ప్రాచుర్యం, గుర్తింపుతోపాటు ఆదాయం అధికంగా లభించే అవకాశం వున్నా టీవీ సీరియళ్ళలో అవకాశాల కంటే నాటకరంగంలోనే జనాదరణ ఎక్కువగా వుంటుందని ప్రముఖ రంగస్థల నటీమణి సురభి ప్రభావతి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సురభి కళాకారుల కుటుంబానికి చెందిన ప్రభావతి కావలి పట్టణంలో నిర్వహిస్తున్న డిఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలకు హాజరైన సందర్భంగా శనివారం విలేఖరులతో తన భావాలను పంచుకున్నారు. స్థానిక రామ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యధిక సంఖ్యలో నాటకరంగ కళాకారులున్న ఏకైక కుటుంబం తమదే కాగా కాలక్రమంలో సరైన ప్రోత్సాహం లేక అనేకమంది ఇతర వ్యాపకాలు వెతుక్కోక తప్పలేదని చెప్పారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో హైదరాబాద్‌లో నిర్మించుకున్న సురభి కాలనీలో తమకు నివాసం దొరకడం కొంత ఊరటనిచ్చిందని అయితే ఉపాధి పరంగా కేవలం నాటకరంగానే్న నమ్ముకున్నందున పెద్దగా ఫలితం లేదని తెలిపారు. బాలనటిగా గుణ సుందరి, మదనకామరాజు నాటకాల ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టిన తాను ఇప్పటివరకు సుమారు 300 నాటికలు, నాటకాల్లో వివిధ పాత్రలు పోషించగా మృతసంజీవిని నాటకంలో రాజ్యలక్ష్మి పాత్ర, శశిరేఖాపరిణయంలో హీరోయిన్ పాత్రలు తనకు గుర్తింపు తెచ్చాయన్నారు. అలాగే విప్రనారాయణలో దేవదేవి పాత్రకు బాపూబాటలో అనే నాటకంలో ప్రధాన పాత్రకు రెండుసార్లు నంది అవార్డులు లభించడం సంతృప్తినిచ్చిందన్నారు. వీటితోపాటు ఆయుష్మాన్‌భవ, నరకాసుర, విప్రనారాయణ నాటకాల్లో నటనకు గాను మూడుసార్లు గరుడ అవార్డులు సాధించినట్లు ప్రభావతి తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా సుమారు 3వేలకుపైగా ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశం దక్కినందున పారితోషికాల పరంగా ఒడిదుడుకులు లేని జీవనం సాగించగల్గుతున్నామన్నారు. ఇటీవల బతుకమ్మ, మహాత్మా సినిమాల్లో కొంత ప్రాధాన్యతగల పాత్రలు పోషించగా పూతరేకులు, మాయాబజార్, సరస్వతీ వైభవం వంటి టీవీ సీరియళ్ళలో నటించినట్లు చెప్పారు. అయితే టీవీ, సినిమాల్లో అవకాశాల కోసం నటనలో ప్రతిభతో పాటు ఎవరో ఒకరి అండ అవసరం కాగా సురభి కళాకారులకు అలాంటి గాడ్‌ఫాదర్‌లు లేనందున నాటకరంగాన్నే నమ్ముకోక తప్పలేదని చెప్పారు. తమ పిల్లలు చదువుకుంటూనే అడపాదడపా నటిస్తుంటారని, తన భర్త నాగేష్ కూడా ఇదే రంగంపై ఆధారపడినట్లు ప్రభావతి వివరించారు. కళారంగంలో కావలికి గల విశిష్ట ఖ్యాతిని విన్నప్పటికీ పరిషత్‌కు హాజరవడం ఇదే తొలిసారి కాగా ఇక్కడి కళాకారుల చూపించే ఆదరాభిమానాలు మరువలేని విధంగా ఉన్నాయన్నారు.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment