ఈటీవీ-2లో ప్రసారమైన నారీ భేరీలో ‘అంతర్జాలంలో అతివలు’ కార్యక్రమం గురించి వెలిబుచ్చిన కొన్ని సందేహాలకు నా వంతుగా కొన్ని మాటలు. చర్చలో అసలు గ్రామాల్లో నివసించే మహిళలకు ఏ స్థాయిలో చేరుతుంది అనే విషయంపై.. అసలు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఇంట్లో నెట్ ఉన్నా ఉపయోగించని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అసలు నెట్‌లో తెలుగు చాలా సులువుగా, ఖర్చు లేకుండా రాయొచ్చు, చదవొచ్చు అనే విషయం ఇంకా చాలామందికి తెలీదు. కంప్యూటర్, నెట్ అంటే అది ఉద్యోగం చేసేవాళ్లకు, విద్యార్థులకు మాత్రమే పనికొస్తుందని అనుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను కూడా ఈ విషయమై చైతన్యవంతం చేయొచ్చు అన్నారు.. మంచి ఉద్దేశమే. కాని నెట్ ఉన్నవాళ్లకు ముందు దాని ఉపయోగాలు తెలియజేస్తే మంచిది కదా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కంప్యూటర్ నిపుణులు కారు. కంప్యూటర్ వినియోగం, నెట్ గురించి ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ వచ్చారు. నెట్ మానవ సంబంధాలకు అడ్డంకిగా మారిందని అంటున్నారు. దానిని వ్యతిరేకిస్తున్నా. ఈ రోజుల్లో ఎంతమంది తరచూ ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడటానికి కూడా తీరికలేని ఉద్యోగాలు, చదువులు అయిపోయాయి. ఇక వేరే ప్రాంతాల్లో, దేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితుల సంగతి ఎలా? కాని ఈ నెట్ ద్వారా ఆ దూరాలను తగ్గించే అవకాశం ఉంది. తమ చదువులు, ఉద్యోగ, వ్యాపార నిర్వహణతోపాటుగా తన వారిని పలకరించి ముచ్చటించడం, చర్చించడం సాధ్యమవుతుంది. మనకు ఎంతో మంది స్నేహితులు, బంధువులు ఉన్నా తరచూ ఎవరింటికీ వెళ్లం. మనకు తీరిక ఉండి, అవసరం ఉన్నప్పుడు వాళ్లు బిజీగా ఉంటారు. అలాంటప్పుడు నెట్ ద్వారా ఇంట్లో ఉండే కొత్త స్నేహాలు, పరిచయాలు పెంచుకోవచ్చు. కొద్దిసేపైనా తమలా ఆలోచించేవారితో చర్చించుకుని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఎంతో ఉంది. కాని నెట్‌ని సద్వినియోగపరచుకోవడం అనేది మన చేతిలోనే ఉంది. దేనికైనా నియంత్రణ అనేది తప్పకుండా ఉండాలి. నెట్ వినియోగం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందన్నారు. అదెలా జరుగుతుంది. ఒక మనిషికి తెలిసినవి, గుర్తున్న విషయాలు ఎన్ని ఉంటాయి? అవి చాలా పరిమితం. చాలా విషయాలు తెలిసిన వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. వాళ్లు పుస్తకాలు చదివి, పెద్దవాళ్లతో చర్చించి తమ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటారు. కాని మిగిలిన వారి సంగతేంటి? తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కాని చెప్పేవాళ్లు ఎవరు? పుస్తకాలు కొనాలంటే కూడా ఖర్చే కదా. అది ఎంతమంది భరించగలరు. ముఖ్యంగా గృహిణులు, రిటైరైన పెద్దవాళ్లు. కాని నెట్ వినియోగం వల్ల ఎన్నో విషయాలను నిమిషాల్లో, కానీ ఖర్చు లేకుండా తెలుసుకోవచ్చు. దానివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం కాదు జ్ఞానసంపద పెరుగుతుంది. శోధనా, విశ్లేషణ శక్తి పెరుగుతుంది. ఈ విషయాలన్నీ చర్చించలేదన్నారు. మహిళా బ్లాగర్లు పాల్గొన్న మొదటి కార్యక్రమం ఇది. అందునా ఈ కార్యక్రమానికి ఉన్న సమయం అరగంట మాత్రమే. అందుకే అన్ని విషయాలు చర్చించడం అసాధ్యమే కదా. ముందు ముందు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ప్రసారం చేస్తారేమో చూద్దాం. ఈ దిశలో తొలి అడుగు పడింది కదా.. ఇది శుభసూచకం.
Source: www.andhrabhoomi.net
కంప్యూటర్ గురించి తెలిసినవాళ్ళలో కూడా చాలా మందికి ఇంటర్నెట్‌లో తెలుగు టైపింగ్ సులభమని తెలియదు. కొంత మంది మేధావులు సాధారణ ప్రజలకి అర్థం కాని పదాలు ఉపయోగించి కంప్యూటర్ అంటే ప్రజలు భయపడేలా చేస్తున్నారు. ఉదాహరణకి అంతర్జాలం, అంకోపరి, పంపక సులభ కవిలె లాంటి పదాలు. టివి చానెళ్ళు, పత్రికలలో ప్రకటనలు ఇచ్చేటప్పుడైనా ఆ కష్టమైన పదాలు ఉపయోగించకుండా ఉంటే మంచిది.
ReplyDelete