Wednesday, July 13, 2011

శ్రీరస్తు - శుభమస్తు...

‘పెళ్ళి..’ ఈ రెండక్షరాల మాట వింటేనే చాలు ఎలాంటి ప్రవృత్తిగల మనిషైనా కాసేపు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోతాడు. ఇలా గతంలోకి వెళ్లడం పెళ్లైన వాళ్లు చేసే పని. పెళ్లి కానివాళ్లయితే కాబోయే కల్యాణం గురించి కలలు కంటూ ఉంటారు. ఇలా మానవ జీవితంలో దాదాపు అందరితో మమేకమై పోయిన ఈ మహత్తర అంశాన్ని ఆలంబనగా తీసుకుని ‘పెళ్లి పుస్తకం’ పేరిట మాటీవీలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఓ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో ప్రతి వారం ఓ ప్రముఖుని పెళ్లి ముందు, అనంతర అనుభవాల్ని వారి జీవిత భాగస్వామితో కలిపి ప్రేక్షకులతో ముచ్చటించడం జరుగుతోంది. ఈ పద్ధతి అధిక శాతం చూపరుల్ని ఆకట్టుకుదేనైనా, దీనికి మరింత వ్యక్తిగత నైపుణ్యం జోడిస్తే ఇంకా వీక్షకులకి చేరువయ్యే అవకాశం ఉంది.

వివిధ విభాగాలు
కార్యక్రమ తీరు ప్రకారం ‘కల్యాణ తాంబూలాలు’ శ్రీరస్తు - శుభమస్తు, పెళ్లైన కొత్తలో, తర్వాత సంఘటనల భాగాలతో ఉంటుంది. ఎవరైనా సరే.. తమతమ జీవితాల్లో ఉన్న మధురమైన ఘట్టాలనే గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తారు. కాస్త అరుచికరమైన అనుభూతైనా సరే.. బహిర్గతపరచడానికి మానవ నైజం ఒప్పుకోదు. ఇందులోనూ అంతే. అయితే కొంత వైవిధ్యంగా వాటినీ ఇందులో స్పృశించే దిశగా పాక్షికంగా సాగింది. ఇది వారి జీవితంలోని సున్నితమైన అంశాల్లోకి తొంగి చూడటం ప్రేక్షకుల ఉద్దేశం కాకపోయినా అలాంటి సందర్భాలు వీరికొస్తే ఎలా చలిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి అన్న దానికి ఇది ఓ సూచిక అవుతుంది. ఈ కార్యక్రమ పరంపరలో ఈ మధ్య ప్రముఖ దర్శకుడు బి.గోపాల్, మిమిక్రీ కళాకారులు హరికిషన్ దంపతులు పాల్గొన్నారు. ఇద్దరూ జన సామాన్యానికి తెలిసినవారే. కానీ బి.గోపాల్ వారి సమకాలీన దర్శకుల్లా ఎక్కువగా తెర ముందుకు వచ్చే వ్యక్తి కాదు కనుక, ఆయన జీవితంలో వచ్చిన వెలుగునీడలు చర్చించడం కాస్త కొత్త. ఇద్దరి ప్రముఖుల జీవితాల్లోనూ వారివారి రంగాల్లో పైకి రావడానికి సతీమణులు ఇచ్చిన తోడ్పాటు సహజమైనదే అయినా ప్రత్యామ్నాయం కోసం వెతుకులాడక పరిస్థితులకు వెరవకుండా ముందుకెళ్లడం అభినందనీయం. ముఖ్యంగా హరికిషన్ కొచ్చిన ఆరోగ్యపర ఇబ్బందికి సకాలంలో తానున్నానని ముందు వెనుకలు చూడకుండా వారి భార్య ప్రొసీడవడం మార్గదర్శకంగా అనిపించింది. ఇది ఊరికి ఉపకారం కాకపోయినా సకాల ఆచరణ అని మాత్రం చెప్పవచ్చు.

ఓవర్ యాక్షన్ తగ్గిస్తే..
కార్యక్రమంలో చెప్పేవారు అరమరికలు లేకుండా (హరికిషన్ విషయంలో అసలు కన్నా నాటకీయత ఎక్కువ కన్పడింది. ఇది తగ్గిస్తే ఇంకా సహజంగా ఉండేది) చాలావరకు చెప్పినా, వ్యాఖ్యాత్రి కొన్నిచోట్ల చూపిన అతి స్పందన ఏ రకంగా చూసినా సమంజసం కాదు. తాను తన కాబోయే సహధర్మచారిణి ఫొటో తొలిసారి చూసినప్పుడు కరెంటు పోయి చీకటిగా ఉందని హరికిషన్ చెప్పినపుడు ‘అంటే చీకటిలో కారుచీకటిలో..’ అంటూ అతిగా నటిస్తూ అభినయించడం లాంటివి కార్యక్రమ ఫోకస్‌ని పక్కదారి పట్టిస్తుంది. ఇదంతా ఇలా ఇంటర్వ్యూ చేసేవారు కూడా స్వతహాగా నటీమణులో, నృత్య కళాకారిణులో లేదా ఇతర కళారూపాల ప్రసిద్ధులో కావడం వల్ల వచ్చిన తంటానా? అయినా సందర్భానికి తగినట్లు టాలెంట్‌ని నియంత్రించుకుంటేనే కార్యక్రమం ప్రేక్షక రంజకం అవుతుంది.

కథలిలా వెళ్లాల్సిందేనా?
అభివృద్ధి చెందేశాం.. అంతా ఆధునికమై, ఆలోచనల సరళీ మారిపోయింది... అంటూ తరచూ మనం సమాజంలో పలు వర్గాల నుంచి వింటూంటాం. కానీ ఇంకా తెలుగు సీరియల్స్ కథాగమనం తీరులో ఏమీ మార్పులేదు. ఎక్కడ వేసిన.. తీరులో ఉందనడానికి తాజా ఉదాహరణ ‘కుంకుమరేఖ’ (ఈటీవీలో రోజూ రాత్రి 7 గంటలకు వస్తున్నది) అనుకోని సందర్భాలలో జరిగే ఊహించని పరిణామం వల్ల పరాజితులమై పోయామన్న భావన వారి నుంచి తొలగించి అందరిలాగే వారూ ఉండాలన్న దిశగా సీరియల్స్ నడవాలి. లేదా సమకాలీన అంశాలను స్పృశిస్తూ వీలైతే అందులో ఎదురయ్యే సమస్యలకు ఆచరణ పూర్వక సూచనలు చేయాలి. ఇవేవీ లేకుండా అమ్మాయి అబ్బాయి ట్రాప్‌లో పడటం, మోసపోవడం, మరో వ్యక్తి ఆమెకోసం అర్రులు చాచడం, ఒప్పుకోకపోతే వీలైనంత విలనీని ప్రదర్శించడం వగైరా నలిగి, అరిగి, అర్థంలేని సంఘటనల సమాహారాలతో సీరియల్స్ నడపడం ఎవరి విజ్ఞత పరీక్షించడానికో తెలియడం లేదు. ఇంచుమించుగా ఇదే తీరులో నడుస్తున్న ఈ సీరియల్‌కు ప్రముఖులు నేపథ్య బాధ్యత వహించడం? ఉదాహరణకు ఏదైనా ఓ మాట వింటే అది అందరికీ తెలియజెప్పేవరకు మనసూరుకోని మనస్తత్వం కల పాత్రల్ని ఓ వెయ్యికి పైగా వివిధ సృజనాత్మక కార్యక్రమాల్లో చూసేశాం. మళ్లీ ఇందులో ప్రవేశపెట్టిన ఆ స్వభావపు పాత్ర ఎవరిని అలరిస్తుంది? అలాగే ఫలానా వారి అబార్షన్ కాగితం కావాలని వచ్చిన వ్యక్తికి ఆ పనిని లంచం ఎరచూపి ఆస్పత్రిలో సంపాదించడం వంటివి ఈ ధారావాహిక భాగంలో చూపినంత సులువుగా కుదరదేమో?! ‘ఆడపిల్ల సున్నితంగా ఉండాలి తప్ప మరీ ఇంత సున్నితంగానా?’ అన్న సంభాషణ మాత్రం అప్పటి స్థితికి సరిపోయింది. ప్రాచీనతని, సంప్రదాయాన్నీ గౌరవించడంలో తప్పు లేదు. కానీ అంత మాత్రంచేత ఆధునికతనీ, ప్రస్తుత కాలపు పోకడల్నీ పట్టించుకోకపోవడం బావుండదు.

తప్పుల్లేకుండా మాట్లాడలేమా?
ఈ మధ్య అమెరికాలో జరిగిన తెలుగు సంబరాలకు ముఖ్య అతిథిగా మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ చానల్, పత్రికాధిపతి వెళ్లారు. ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో అక్కడి తెలుగు మహిళ ఒకామె ‘మేం స్వరాష్ట్రానికి ఇంత దూరంలో ఉండి తెలుగు భాష పట్ల మమకారంతో పిల్లలకి తప్పుల్లేకుండా మాట్లాడటం, చదవడం నేర్పుతున్నాం. కానీ తెలుగు రాష్ట్రంలో ఉండి రాజధాని వేదికగా నడిచే ఛానల్స్‌లో వస్తున్న యాంకర్ల యాక్సెంట్, అక్షరాల్ని తప్పుల్లేకుండా చదవని విధానంగానీ చూస్తూంటే బాధేస్తోంది. అలా కాకుండా తప్పుల్లేకుండా భాషని పలికే యాంకర్లే తెలుగు నేలపై మీకు దొరకడం లేదా? అని ఎంతో ఆవేదనతో అడిగారు. అందుకా ఛానల్ అధిపతి నిస్సంకోచంగా ‘దొరకడం లేదు..’ అని చెప్పి తన చానల్ కోసం పరిశీలించినప్పుడు అందరూ అనుకునే లోపరహిత ఉచ్ఛారణ గల యాంకర్ల కోసం చేసిన కృషి, అందులో విఫలమైన తీరు వివరించారు. ‘అందుకే రాజీపడిపోవల్సి వచ్చింది. వొత్తుల్లేకుండా భాష నుచ్ఛరించే వారే ఎక్కువ’ అని చెప్తూ, ‘మీరు కనుక ఇండియా వచ్చి ప్రోగ్రామ్‌లు చేస్తానంటే అవకాశం కల్పిస్తా’నంటూ ఆఫర్ కూడా చేశారాయన. ఈ కార్యక్రమం కూడా ఎబిఎన్ చానల్‌లో ప్రసారమైంది. దీన్నిబట్టి తెలుగు యాంకరింగ్ స్థితి ఎలా ఉందో తెలుస్తోంది. సువ్యవస్థితమైన నట శిక్షణాలయాలతోపాటు తెలుగునాట ప్రమాణాల కనుగుణంగా కార్యక్రమ వ్యాఖ్యానాలు చేయగల సమర్థతను అందించే సువ్యవస్థిత శిక్షణ కేంద్రాలు బాధ్యతగల వ్యక్తుల నుంచి ఏర్పడినప్పుడు గానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదేమో?!

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment