక్షకులను గెలిపిస్తూనే ఉంది. ‘షిర్డీ సాయికథ’ ద్వారా సాయి భక్తులకు సైతం వెండి విగ్రహం ప్రతిరోజూ బహూకరిస్తుంది. ‘రాధాకల్యాణం’ కాంటెస్ట్ ఒక్క వారంతోనే ఎత్తేయడం జీ తెలుగు లీస్ట్ కాంటెస్ట్‌గా చెప్పవచ్చు.

ప్రస్తుతం జీ తెలుగు లోగోను మార్చుకుని జూన్ 27 నుండి సరికొత్త కాంటెస్ట్‌ను నిర్వహిస్తుంది. 100 పట్టుచీరలు, 10 ఫ్రిజ్‌లు, 4 బైక్‌లు, 1 కారుని గెలుచుకోమని ప్రేక్షకులకు ఎరవేస్తుంది. అయితే దీని కోసం ప్రతిరోజూ సాయంత్రం మొదలు అర్ధరాత్రి వరకు దాదాపు 5 గంటలు పైనే జీ తెలుగు ప్రోగ్రాంలు ప్రతిరోజూ చూసి వారడిగే ప్రశ్నలకు ఎస్‌ఎంఎస్‌లు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వీరాభిమానుల్లో ఒకరికి ‘జీ తెలుగు వీరాభిమాని’ గిఫ్ట్‌గా కారు లభిస్తుంది.

వనితా ఛానల్‌లో ప్రతిరోజూ రన్ అవుతున్న ‘లక్కీ వనిత’ ఈటీవీలో ప్రసారవౌతున్న ‘అభిమాని’ వంటి కొన్ని ప్రోగ్రాంలు ప్రేక్షకులకు వల విసురుతూనే ఉన్నాయి. కొన్ని ఛానల్స్ ఫలానా కంపెనీ ఫోన్ వారే ఎస్‌ఎంఎస్‌లు పంపాలనడం కూడా ఇక్కడ గమనించాలి. కొన్ని ఛానల్స్‌కి అన్ని కంపెనీల వారు నిబంధనల ప్రకారం ఖర్చు చెల్లిస్తూ పంపవచ్చు.

ఛానల్స్ ఎర వేసే ఈ కానుకల పట్ల ప్రేక్షకుల్లో గందరగోళం వున్న కొందరు సంతృప్తిగానే ఉన్నారు. అయితే కానుక గెలుచుకోవాలంటే ఎస్‌ఎంఎస్‌లు తప్పనిసరి కనుక కానుక విలువను బేరీజు వేసుకుని ప్రేక్షకులు వాటిని పంపుతూంటారు. ఎస్‌ఎంఎస్ల ద్వారా అభిప్రాయాలను సేకరించినా, ఆన్సర్స్ సేకరించినా అది ఓ రకంగా ఛానల్స్‌కి వీక్షకుల సంఖ్యను చూపిస్తాయి. దానితోపాటు కంపెనీల మధ్య ఒప్పందముంటే భారీ ఆదాయం కూడా ముడుతుంది.

విలువైన బహుమతుల పట్ల ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపడంతో ఛానల్స్‌కి ఆ ప్రోగ్రాం నడిచే సమయంలో వేల నుండి లక్షల వరకు ఎస్‌ఎంఎస్‌లు రావడం చాలామందికి తెలియదు. పైగా ప్రేక్షకులు నాలుగైదు సిమ్స్ వాడటం వలన అన్నింటి నుండి ఎస్‌ఎంఎస్‌లు చేస్తే వాటి సంఖ్య కొండలా పెరిగిపోతుంది. వెల్లువలా వచ్చి పడే వీటి నుండి ఒకరిని సెలెక్ట్ చేసి చూపడం వలన ప్రేక్షకుడు పోగొట్టుకున్న డబ్బు గురించి ఇట్టే మరిచిపోతున్నాడు. తిరిగి రేపటి ఎపిసోడ్ గురించి ఎదురుచూస్తూ బానిసై పోతున్నాడు. ఈ రకంగా ఛానల్స్ ప్రేక్షకులను కట్టి పడేయడంలో చాలా వరకు సక్సెస్ సాధిస్తున్నాయనే చెప్పాలి. బహుమతులను ఎరవేయడంలో ప్రతి ఛానల్ ఏదో ఒక ట్రిక్‌ను ఫాలో అవుతూనే ఉన్నాయి. బహుమతులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఏ ఛానల్ కూడా తీసిపోదనే చెప్పాలి.

ఛానల్ కాంటెస్ట్‌ల వెంట ఎక్కువగా పరిగెట్టేది గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారేనని చెప్పాలి. నగర ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాల వారు కూడా వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. మొత్తానికి ప్రేక్షకులను తమ ఖాతాలో వేసుకునే దిశలో స్టూడియోలో నిర్వహించే ప్రోగ్రాంలు కొన్నయితే నేరుగా ప్రేక్షకుల మధ్యకేపోయి నిర్వహించేవి కొన్ని ఉన్నాయి. ప్రేక్షకులకు ఇచ్చే కానుకలను స్పాన్సర్స్ చూసుకుంటే ఎస్‌ఎంఎస్ ఆదాయాన్ని ప్రేక్షకుల సంఖ్యను ఛానల్స్ తమ ఖాతాలో వేసుకుంటున్నాయి.

ఏ జాతి చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్నట్లు ఏ ఛానెల్ చూసినా ఎస్‌ఎంఎస్‌ల గోలే. సామాన్య ప్రేక్షకుడు ఖర్చు చేసినంత ఖర్చు చేయకపోయినా ఇదో రకం పిచ్చి... జూదం అంటూ కొట్టి పారేసే కొంతమంది ప్రేక్షకులు ఛానల్స్ ఇచ్చే గిఫ్ట్‌లను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోవడం కొసమెరుపు. మొత్తానికి ఎవరి గోల వారిదన్నట్లు ప్రేక్షకుల కోసం ఛానల్స్.. గిఫ్ట్స్ కోసం ప్రేక్షకులు ఉన్నారు. ఎవరి లాభం వారిది.. ఎవరి అంచనాలు వారివి..

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment