సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో రామోజీరావుకు చెందిన ఈనాడులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై వస్తున్న వార్తాకథనాలకు కౌంటర్ ఇచ్చేందుకు సాక్షి టీవీ చానెల్ ప్రయత్నించింది. ఇందుకు సంబంధించి జగన్‌కు చెందిన సాక్షి చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో వైయస్ జగన్ ఆస్తులపై ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు వార్తాకథనాలను ప్రచురిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి పత్రికలోనూ, ఎబిఎన్ టీవీ చానెల్‌లోనూ జగన్ ఆస్తుల వ్యవహారాలపై వరుస వార్తాకథనాలను ఇస్తోంది. ఈ నేపథ్యంలో సాక్షి టీవీ చానెల్ ప్రతినిధి సిబిఐ ఐజి లక్ష్మినారాయణతో మాట్లాడారు.
జగన్ ఆస్తులపై తాము రూపొందించిన నివేదిక లీక్ కాలేదని ఐజి లక్ష్మినారాయణ చెప్పినట్లు సాక్షి చానెల్ తెలిపింది. తమ నివేదిక లీకయ్యే అవకాశం ఏ మాత్రం లేదని ఆయన చెప్పారు. కాగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వస్తున్న వార్తాకథనాలపై లక్ష్మినారాయణ అసహనం ప్రదర్శించారని సాక్షి చానెల్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. మీడియాకు చెప్పే విషయాలు ఏమైనా ఉంటే తాము చెబుతామని లక్ష్మినారాయణ అన్నారు. వైయస్ జగన్ ఆస్తులపై వస్తున్న వార్తాకథనాలపై తాము చర్య తీసుకునే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
Source: thatstelugu.oneindia.in
Source: thatstelugu.oneindia.in
No comments:
Post a Comment