Wednesday, July 13, 2011

బాబులను గుర్తిస్తే రు. లక్ష మీవే

మీరు జూనియర్ ఎన్టీఆర్‌ని గుర్తు పడతారా? పోనీ మహేశ్‌బాబును గుర్తు పడతారా? అంటే హెయిర్ స్టైల్‌నో, చేతి వేళ్లలో చూసి గుర్తు పట్టడం కాదండీ మొత్తం ముఖాన్ని మీరు కోరినంత సేపు చూసి మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం తీసుకుని చెప్పినా ఫరవాలేదు. గుర్తు పట్టగలరా? ఓ.. చాలా ఈజీగా అంటున్నారా? మరింకెందుకాలస్యం ఐతే మీరు రోజుకో లక్ష సంపాదించవచ్చు. కష్టమేమీ లేదు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, త్రిష వంటి చాలా పాపులర్ నటీనటుల ఫోటోలను టీవీ తెరపై చూపిస్తారు. వెంటనే మీరు వారు చూపించిన ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తే మీరు ఇల్లు కదలకుండా లక్ష రూపాయలు మీ ఒళ్లో వచ్చి పడిపోతాయి. బాగుంది కదూ! ఇంతటి మహత్తరమైన పుణ్య కార్యానికి పూనుకున్నది మా మూవీ చానల్ వాళ్లు. వాళ్ల చానల్‌లో రోజంతా కష్టపడ్డవారికి నెలకు పాతిక వేలు ఇస్తారో లేదో కానీ పాపం వాళ్లు మనమీదున్న ప్రేమ కొద్దీ ఫోన్ చేసి పేరు చెబితే చాలు లక్ష ఇచ్చేస్తారు. గుడ్డివాళ్లు తప్ప ఎవరైనా చెప్పగలంత ఈజీ ప్రశ్నలతో లక్ష రూపాయలిచ్చేస్తారు దానకర్ణులు.

మా మూవీ చానల్‌లో రాత్రి పదకొండు గంటల సమయంలో కవ్వించే మాటలతో రా రా అని పిలుస్తున్నట్టుగా మాట్లాడే ఒక అమ్మాయి ఆలసించిన ఆశాభంగం మీ కోసమే ఎదురు చూస్తున్నాం.. వచ్చేయండి ఫోన్ చేయండి.. అంటూ రెచ్చగొడుతుంది. తెరపై హీరో బొమ్మ వారు చూపించే లక్ష రూపాయల అంకె చూడగానే ఆశ మొదలవుతుంది. అసలు వ్యవహారం అక్కడే ఉంది. ఇదో పెద్ద బోగస్ వ్యవహారం. ఒక్కసారి పొరపాటును ఎవరైనా ఫోన్ చేశారంటే దాదాపు వెయ్యి రూపాయల వరకు నెత్తిన బిల్లు పడ్డట్టే. లేదా ఒకవేళ మీ సెల్‌ఫోన్ ప్రీ పెయిడ్ అయితే మీరు కాస్తంత అదృష్టవంతులు. ఎందుకంటే సెల్‌ఫోన్‌లో ఉన్న వందో రెండు వందల రూపాయల బ్యాలెన్స్‌తోనే మీకు జ్ఞానోదయం అవుతుంది. పోస్ట్‌పెయిడ్ అయితే ఆరిపోతారు. అంత పాపులర్ హీరోలను ఎవరైనా గుర్తు పడతారు. నిమిషానికి అర్ధ రూపాయే కదా, అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఫోన్ చేస్తే వారికి దొరికి పోతారు. నిజానికి నిమిషానికి పన్నెండు నుండి 15 రూపాయల వరకు వసూలు చేస్తారు. వెంటనే ప్రశ్నకు సమాధానం చెప్పనివ్వకుండా గంట గంటన్నర పాటు వెయిటింగ్‌లో ఉంచుతారు. టీవీలో- రండి ఫోన్ చేయండి అని అమ్మాయి పిలుస్తుంటుంది ఆ సమయంలో మాత్రం చాలా మంది వెయింటింగ్‌లో ఉంటారు. అలా ఉంటేనే ఆ కార్యక్రమ నిర్వాహకులకు గిట్టుబాటు అయ్యేది. రెచ్చగొట్టే విధంగా మాట్లాడడానికి ప్రత్యేకంగా శిక్షణ, ప్రత్యేక దుస్తులు ఉంటాయి.

మోసపోకుండా ప్రజలను చైతన్యపరచాల్సిన చానల్స్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను మోసపుచ్చడం ఎంత వరకు సబబు. కనీసం ఈ కార్యక్రమానికి ఫోన్ చేస్తే చార్జీలు ప్రత్యేకంగా ఉంటాయి. నిమిషానికి ఎంతో చెప్పాల్సిన బాధ్యత లేదా?

ఈ కార్యక్రమంపై టీవీ 1 యెటకారం డాట్‌కాంలో హాస్యగుళిక చూపారు. ఒక వడను తెరపై చూపించి కొద్దిగా కనిపించకుండా చేసి అదేంటో చెప్పాలని అడిగారు. మనం టిఫిన్‌గా తింటాం, మధ్యలో చిల్లు ఉంటుంది. చెట్నీతో తింటాం అంటూ చెప్పుకు పోయారు. దానికి సమాధానంగా పూరి అని కొందరు, దోశ అని కొందరు చెప్పారు. మహేశ్‌బాబును గుర్తుపట్టని వారు, వడను గుర్తుపట్టని వారుంటారా?

ఇంకా చిత్రమైన విషయం ఏమంటే అదే సంస్థకు చెందిన మా చానల్‌లో ఈ కార్యక్రమంపై వ్యంగ్యోక్తులు విసిరారు. ఉదయం సినిమాల్లో హాస్య దృశ్యాలను చూపించే కార్యక్రమంలో ఇద్దరు వ్యాఖ్యాతల మధ్య హీరోలను గుర్తించే కార్యక్రమంలోని మోసాన్ని ఎండగట్టారు. కానీ చానల్ వారే ఆ మోసం ఇంకా గుర్తించనట్టుగా ఉంది. ఇదే విధంగా శనియంత్రం, హనుమాన్ యంత్రం ధరించడం వల్ల దరిద్రం అంతా పోతుందని, సమస్యలన్నీ తీరిపోతాయని ఊదరగొడుతున్నారు. ఇలాంటి ప్రచారం నియమనిబంధనలకు విరుద్ధం. అయితే వీటిపై ఫిర్యాదులు రావడం లేదో ఏమో కానీ అన్ని చానల్స్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు రోజంతా వస్తున్నాయి. ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచే విధంగా ఉన్న ఇలాంటి ప్రకటనలపై కనీసం వినియోగ హక్కుల ఉద్యమకారులైనా దృష్టిసారించాలి. అన్ని చానల్స్ ఈ యంత్రాలు ధరిస్తే వారే నంబర్ వన్ అయిపోతారు కదా!

అది ఎవరి సొమ్ము?
ప్రపంచంలోకెల్లా సంపన్న ఆలయంగా పద్మనాభస్వామి ఆలయం గురించి అన్ని చానల్స్‌లోనే ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశారు. ఆ సంపదను పేదల సంక్షేమానికి ఉపయోగించాలని టీవీ9 ఉచిత సలహా పారేసింది. మంచిదే మనది కాదు కాబట్టి అలాంటి సలహాలిచ్చి పేద జనుల ఉద్ధరించిన తృప్తి పొందొచ్చు. లక్ష కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు లభించాయి నిజమే. అంటే టీవీ 9 ఉద్దేశం అంత పురాతనమైన ఆ ఆభరణాలను కరిగించి బంగారం అమ్మాలా? లేక ఆ విగ్రహాలను, ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బును పేదల సంక్షేమానికి ఉపయోగించాలా? అది కాస్తా వివరంగా చెబితే మరింత బాగుండేది. ఏదో నోటికొచ్చిన ఒక మాట చెప్పేద్దాం అనుకుంటే ఎలా?

శుక్రవారం అన్ని చానల్స్‌లోనూ వైఎస్‌ఆర్ జయంతి దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశాయి. ఇడుపుల పాయలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ జరుగుతున్న ప్రాంతం నుండే సాక్షి చానల్ హెడ్‌లైన్ షో పేరుతో వార్త పత్రికల సమీక్ష ప్రసారం చేశారు. రోజూ స్టూడియోలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఒక పార్టీ వేదికపై నుండి నిర్వహించారు. రాష్ట్రంలో ఒక్కో చానల్ ఒక్కో పార్టీ ముద్దుబిడ్డలు అనే విషయం రహస్యమేమీ కాదు. కానీ ఒక పార్టీ వేదిక నుండి ఇలాంటివి నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి. పార్టీ వారినే కాకుండా సమీక్షలో పాల్గ్గొనే బయటి వారిని వేదికపైకి రప్పించడం ఏ విధంగా సమర్ధనీయం. అదే అంశంపై స్టూడియో నుండే కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుండేది.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment