Monday, January 3, 2011

కంచికెళ్లనున్న 'పావలా కథ'

* 25 పైసలకు టాటా చెప్పనున్నRBI

పావలా కథ కంచికెళ్లనుంది. జూన్‌ నెలాఖరు నుంచి పావలా చెలామణీని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. విపణిలో చారాణాలపై నిషేధం ఖరారవడంతో.. దానిపై అప్పుడే జనానికి చిన్న చూపొచ్చేసింది. చెల్లనికాసుగా తీసి పారేయడం మొదలైంది. ఒకప్పుడు పవర్‌ఫుల్‌ కాయిన్‌గా పేరున్న పావలా బిళ్ల మన నుంచి భారంగా వీడ్కోలు తీసుకుంటోంది.


అణాపైసాలు రెండు జనరేషన్ల క్రితమే కనుమరుగయ్యాయి. తర్వాత.. ఐదుపైసలు.. పదిపైసలు, ఇరవై పైసలు.. ఒక్కటొక్కటిగా అన్నీ చెల్లని కాసులుగా మారిపోయాయి. ఇప్పుడు పావలా వంతొచ్చింది. ఇప్పటికే నల్లపూసలైపోయి.. ఉనికి తగ్గిపోయిన పావలా బిళ్లలు.. ఆర్నెల్ల తర్వాత అస్సలు కనిపించకుండా పోనున్నాయి. ఇక మ్యూజియానికి, కాయిన్ కలెక్షన్లకు మినహా.. చారాణాలు మరెందుకూ పనికిరావు.


సో.. పావలా పని అయిపోయినట్లే లెక్క. జూన్ 30 నుంచి అత్యంత చిన్న నాణెంగా అర్థరూపాయిని మాత్రమే పరిగణిస్తామన్న కేంద్ర ఆర్థికశాఖ.. పావలాను లెక్కలోంచి తీసిపారేసింది. ఎవరిదగ్గరైనా పావలా బిళ్లలుంటే వీలైనంత త్వరగా.. వదిలించుకోవాలని ఆదేశాలిచ్చింది. బ్యాంకులు, ప్రభుత్వ రవాణా సంస్థల్లో ఆర్నెల్ల వరకు పావలాలను అంగీకరించకుంటే.. దాన్ని నేరంగా పరిగణిస్తారు.


మూడేళ్ల క్రితమే ముద్రణ ఆగిపోవడంతో.. పావలా బిళ్లల ఉనికి దాదాపుగా తగ్గిపోయినట్లే లెక్క. అధికారికంగా చెల్లుబాటులో వున్న ఐదురూపాయల నోటునే ఎవరూ తీసుకోవడం లేదు. ప్రభుత్వమే కాదన్న పావలా బిళ్లలను ఎలా మార్చుకునేది..? అందుకే.. చేతిలోని చారాణాలను పక్కకు పెట్టేస్తున్నారు జనం. ఇప్పుడు ఎవరికీ కాకుండా పోయిన పావలాబిళ్ల ఒకప్పుడు ఎంత పవర్‌ఫుల్లో మన పూర్వీకులను అడిగితే తెలుస్తుంది.


నైన్టీన్ ఫిఫ్టీస్‌లో పావలా ఖర్చుపెడితే కిలో కూరగాయలొచ్చేవి. దీపావళికి అరడబ్బా నిండుగా బాణాసంచా దొరికేది. నలభై కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చెయ్యగలిగేవాళ్లు. నేలటిక్కెట్‌తో ఓ పసందైన సినిమా చూసేవాళ్లు. ఆలిండియా కాంగ్రెస్‌లో సభ్యత్వ రుసుము కూడా ఒక్క పావలాబిళ్లతో సరిపొయ్యేది. పదేళ్ల తర్వాత అదే పావలా బాగా పలచనైపోయింది.


సమోసా కొండానికో.. కాలేజి క్యాంటీన్‌లో ఓ కప్పు టీ తాగడానికో పావలా బిళ్ల బైటికి తీసేవాళ్లు. 1980 తర్వాత ద్రవ్యోల్బణం ధాటికి పావలా బిళ్లకున్న కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. ఓ చిన్న అరటిపండు కూడా కొనలేని సత్తుబిళ్లగా పావలా సెటిలైపోయింది. పిల్లవాడికి పిప్పర్‌మెంట్ కూడా కొనిపించలేని నిస్సహాయత పావలాబిళ్లది. బిచ్చగాడినుంచి కూడా పావలాకు తిరస్కారమే. పావలాకుండే విలువ కంటే.. ఆ పావలా కాయిన్ తయారీకే ఎక్కువ ఖర్చవుతుందని ఆర్బీఐ వాపోతోంది.


వందరూపాయలకు సమానమైన పావలాబిళ్లల తయారీకి.. 160 రూపాయలు వ్యయం చేయాల్సి రావడం ఓ ట్రాజెడీ. మెటల్ ధరలు మండుతుండడమే దీనికి కారణమట. అందుకే.. చెల్లుబాటవని ఇలాంటి నాణేలు.. కరిగించుకుని అదనపు ప్రయోజనం పొందుతున్నారు జనం. బ్రిటిష్ కాలంనాటి వెండి రూపాయి బిళ్ల.. ఆ తర్వాత ఆడాళ్లకు ఆభరణాలుగా మారిపోయాయి.


పసిడిరంగులో మెరిసే 20 పైసల బిళ్లలు పేద మహిళలకు అలంకారప్రాయాలయ్యాయి. ఇప్పుడు మిగిలిపోయిన పావలాబిళ్లలదీ అదే పరిస్థితి. కాయిన్‌గా కంటే.. కరిగించడం వల్లే ఇది సొమ్మవుతుంది.

Source: www.tv5news.in 

1 comment:

  1. బాగుంది సర్ మీ వ్యాసం. మీకు పావలా బిళ్ళలతో సన్మానం చేయాలి.

    ReplyDelete