ఇది వరకంటే ప్రతిభ ఉన్నా, దానిని వ్యక్త పరచుకోడానికి బలమైన వేదిక లేక ఉన్న టాలెంట్‌ని తమంత తామే బలహీనపరచుకునే సందర్భం ఉండేది. కానీ ఛానల్స్ ధర్మమా అని మారుమూల పల్లెల్లో ఉన్న వారు సైతం టాలెంట్‌ని గణనీయ ప్రజావళి దగ్గరకు చేర్చగలుగుతున్నారు. ఇది అభినందించదగ్గ, ఆహ్వానించదగ్గ విషయం. ఈటీవీ ప్రసారం చేసిన, చేస్తున్న ‘పాడుతా తీయగా...’ చెప్పుకోదగ్గది. ఇందులో ప్రసారమైన స్వరాలు అనంతర కాలంలో వెండితెరలోనూ వెలిగిన దాఖలాలూ చూశాం. ఇలా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ కార్యక్రమం ప్రస్తుతం కొన్ని సందర్భాలలో గాడి తప్పుతుందేమోననిపిస్తోంది. ఏ కార్యక్రమమైనా ఆ కార్యక్రమ లక్ష్యం తదితరాలపై ఎక్కువ దృష్టి పెడితే బావుంటుంది. కానీ ‘పాడుతా తీయగా...’ లక్ష్యదిశగా సాగడానికే ప్రయత్నిస్తూ మధ్యమధ్య అసంగతాలకీ, అవసరాన్ని మించి ఆస్కారం కల్పిస్తున్నారు. అవేమిటో చూద్దాం. ఓ అభ్యర్థి తర్వాత ఓ అభ్యర్థి తమ గళాన్ని వినిపించడం, దాంట్లో ఉన్న తప్పొప్పులని సంబంధిత రంగంలో అపార అనుభవమున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కార్యక్రమ వ్యాఖ్యాతగా చెప్పడం వరకూ ఓకే. కానీ పక్కనున్న ముఖ్య అతిథిగా విచ్చేసిన వారితో సరదా మాటల నెపంతో పదేపదే మాట్లాడటం అనేది అవసరం లేదు. ఈ మధ్య ప్రసారమైన ఈ కార్యక్రమంలో అలా ముఖ్య అతిథిగా విచ్చేసిన గాయనితో ‘ఓ పాత సినిమా పేరు ప్రస్తావించి.. అది నువ్వు చూశావా?’ అని అడగడం.. అంటే నేను అప్పుడు ఉన్నానా? అని అర్థం వచ్చేలా ఆమె సమాధానమివ్వడం లాంటివి జరిగాయి. విషయమేమిటంటే ఇలా పాత సినిమాల ప్రస్తావన రావడం వల్ల నేను అంత పెద్దదాన్నా? అన్న అర్థం గోచరించడం ‘అవును నువ్వు పెద్దదానివే’ అని బాలు ఆట పట్టించడం జరిగింది. ఇదేదో ఒకసారికి పరిమితమైతే ఫర్వాలేదు. కానీ మాటిమాటికీ ఇదే ఆనాటి కార్యక్రమంలో పునరావృతమైంది. దాంతో చూపరులకు చిరాకు పుట్టింది. ఇలాంటి వాటిని తక్షణం పరిహరించాలి. అయితే ఇదే కార్యక్రమంలో పాట స్వరపరంగా అద్భుత సంపత్తి ప్రదర్శించినా, భాషాపరంగా తెలియకుండానే దొర్లే దోష భూయిష్టతను సరిదిద్దే ప్రక్రియను బాలసుబ్రహ్మణ్యం చేయడం బాగుంది. జూన్ 27న సినీ దర్శకుడు, రచయిత జంధ్యాలను స్మరిస్తూ వారి చిత్రాల్లోని పాటల్ని చిన్నారులతో పాడించిన ఎపిసోడ్ ఆకట్టుకుంది. ఇందులో కూడా ముఖ్య అతిథిగా వచ్చిన కోట శ్రీనివాసరావుని బాలు, బాలుని కోట పరిమితి మించి పొగడటం కూడా అనవసరమే. ఎందుకంటే ఇద్దరూ కూడా పరిచయ వాక్యాలూ, వగైరాని మించిన ఖ్యాతిని గడించినవారే.
ఎలా బ్యూటిఫుల్లో?.. కొన్నికొన్ని పేర్లకీ కార్యక్రమానికీ సాపత్యముండదు. అలాగే వ్యక్తుల విషయాల్లోనూ ఇది వర్తిస్తుంది. మోహనరావు అన్న పేరున వ్యక్తి అందరూ అనుకునేంత మోహన రూపానికి చాలా దూరంగా ఉండొచ్చు. అలాగే దయానిధి అన్న నామధారి దయ విషయంలో దరిదాపుల్లో ఉండకపోవచ్చు. అలాగే ఇప్పుడు జీ తెలుగు ఛానల్‌లో రాత్రి 10.30కి వస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అన్న పేరుతో వస్తున్న దాంట్లో ఏమి బ్యూటిఫుల్‌నెస్ కనిపిస్తుందన్నది ప్రశ్నార్థకమే. ఈ కార్యక్రమ కానె్సప్ట్ ప్రకారం ఏదో ఒక టాపిక్ తీసుకుని ఇద్దరు వ్యక్తులు మాట్లాడటం మధ్యలో సినిమా క్లిప్పింగులు చూపడం, అసలు ఇలా సినిమా బిట్స్ చూపించి టైంపాస్ చేయడం ఛానల్స్‌కు సర్వసాధారణమై పోయింది. చెప్పే వ్యాఖ్యానానికి, చూసే సన్నివేశానికీ పొంతన కుదరడం మాట అటుంచి, అసలు వారు మాట్లాడుకుంటున్న మాటలే విసుగు పుట్టిస్తున్నా యిందులో. జూలై 1న ప్రసారమైన ఈ కార్యక్రమంలో డ్రైవింగ్ నేర్పడం గురించి ఉన్న ఇద్దరు వ్యక్తులూ సంభాషించుకున్నారు. ఆ డ్రైవింగూ సైకిలు నేర్పడం గురించి.. సైకిల్స్‌లో రకాలూ, ఆటో రిక్షా, లారీ, కారు అంటూ రకరకాల వాహనాలు - చివరకు హెలికాప్టర్ వరకూ అన్నీ నేర్పేస్తా అంటూ ఏవేవో మాట్లాడతాడు. వినోద ఛానల్స్ ప్రధాన ఆశయం హాస్యాన్నందివ్వడమే అయినా, అలా అందించే హాస్య, ఆహ్లాదకర హాస్యంలా ఉండాలి తప్ప, ఇలా హాస్యాస్పదంగా ఉండకూడదు. అలాగే అంతకు ముందు రోజు నిజం, అబద్ధం అంటూ ఈ కార్యక్రమంలో చర్చించారు. అదీ అసంబద్ధంగానే ఉంది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment