Saturday, July 2, 2011

మీడియాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్

తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాజీనామాల నిర్ణయంపై తాము వెనక్కి తగ్గినట్లు మీడియా వార్తలను ఇచ్చిందని, దీన్ని తాము తీవ్రంగా తీసుకుంటున్నామని, ఇటువంటి వార్తాకథనాలను మానుకోకపోతే ఏం చేయాలో తమకు తెలుసునని, ఇది తమ హెచ్చరిక అని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శుక్రవారం సమావేశానికి వచ్చిన ఒక్క శాసనసభ్యుడు మాత్రమే రాజీనామా నిర్ణయాన్ని వ్యతిరేకించారని, ఆ శాసనసభ్యుడు ఎవరో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. సమావేశానికి వచ్చినవారి గురించి మాట్లాడకుండా రానివారి గురించి ఎందుకు మాట్లాడుతారని ఆయన అన్నారు.

మంత్రి దానం నాగేందర్ తమ సమావేశాలకు గత రెండేళ్లలో ఎప్పుడూ రాలేదని, ఇద్దరో ముగ్గురో మంత్రులు తమ సమావేశాలకు రావడం లేదని, ఆ విషయం అందరికీ తెలుసునని, వారిని ప్రజలు చూసుకుంటారని, కొత్తగా ఆ మంత్రులు రావడం లేదని ఎందుకు అడుగుతారని ఆయన అన్నారు. తామంతా కలిసికట్టుగా ఉన్నామని ఆయన చెప్పారు. శుక్రవారం సమావేశంలో 21 మంది సభ్యులు రాజీనామాకు ఆమోదించారని ఆయన చెప్పారు. మీడియా పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం కూడా అన్నారు. తాము 11 మంది పార్లమెంటు సభ్యులం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేశామని, ఇప్పుడు కూడా తాము కలిసే ఉంటామని ఆయన చెప్పారు.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment