రాజుల కాలంలో శత్రురాజ్యంపై విజయం సాధించాలంటే వారి కాల్బలం, ఏనుగులు, గుర్రాల బలం ఎంతో ముందు తెలుసుకునే వారు. అంతకు మించిన బలాన్ని సమకూర్చుకున్నాకే యుద్ధం చేసేవారు. రోజులు మారాయి. రాజరికం నుండి ప్రజాస్వామ్యంలోకి వచ్చాం. ఆయుధాలు కూడా మారాయి. అప్పుడు ఏనుగులు, గుర్రాలు ఆయుధాలు అయితే ఇప్పుడు మీడియానే ప్రధాన ఆయుధం. మీడియా బలం సమకూర్చుకోకుండా యుద్ధ రంగంలోకి అడుగుపెడితే ఎంత గొప్ప హీరో అయినా మట్టికరిచిపోతారని జనమే కాదు ఆ యోధుడు సైతం గ్రహించాడు. అందరి వాడిని.. అన్ని ఛానల్స్ నావే అనుకున్న చిరంజీవి చివరకు ప్రత్యర్థుల చానల్స్ ధాటికి తట్టుకోలేకపోయారు. అనుభవం అయిన తరువాత ఆయనకు తత్వం బోధపడింది. ఇప్పుడు సొంత చానల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఏదో ఒక రోజు అవకాశం రాకుండా పోదు. అప్పటి వరకు బలమైన ఆయుధాన్ని సమకూర్చుకోవాలనేది ఆయన లక్ష్యం. ఆయనో న్యూస్ ఛానల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
చిరంజీవి అనుభవమే కాకుండా తన తండ్రి అనుభవాన్ని సైతం దగ్గరి నుండి చూసిన జగన్ ముందు నుండి మీడియా బలాన్ని బాగానే అంచనా వేశారు. మీడియా విషయంలో తన ప్రత్యర్థి చంద్రబాబు కన్నా ఒక అడుగు ముందుకేశారు. సొంత మీడియానే కాకుండా అనుబంధ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. తాతకు దగ్గులు నేర్పుతావా? అనుకున్న ప్రత్యర్థి సైతం ఈ ఎత్తుకు పైఎత్తు వేశారు. దీంతో జగన్ ఒడిలో నుండి ఒక్కో మీడియా జారిపోతోంది. జగన్‌కు సొంత ఛానల్ ఎలాగూ చేతిలో ఉంది . ఒప్పందాలు ఏమిటో బయటకు తెలియదు కానీ సొంత ఛానల్‌తో పాటు కొన్ని చానల్స్ జగన్‌కు మద్దతుగా ఉండేవి. వీటిలో ఒక్కొక్కటి జారుకుంటోంది.
మొన్నటి వరకు ఒక నాయకుడిని తీవ్రంగా విమర్శించే ఛానల్ హఠాత్తుగా ప్లేటు మార్చి ఆ నాయకుడిని తీవ్రంగా విమర్శిస్తుంటే తెరపై చూసినప్పుడు నిష్పక్షితత్వానికి మారు పేరు అనిపిస్తుంది. లోతుగా విషయ పరిశీలన చేస్తే అసలు విషయం నిష్పక్షపాతం కాదు విధేయతగా మారింది అని తెలుస్తుంది.
2009 ఎన్నికల సమయంలో ఒక ఛానల్ మొదటి విడత పోలింగ్ మొత్తం టిడిపిని విమర్శిస్తూ, వైఎస్‌కు అండగా నిలిచింది. బాబు, ఆ ఛానల్ యజమాని ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలి. అక్కడ ఇద్దరూ తారసపడ్డారు. ఏంటయ్యా మనవాడివై ఉండి మనకు వ్యతిరేకంగా మీ ఛానల్ ఉందేమిటి? అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేస్తాం ఎటు నుండి సహాయం వస్తే అటుండాలి, మీ నుండి ఆశించిన సహాయం రాలేదు అన్నారు. ఏం సహాయం అందిందో కానీ మొదటి విడత పోలింగ్‌లో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ఆ ఛానల్ రెండవ విడత పోలింగ్‌లో బాబును భుజానికెత్తుకుంది. ఫలితాలు వచ్చాక మళ్లీ జగన్ పక్షం వహించింది. ఇప్పుడు ఛానల్ తన విశ్వసనీయతకు పచ్చదనం పులుముకుంది.
మరో ఛానల్ నిర్మొహమాటంగా జగన్‌కు రాంరాం చెప్పి కిరణ్‌లోని పాలనా పటిమను ప్రపంచానికి చాటడంలో మునిగిపోయింది.
గతంలో టీవి9 పట్ల చంద్రబాబు బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. మీ ఛానల్ వైఎస్‌ఆర్ కొమ్ము కాస్తోంది మీ సంగతి చూస్తాం, మిమ్ములను మేం బహిష్కరిస్తాం అని బాబు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ ఛానల్‌ను జగన్ కొనేశాడు అని టిడిపి నాయకులు బహిరంగంగానే విమర్శలు చేసేవారు. అందులో నిజం ఎంతో, తరువాత ఏం జరిగిందో కానీ ఇప్పుడా ఛానల్ పేరు వింటేనే జగన్ వర్గం మండిపడుతోంది. జగన్‌పై విషం కక్కడంలో ఆ ఛానల్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇక తెలంగాణ వారు ఈ ఛానల్‌కు తెలంగాణ వ్యతిరేకి అని ముద్ర వేశారు.
ఛానల్స్ ఆపద్బాంధవుడు
గతంలో ఒకే ఛానల్ ఉన్నప్పుడు వారు ఆడిందే ఆట వారు చెప్పిందే వార్త. ఇప్పుడు పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఛానల్స్ ఉండడం వల్ల అందరి వాదనలు తెలుసుకునే అవకాశం ప్రజలకు లభిస్తోంది. ఈ వారం టీవీ ఛానల్స్ పాలిట ఆపద్బాంధవుడిగా మందకృష్ణ మాదిగ మారారు. యాదిరెడ్డి ఆత్మహత్య అంశంపై ఢిల్లీలో దళిత అధికారిపై టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేయి చేసుకున్నారు. తరువాత క్షమాపణ చెప్పారు. అప్పటి వరకు జగన్ సభ ముగిసిన తరువాత మైదానంలో కనిపించే కొద్దిమందిని చూపించి జనం లేరు అని చెప్పడం, మద్యం షాపుల వద్ద కార్యకర్తలను చూపించడం. ప్రతి మీటింగ్‌కూ రెడీమేడ్‌గా ఇవే దృశ్యాలు చూపుతూ అదే అద్భుతంగా భావిస్తూ మురిసిపోయిన యువ బాబు ఛానల్ స్టూడియో ఎన్ ఢిల్లీ సంఘటనపై ఒక్కసారిగా మేల్కొంది. దళితునిపై దొరల దౌర్జన్యం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాబు ఆదేశాలపై టిడిపి దళిత నేతలతో పాటు దళిత సంఘాలతో మాట్లాడించారు. పయ్యావుల కేశవ్, దేవినేని ఉమా మహేశ్వర్‌రావువంటి కొందరు నేతలు ఈ సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారం చేడులో దళితులను ముక్కలుగా నరికి గోనె సంచుల్లో మూటకట్టి ఊరవతల పారేసిన ‘మహానుభావుల వర్గం’ ఒక్కసారిగా దళిత ప్రేమను కుమ్మరించింది. వారిలో ఇంతటి మార్పు వస్తే ఆహ్వానించదగిందే. ఈ సంఘటనతో పలు తెలుగు ఛానల్స్ పాలిట మందకృష్ణ మాదిగ ఆపద్బాంధువునిగా కనిపించారు. అప్పటి వరకు తెలంగాణ అంశంపై దాడి చేయడానికి అవకాశం లేదని ఆవేదన చెందిన ఛానల్స్ అన్నీ మందకృష్ణ మాదిగతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇక టిఆర్‌ఎస్‌కు చెందిన టీ ఛానల్ దీనిపై ఎదురుదాడి జరిపింది. టిఆర్‌ఎస్ దళిత నాయకులతో మాట్లాడించింది. పలు ఛానల్స్‌లో మందకృష్ణ మాట్లాడారు. ఈ అంశంపై ఐ న్యూస్‌లో మందకృష్ణకు ఆయన గురువు దళిత నాయకుడు ఉ సాంబశివరావుకు వాగ్వివాదం జరిగింది. టీ న్యూస్‌లో ఉ సాంబశివరావు మాట్లాడుతూ దాడిని ఖండించాల్సిందే,దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎంత వరకైనా పోరాడాలి. కానీ కొందరు వ్యక్తులు ఈ అంశాన్ని సాకుగా చూపించి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటికి మనం మద్దతుగా నిలిస్తే మన అసలు లక్ష్యం దెబ్బతింటుందని చెప్పారు.
గతంలో ఎబిఎన్ ఛానల్‌పై దాడికి దిగిన మందకృష్ణ తెలంగాణకు చెందిన నాయకుడు ఆయన చానల్స్‌కు ఆత్మబంధువుగా కనిపిస్తే, సీమాంధ్రకు చెందిన దళిత నాయకుడు ఉ సాంబశివరావు తెలంగాణ చానల్ టీ ఛానల్‌కు ఆత్మబంధువుగా కనిపించారు. రాజకీయాల్లోనే కాదు ఛానల్స్‌కు సైతం ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. నాయకత్వం స్థాయిలో ఉన్నవారు ఎలాంటి సందర్భంలోనైనా సంయమనం కోల్పోతే తన శత్రువు అవకాశం కల్పించిన వారవుతారని హరీష్ ఉదంతం నాయకులకు ఒక పాఠంగా నిలవాలి.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment