Wednesday, July 13, 2011

సగం పాత - సగం కొత్త ‘ఫిఫ్టీ - ఫిఫ్టీ’ గేమ్‌షో

కాన్సెప్ట్ - యాంకరింగ్ - నిర్మాత - దర్శకుడు’ అనే ట్యాగ్‌తో అనతికాలంలోనే పాపులర్ అయిన ఓంకార్ చాలాకాలం తరువాత మాటీవీలో ‘ఫిఫ్టీ - ఫిఫ్టీ ఇట్స్ మై షో’తో సోమ, మంగళవారాల్లో రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు గేమ్ షో నిర్వహిస్తున్నాడు. గతంలో మాటీవీలోనే ‘అదృష్టం’ అన్న గేమ్ షో ప్రారంభించి కొన్ని ఎపిసోడ్స్ నడిపించిన ఓంకార్ సడెన్‌గా క్లోజ్ చేశాడు. ఇప్పుడు అదే షోను కొత్త పంథాలో రూపకల్పన చేసి ‘ఫిఫ్టీ - ఫిఫ్టీ’గా తెరపైకి తెచ్చాడన్న సంగతి రెగ్యులర్ వీక్షకులు ఇట్టే తెలిసిపోయింది.

ఈ షో ప్రసారాలు ప్రారంభం కాకముందే విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ‘ఇట్స్ మై గేమ్ షో’ అంటూ మాటీవీలో కొన్ని ఎపిసోడ్స్ చేయడంతో ఓంకార్ ‘ఇప్పుడు ఇది నా షో’ అంటూ డైలాగులు కొట్టినా అంత కిక్ నివ్వడంలేదు. గేమ్ షోలలో డబ్బును గెలుచుకోవడం ముందుకు వెళితే కోల్పోవడం సహజంగా కనిపిస్తుంది. ఇదే సూత్రంతో ఓంకార్ ఈ షో ఫార్మేట్ చేశాడు. అందుకే పార్టిసిపెంట్స్ ఒకసారి ఎంత గెలుచుకుంటాడో అంతే మొత్తాన్ని మైనస్ కాకుండా తరువాత ఆడాల్సి ఉంటుంది.

‘అదృష్టం’ షో మాదిరిగానే ఇక్కడ బాక్సులకు బదులుగా దిక్కులు ఎంచుకుని దానిలో ఎవౌంట్ వచ్చిందీ లేనిదీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యమధ్యలో కుబేరుడు బొమ్మ ఛాన్స్ కూడా పార్టిసిపెంట్‌కి లభిస్తుంది. దానిలో ఏదైనా లభిస్తే సరేసరి లేకపోతే కుబేరుని నవ్వుకు పార్టిసిపెంట్ నవ్వు కలుపుకోవాల్సి ఉంటుంది. గేమ్ షో సెట్ ప్రాపర్టీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు ఓంకార్ షోలకు ఎప్పుడూ ప్లస్‌గా కనిపించడం కామనే. ఫిఫ్టీ ఫిఫ్టీ గేమ్ షో పేరుకు తగ్గట్టుగానే సగం పాత సగం కొత్తల కలయిక ఫార్మేట్‌లో కనిపించడం ప్రధానంగా ప్రేక్షకులకు షో పట్ల ఆసక్తిని చంపేస్తుంది.

ఓంకార్ ఏ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించినా పార్టిసిపెంట్‌ని హైపర్ టెన్షన్‌కి గురి చేయడంలో సిద్ధహస్తుడు. పార్టిసిపెంట్ మీద మీదకు వెళ్తూ వారిని విసిగిస్తూ పార్టిసిపెంట్ కోరుకున్న దానిని రివీల్ చేయడంలో ‘వన్ సెకన్’ అంటూ ఆపేస్తూ గేమ్ షోను నడిపించడం ఓంకార్ స్టైల్. ఇది మొదట్లో అటు పార్టిసిపెంట్‌కి ఇటు టెలివిజన్ సెట్‌ల ముందు కూర్చున్న వారికి మంచి కిక్ నిచ్చినా ఇప్పుడది పరమ బోర్‌గా తయారైంది.

ఫిఫ్టీ - ఫిఫ్టీ గేమ్ షోలో పాల్గొనే పార్టిసిపెంట్ తనతోపాటు సహాయకులను తెచ్చుకోవచ్చును. అందరిని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఓంకార్ షోను నడిపిస్తున్నా ఈ షో పెద్దగా ఆకర్షించలేక పోతుందనే చెప్పాలి. ఈ షో మొదటి ఎపిసోడ్ నుండి సెలబ్రిటీల మీదే ఆధారపడిపోవడంతో సాధారణ ప్రేక్షకులు షోకు అంతగా లింక్ కాలేక పోతున్నారన్నది వాస్తవం.

ఫిఫ్టీ - ఫిఫ్టీ ఇట్స్ మై షో’ పేరు తగ్గట్టుగానే ఉంది. అందుకే పార్టిసిపెంట్ చివరగా మైనస్ ఎవౌంట్‌లో వుంటే ఓంకార్ కోరికకు ప్రామిస్ చేయాలి. ఒకవేళ ప్లస్ ఎవౌంట్‌లో వుంటే ఒక కన్నీటి గాథను చూపించి గెలుచుకున్న దానిలో ఇష్టమున్నంత దానం చేయాలి. ఇది ఈ షో ప్రత్యేకతని చెప్పాలి. బహుశా అందుకే కాబోలు ఓంకార్ ఏరికోరి సెలబ్రిటీలనే షోకు ఎంచుకుంటున్నాడనిపిస్తుంది. సాధారణ పార్టిసిపెంట్ అయితే ఎక్కువ మొత్తాన్ని ఇవ్వడేమోనన్న అనుమానం కాబోలు. ఏదేమైనా షోను ఎంత పర్‌ఫెక్ట్‌గా నిర్మిస్తున్నా నీరసంగానూ గతంలో చూసేశామన్న ఫీలింగూ కలగక మానడం లేదు.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment