ఎ.టి.ఎం... ఈ పొడి అక్షరాలతో కలిసిన సంక్షిప్త నామానికి మనందరికీ తెలిసిన విస్తృతార్థం ‘ఎనీ టైం మనీ’ అని. కానీ దీనికా మధ్య ఓ సినిమాలో ‘ఎనీ టైం మర్డర్’ అని మరో అర్థం చెప్పారు. అయితే ఇప్పుడిదే సంక్షిప్త నామం (ఎ.టి.ఎం.)తో ప్రతి ఆదివారం ఈటీవీ ఉదయం పదిన్నరకి ఓ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇక్కడ ఎటిఎం అంటే అర్థం అన్నీ తమాషా ముచ్చట్లే... అని. ఇందులో ప్రతి ఆదివారం ఓ సినీ ప్రముఖుని ముచ్చట్లు ప్రసారం చేస్తున్నారు. సినిమాకి సంబంధించి ఓ ముచ్చట టీవీలో వచ్చినా ఆ ముచ్చటని మరో రూపంలో టీవీలోనో, పత్రికల ద్వారానో ప్రేక్షకులు అంతకు ముందు తెలుసుకున్న వారయ్యే ఉంటారు. ఆ సంగతీ ఇందులో మరోమారు రుజువైంది. ఈ పరంపరలో ఈ మధ్యన ఈ శీర్షికలో సంగీత దర్శకుడు కోటి గురించి ముచ్చట్లు చెప్పారు. మామూలు నిన్నగాక మొన్నొచ్చిన వారి వివరాలే టీవీ ఛానల్స్‌లో పదేపదే చూపడం వల్ల అందరికీ తెలుసు. అందులోనూ ఇలా కోటి లాంటి సుదీర్ఘ సంగీత ప్రయాణం చేసిన వారి విషయంలో అయితే ఈ బాపతు చర్విత చర్వణాలకు కొదవే లేదు. కానీ కొంత వైవిధ్యం కోసం అనుకుంటా అలా ప్రముఖులతో ముచ్చట్లు చెప్పించే యాంకరమ్మ యాసను సోది చెప్పేవాళ్లదిలా చేశారు. ఈ బాపతు యాస టీవీల్లోకి వచ్చే కొత్తకొత్త యాంకర్లకు ఇస్తే కాస్త కళగా ఉండేదేమో కానీ, ఝాన్సీ లాంటి అందరికీ తెలిసిన వ్యాఖ్యాత్రి కివ్వడంతో రాణించలేదు. అంటే ఆ భాషను ఆమె సరిగా పలకలేదని కాదు... కానీ అనేకానేక వేషాల్లో ఆమెను చూసిన ప్రేక్షకులకు ఇది అంతగా పట్టలేదు. ముందే చెప్పినట్లు కోటి గురించి కొత్తగా తెలిపేది ప్రేక్షకులకేముంటుంది? ఇప్పటికే కోటానుకోట్ల సార్లు పలు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారమై పోయాయి. ఒక పాయింటే కొత్తగా ప్రస్తావితమైంది. అది - మేం గతంలో ఫాస్ట్ మీట్ కొట్టాం. అప్పుడు మెలొడీకి మంచి మక్కువ చూపేవారు. ఇప్పుడు ఫాస్ట్ బీట్‌లెక్కువగా లైక్ చేస్తున్న కాలంలో మాకు సాఫ్ట్ సాంగ్సే ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నాయి. ఫాస్టయినా, సాఫ్టయినా అందులో ఆకట్టుకునే మెత్తని వరసుంటే అది అందరికీ ఆమోదయోగ్యం అవుతుంది. అది కోటి వంటి లబ్ధి ప్రతిష్టులకు తెలియంది కాదు. ఇక కార్యక్రమంలో ఎక్కువ భాగం ముచ్చట్లు చెపుతున్న మనిషిని నుంచోబెట్టి చెప్పించేయడం స్కూల్లో విద్యార్థిని బెంచ్‌పై నిలబెట్టి చెప్పించినట్లుంది. ఈ ధోరణి మారాలి.
అడగక ఇచ్చిన మనసు..
ఒకప్పుడు సీరియల్స్ కథలు అత్తాకోడళ్ల చుట్టూ తిరిగితే ఇప్పుడు ప్రేమలు - పెళ్లిళ్లు లాంటి వాటి చుట్టూ తిరుగుతున్నాయి. ఆ తిరగడాల్లో కూడా కొంత తర్కానికి చోటిస్తే ఓకే కానీ అలాంటి వాటికి బహు దూరంగా వెళ్లిపోతోంది ‘అడగక ఇచ్చిన మనసు...’ (మాటీవీలో ప్రతిరోజూ రాత్రి 8.30కి వస్తున్నది) అమ్మాయి - అబ్బాయి ఒకర్నొకరు ఇష్టపడతారు. కానీ పెద్దవాళ్ల అభ్యంతరాల వల్ల అది కుదరదు. తండ్రి తన కూతురికిచ్చి చేయాలనుకున్న వ్యక్తి విదేశాల్లో ఉంటాడు. అతను అమ్మాయితో మాట్లాడాలని చేసిన ప్రయత్నం అప్పటికే ఆమె ఇల్లు విడిచి వెళ్లడంతో వీలు పడదు. ఆ సంగతి తెలియనివ్వకుండా అమ్మాయి తండ్రి తీసుకుంటున్న జాగ్రత్తలు, వగైరా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నెట్‌లు, టీవీలు, సెల్‌లూ అత్యంత సహజ అవిభాజ్య అంశాలై పోయిన యువతరానికి వాటి నుంచి అమ్మాయిని నేను చాలా దూరంగా పెట్టాను అని చెప్పడం, ఆమె అలాంటి ఎలాంటి ఫోను ఆసరా లేకుండా ఉండడం... ఇవన్నీ ఏ రకమైన ట్రెండో అర్థం కాదు. ఇదిలా ఉంటే మరో కోణంలో నా మనవడికి ఆదర్శ వివాహమే అయినా వితంతు వివాహమే చేస్తానని మంకు పట్టు పట్టే తాత ఉపాఖ్యానం మరోవైపు సాగుతోంది. వితంతు వివాహం - ఆదర్శం వాటి ఉన్నతి వేరు. దాన్నిలా హాస్యానికి వాడుకోవడం విచారకరం. ఇందులో కాస్త బాగున్నవి సంభాషణలు. రాజకీయ పరిభాషలో మాట్లాడే దిలీప్ తండ్రి పాత్రధారికి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. అలాగే తండ్రి తాతల పరిస్థితిని విశే్లషిస్తూ ‘తాతకు ఆయాసం - తండ్రికి ఆవేశం...’ రెండింటిలో ఎవరికి ఏది ఎక్కువైనా నాకు అర్జంటుగా ఊరికి రమ్మని పిలుపొస్తుంది..’ లాంటివి సందర్భానుసారంగా ఉన్నాయి.
‘యువరాణి’ని ఇంకా రక్తి కట్టించవచ్చు..
చాలాకాలం తర్వాత ‘మిస్ ఇండియా’ గౌరవం మన తెలుగమ్మాయి వాసుకికి దక్కింది. ఈ సందర్భంగా ‘యువరాణి’ శీర్షికలో ఆమెతో సాక్షి టీవీలో జూలై 22న రాత్రి 9.30కు ఇంటర్వ్యూ ప్రసారం చేశారు. ఎందుకో ఈ కార్యక్రమం చూస్తోంటే ఉన్న అరగంట వ్యవధిని సరిగ్గా వినియోగించుకుని ఉపయుక్తకర సమాచారం అందివ్వలేదనిపించింది. మరి అనుభవజ్ఞురాలైన ప్రెజెంటరే ఈ కార్యక్రమాన్ని ఆనాడు సమర్పించినా ఈ ఫలితం ఉండడం ఉసూరుమనిపించింది. ఇది అతి సామాన్య ప్రేక్షకుడు కూడా ఇట్టే పట్టేసే అంశం. అదెలాగంటే వాసుకి తన సమాధానాల్లో భాగంగా ఓసారి నేను దేన్నీ ప్లాన్ చేసుకోను. ఆ సమయానికి అయ్యేవే అన్నీ’ అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినా తిరిగి ఇంకోసారి ‘మీ ఎజెండా ఏమిటి?’ అని ప్రశ్నించడం అర్థరహితం. అలాగే వాసుకి ‘నేను సినిమాల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదు. అవసరమైతే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళతానేమో’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా సూటిగా చెప్పినా తిరిగి యాంకర్ ‘మీరు భవిష్యత్తులో సినిమాల్లోకి వెళతారా’ అని అడగడమూ అనవసరమే. అయితే వాసుకీ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ- ‘నాకు సినిమా ఆఫర్లు వచ్చాయి. అటువైపు వెళ్లనని చెప్పను కానీ దాని కోసం ఎలాంటి ప్లానూ చేయలేదు’ అని చెప్పినట్లు ఓ పత్రిక ప్రచురించింది కూడా. దీన్ని రిఫరు చేస్తూనైనా ఇంటర్వ్యూ సాగి ఉంటే బావుండేది. అయితే అందాల రాణుల్లా వెలిగిన వారి తర్వాతి తప్పనిసరి ప్రస్థానం మోడలింగూ, సినిమాలేనా? అని వాసుకి ప్రశ్నించడం సమంజసం. వాటిపైన కాకుండా తనకంతకు ముందే పేరు తెచ్చిన న్యాయవాద వృత్తి, తద్వారా లభించిన రాజకీయ ఆసక్తి సంబంధితమైన వాటివైపు మనసు లగ్నం చేస్తానని చెప్పడం బాగుంది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment