* ఆకాశానికెత్తేస్తారు.. పాతాళంలో పడేస్తారు
* మొన్న హిట్టన్న సినిమాలన్నీ నేడు ఫట్టట..
* మొన్న హిట్టన్న సినిమాలన్నీ నేడు ఫట్టట..
‘కత్తి! అబ్బో ఇంత అద్భుతమైన సినిమా ఇప్పటి వరకు తెలుగులో రాలేదు. ప్రపంచం అదిరిపోయేట్టుగా ఉన్న సినిమా ఇది. హాలీవుడ్‌ను తలదనే్న విధంగా ఉంది. ఇంత అద్భుతమైన సినిమా తీయాలనే ఆలోచన మీకెలా వచ్చింది, ఈ కథ ఆలోచన ఎలా తట్టింది... ఇంత గొప్ప సినిమాలో మీ నటన చూసేందుకు రెండు కళ్లు చాల లేదండి జూ.ఎన్టీఆర్’’ ఇవి మొన్నటికి మొన్న తెలుగు ఛానల్స్ అన్నింటిలో ఊదరగొట్టిన డైలాగులు. కొంచెం అటూ ఇటూగా దాదాపు అన్ని ఛానల్స్‌లోనూ ఇవే మాటలు వినిపించాయి. అలానే పవన్ కళ్యాణ్, రాంచరణ్ సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటి డైలాగులే వినిపించారు. ఛానల్స్ రెండు వారాల పాటు ఇలాంటి డైలాగులు వినిపించినా పాపం ఆ సినిమాలు మాత్రం వారానికి మించి నడవలేదు. సరిగ్గా ఇప్పుడు అవే ఛానల్స్ ఇంత అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఇటీవల కాలంలో తెలుగు సినిమా రంగం చవి చూడలేదని చెబుతున్నాయి. జీ 24 గంటలు, మహా టీవి, టీవి9, ఎన్‌టీవి దాదాపు ఒక రోజు తేడాతో ఒకే విధమైన ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయ. తెలుగు సినిమా రంగం ఈ మధ్య భారీ సినిమా లతో దాదాపు రెండువందల కోట్ల రూపాయలు నష్టపోయిందని, కథాబలం లేకుండా కేవలం స్టార్ హీరోలను నమ్ముకొని బోర్లా పడ్డారనేది కథనం. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల వంటి స్టార్ హీరోల సినిమాలు బొక్క బోర్లా పడ్డ వైనాన్ని వివరించారు. కథను నమ్ముకోకుండా ఓవర్ యాక్షన్ చేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందనేది ఛానల్స్ కథనం. ఫలానా కథతో, ఫలానా విధంగా సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని తెలిస్తే నిర్మాతలైనా దర్శకులైనా అలా తీయకుండా ఉంటారా? వారికి కావలసింది సక్సెస్.. దాని కోసం ఏమైనా చేస్తారు. ఏ సినిమా హిట్టవుతుందో, ఏ సినిమా ఫట్టవుతోందో తెలిస్తే ఛానల్స్‌లో రివ్యూలు చేయడం కాదు ఏకంగా సినిమాలే తీస్తూ ఎక్కడో ఉండేవారు. సరే మరి సరిగ్గా రెండు వారాల క్రితం ఇవే సినిమాలను అద్భుతమైన సినిమాలని, తెలుగులో ఇంతకు ముందెన్నడూ రాలేదని, కొత్త రికార్డులు సృష్టిస్తాయని ఏమేమో చెప్పారు కదా! మరి వాటి సంగతేమిటి? ‘బద్రినాథ్’ సినిమాకు ఛానల్స్ పోటీ పడి ఎంత హడావుడి చేశాయి. తెలుగు సినిమా చరిత్రలోనే వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించిందని, బన్నీ నాన్న చెప్పడం ఛానల్స్ ఊదరగొట్టడం. అయినా ఇప్పుడు ఛానల్స్‌ను నమ్మి సినిమాకు వెళ్లే వారెవరున్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలో ఛానల్స్ అంతగా స్వరం మార్చేసి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయడం వింతే. నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది. సినిమాకు వెళ్లి వచ్చిన వారు బాగుంది అంటే సినిమాలు చూస్తున్నారేమో కానీ ఛానల్స్‌లో ప్రచారం చూసి నమ్మే రోజులు పోయాయి. చూసినకొద్దీ చూడబుద్ధేస్తుంది అంటూ ఛానల్స్‌లో సాగిన ప్రచారానికి రోజులు చెల్లిపోయాయి. విశ్వసనీయత అవసరం అనుకుంటే ఛానల్స్ కూడా అడ్డదిడ్డమైన సినిమాలకు కూడా అంతగా ఉచిత ప్రచారం కల్పించడం అవసరమా? ఆనేది ఆలోచించుకోవాలి. లేదంటే తమ మితిమీరిన ప్రచారమే తమకు భస్మాసుర హస్తంగా మారుతుంది. పెద్ద సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ కాగా, ఇటీవల విజయవంతం సాధించిన సినిమాల్లో 90 శాతం చిన్న సినిమాలే అని మహాటీవి ప్రత్యేక వార్తను ప్రసారం చేసింది. నరేష్ సినిమాలు మినిమం గ్యారంటీగా నిలుస్తున్నాయని, ఇటీవల సక్సెస్ అయిన చిన్నసినిమాలపై కథనం ప్రసారం చేశారు.
ప్రభువును మించిన ప్రభు భక్తి
ప్రముఖ నిర్మాత, కవి ఎం.ఎస్.రెడ్డి ఆత్మకథ నా కథ సినిమా రంగంలో సంచలనం సృష్టించింది. హిపోక్రసీతో నిండి పోయిన సినిమా రంగంలో విమర్శను తట్టుకోరు. తట్టుకునే మాట అటుంచి విమ ర్శించే వారే కనిపించరు. ఎదురుగా ఒకరినొకరు పొగుడుకోవడం, వెనక గోతులు తవ్వడం సాధారణం. ఎంఎస్ రెడ్డి ఆత్మకథలోని అంశాలు వివాదాస్పదం కావడంతో స్టూడియో ఎన్‌లో చర్చ నిర్వహించారు. అయితే చర్చలో పాల్గొన్నవారిలో సినీ నటి కవితతో సహా మిగిలిన కొందరు ఆయన ఆత్మకథ చదవకుండానే వచ్చారనిపించింది. చాలా కాలం క్రితం ‘కాగడా’ వంటి కొన్ని సినిమా పత్రికలు సినీ పెద్దల అంతర్గత వ్యవహారాలు, గొడవలను రాసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. బహుశా ఇక సినిమాలు తీసే ఉద్దేశం, అవకాశం లేనట్టుగా ఉంది ఎంఎస్ రెడికి. తన సినిమా అనుభవాలన్నింటిని కుండబద్దలు కొట్టినట్టు రాశారు. చర్చలో ఇటీవల కవిత- ఎన్టీఆర్ మంచివారే, ఎంఎస్‌రెడ్డి మంచివారే అంటూ ఇంకా తాను సినిమా జీవితాన్ని కోరుకుంటున్నాను, ఎవరినీ నొప్పించలేను అన్నట్టుగా మాట్లాడారు. సినిమా విశే్లషకుని పేరుతో మాట్లాడిన ఒక పెద్దాయన మూడు మాటలు మాట్లాడారు. ఆ మూడు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఆయన అక్కినేని హీరోగా ఉన్నప్పటి జర్నలిస్టు. వయసు పెరిగితే చాదస్తం వస్తుందంటారు ఎంఎస్‌రెడ్డి. అలానే చాదస్తంతో రాశారు అని తేల్చారు. సరే మరి ఎంఎస్‌రెడ్డిది వయసు చాదస్తం అయితే, బట్టతలపై మిగిలి ఉన్న కొద్ది వెంట్రుకలకు రంగు వేసుకోగానే మీరు నవయువకులయ్యారా? రెడ్డి రాసినవన్నీ అబద్ధాలు అని ఒక్క ముక్కలో చెప్పారు. బాగానే ఉంది ఆ వెంటనే ఇవే విషయాలు మేం రాస్తే మండిపడతారు, మరి వాళ్లే ఎలా రాశారు అని నిలదీశాడు. గతంలో చక్రపాణి సినిమా మిస్సమ్మలో భానుమతిని ఎంపిక చేసి తరువాత సావిత్రిని తీసుకున్నారు. అలానే కొన్ని వివాదాలు ఉంటాయి. ఇలా బయటపెడితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా జర్నలిస్టులు రహస్యాలను బయట పెట్టాలని చూస్తారు, అది వారి వృత్తి ధర్మం. కానీ ఆయన మాత్రం అలా ఎలా బయటపెడతారు అంటూ చర్చలో ప్రశ్నించడం నవ్వు తెప్పించింది. ప్రభువును మించిన ప్రభు భక్తి ఈ వయసులో ఎందుకండీ. మంచి చర్చే కానీ హడావుడిగా ఆత్మకథ కూడా చదవకుండా ఏదో మాట్లాడాలని కాకుండా ముందుగా ఆత్మకథ చదివించి తరువాత చర్చ నిర్వహిస్తే బాగుండేది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment