(గతవారం తరువాయి)
హృదయాన్ని కదిలించే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే వుంది. వినోద ప్రపంచం విస్తరిస్తున్న నేటి తరుణంలో యువత సంగీత రంగం వైపు ఆసక్తి చూపుతోంది. ఇందులో ఎలా ప్రవేశించాలి? కావాల్సిన అర్హతలేంటి? ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గతవారం కోర్సుల గురించి, శిక్షణ గురించి చర్చించాం. మ్యూజిక్ కంపోజర్స్/ సాంగ్స్ రైటర్స్ కెరీర్లోకి ప్రవేశించే తీరూ, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకున్నాం. మిగిలిన పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సింగర్స్/పెర్ఫార్మర్స్: పాటను వాయిద్యాలు లేకుండాను, వ్యాయిద్యాలతోనూ ఒంటిరిగానూ, బృందంగానూ, ఆలపించవచ్చు. ఈ కోర్సులు చేసేవారు కూడా సోలో పెర్ఫార్మర్‌గాను, గ్రూప్ పెర్ఫార్మర్‌గానూ రాణించవచ్చు. వాయిద్య సంగీతకారులుగానూ, క్లాసికల్ సింగర్స్‌గానూ, పాప్ ఆర్టిస్టుగానూ ఎదగవచ్చు. వాయిద్యకారులు కూడా టెక్నికల్ స్కిల్స్ అలవర్చుకోవాలి. ఇతర సంగీత విభాగాల్లోనూ అవగాహన పెంచుకోవాలి. చిన్నవీ, పెద్దవీ అన్నతేడా లేకుండా పబ్‌లు ఆడిటోరియంలు, రీ రికార్డింగ్ సెంటర్ల వరకూ అన్నిచోట్లా ఆయా పరిస్థితులకు అనుగుణంగా వాయిద్య సంగీతం అందించాల్సి వుంటుంది. అలానే సింగర్స్ కూడా గేయాలను ఆలపించాల్సి వుంటుంది. వివిధ రికార్డింగ్ సెంటర్లలోనూ, పబ్బుల్లో, నైట్ క్లబ్బులలో వీరికి అవకాశాలు లభిస్తాయి. సినీ పరిశ్రమలో నేపథ్య గాయకులుగా రాణించవచ్చు.
ఆర్టిస్టు/మ్యూజిక్ మేనేజ్‌మెంట్: ఆర్టిస్టు మేనేజ్‌మెంట్ అంటే సంబంధిత కళాకారుల కార్యక్రమాల షెడ్యూలు, తదనుగుణంగా ప్రణాళిక, సంబంధిత వ్యక్తులతో సంప్రదింపులు నిర్వహించే ఆర్టిస్టు
మేనేజర్లుగా ఉండేవారు బయటకు కనిపించని ఇబ్బందులను పసిగట్టాల్సి వుంటుంది. మ్యూజిక్ రంగంలో బిజినెస్ వ్యవహారాలపట్ల అవగాహన, తమ కళాకారుడి అవసరాలకు అనుగుణంగా చక్కదిద్దాల్సి వుంటుంది. సినీ, రేడియో, టెలివిజన్, యాజమాన్యాలతో సత్సంబంధాలు కలిగి వుండి, సంప్రదింపులు జరుపుతుండాలి. తమ కళాకారుడికి అవకాశాలను పెంపొందించేలా ప్రణాళికలు రూపొందించాలి. మ్యూజిక్‌తో పాటు మీడియాపట్ల అవగాహన ఉండాలి. ఆ రంగాలకు చెందినవారితో పరిచయాలు పెంపొందించేలా ప్రనాళికలు రూపొందించాలి. కళాకారునికి తగిన ప్రయాణ ఏర్పాట్ల దగ్గర నుంచి సంస్థాగత కార్యక్రమాల వరకు అన్నీ చూసకోవాల్సి వుంటుంది.
మ్యూజిక్ జర్నలిస్టు: కళాకారుల ఇంటర్వ్యూలు తీసుకోవాల్సి ఉంటుంది. రీ రికార్డింగ్‌లను, ఆల్బమ్‌లను, సంగీత ప్రదర్శనలను, ప్రదర్శనకారుల శైలినీ సమీక్షించాల్సి వుంటుంది. తాజా సంగీతోత్సవాలకు రీ రికార్డింగ్ రిలీజ్ కార్యక్రమాలకు సంబంధించిన వార్తలను అందించాల్సి వుంటుంది. మరి కొందరు సినీ విమర్శకుల మాదిరి
సంగీత విమర్శకులుగా కూడా రాణించవచ్చు. అలాగే ప్రిలాన్స్ జర్నలిస్టుగా రాణించేందుకు ఈ మ్యూజిక్ రంగం దోహద పడుతుంది. వివిధ వార్తా పత్రికలకు మ్యాగజైన్లకు, టివి ఛారళ్లకు, రేడియోలకు, వివిధ వెబ్ సైట్లకు వీరు పనిచేయవచ్చు. ఇందులో రాణించాలంటే సంగీతంపై అభిమానంతోపాటు భాషపై మంచి పట్టు వుండాలి. సంగీతమంత హృద్యంగా రాయగలిగే నేర్పు ఉండాలి.
మ్యూజిక్ ఎడ్యుకేటర్/టీచర్: సంగీతంలో పట్టు సాధించిన వారు సంబంధిత రీతుల్లో, ప్రత్యేకంగా స్కూళ్లు ఏర్పాటు చేసుకొని శిక్షణ ఇవ్వవచ్చు.పెద్దపెద్ద సంస్థల్లో టీచర్లుగా పనిచేయవచ్చు. వివిధ కాలేజీల్లో, పాఠశాలల్లో సంగీత పరిచయ క్లాసులు నిర్వహించవచ్చు. సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాసను విద్యార్థుల్లో పెంపొందించే నైపుణ్యాన్ని వీరు అలవర్చుకోవాల్సి వుంటుంది. సహనం, విద్యార్థి మనస్తత్వాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యం సంగీత టీచర్లకు ఉండాలి.
మ్యూజిక్ థెరపిస్టు: కొన్ని ప్రత్యేక సంగీత రీతుల ద్వారా మానసిక, భావోద్వేగాలను దృఢం చేయవచ్చు. మ్యూజిక్ థెరపిస్టులకు రిథమ్, మెలోడి విషయాల్లో ప్రత్యేక శిక్షణ పొందాల్సి వుంటుంది భావోద్వేగ స్థిరత్వం, ఆలోచన, దృక్పథం వీరికి అవసరం. శబ్దాలను సృజనాత్మకంగా ఆలపించే విధానం, వల్లించే నేర్పు, విశ్లేషణ, లోతైన అవగాహన మెండుగా ఉండాలి. అన్ని వయస్సుల వారికి వీరు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాల్సి వుటుంది. మానసిక రుగ్మతలు, మనోవైకల్యం, సంభాషణ, వినికిడి సంబంధిత సమస్యలు, శారీరక వైకల్యంతో మానసికంగా కృంగిపోవడం, న్యూరోలాజికల్ రుగ్మతలు తదితర సమస్యలున్న వారిలో వీరు మార్పు తేవాల్సి వుంటుంది. వారి మనోవికాసానికి సంగీతం ద్వారా కృషి చేయాల్సి వుంటుంది. ఎంతో నేర్పు సాధిస్తే గానీ ఈ రంగంలో నిలదొక్కుకోవడం సులభం కాదు. ఫిజియో థెరపిక్ ఆస్పత్రులు, కమ్యూటీ మెంటల్ హెల్త్ ఏజన్సీలు, మనోవికాస కేంద్రాలు నర్సింగ్ హోమ్‌లు, మానసిక వికలాంగుల ఆశ్రయాల్లో మ్యూజిక్ థెరపిస్టులకు అవకాశాలు ఉంటాయి. వీరు ప్రయివేటుగా కూడా ప్రాక్టీస్ నిర్వహించుకోవచ్చు. మ్యూజికాలజిస్టు: సంగీతంలో చక్కటి పరిజ్ఞానం పెంపొందించుకొని వివిధ సంస్థల్లో, కార్యాలయాల్లో సిబ్బందికి, వివిధ తరగతుల ప్రజలకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించే మ్యూజిక్ కార్యక్రమాలు రూపొందించవచ్చు. ఇలాంటి వారికి పరిశోధనా సంస్థల్లో చక్కటి అవకాశాలు లభిస్తాయి.
వీడియో జాకీస్ (విజెస్/ డిస్క్ జాకీస్(డిజెస్): మ్యూజిక్ ఛానళ్లు పెరగడంతో వీడియో జాకీస్‌కు, ఎఫ్‌ఎం స్టేషన్ల పెరుగుదలతో డిస్క్ జాకీస్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది. వీరికిప్పుడు అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. కళాకారులతో ఇంటర్వ్యూలు నిర్వహించడం, ప్రేక్షకులతో మాట్లాడుతూ వారిని మెప్పించడం, కోరిన పాటలు, వీడియోలు ప్రసారం చేయడం వీరి పని. విజేలు, డిజెలుగా ప్రత్యేకించి విద్యార్హతలేవీ అక్కర్లేదు. సందర్భోచిత సంభాషణా చాతుర్యం తప్పనిసరి. ఒకింత హాస్యం, కళా రంగం పట్ల కాస్త అవగాహన అవసరం. అంతేకాదు జనరల్ విషయాలు, వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన ఉండాలి. స్పష్టమైన చర్చ, వివిధ మాండలికాల్లో సంభాషించగల నేర్పు ఉండాలి. అనేక రకాల సంగీత రీతులు, ప్రముఖ సంగీతకారుల శైలి, ఆల్బమ్స్‌పట్ల అవగాహనతోపాటు వాటిని సమీక్షించి విశ్లేశించే సామర్థ్యం ఉండాలి. దీంతోపాటు మంచి బాడీ లాంగ్వేజ్, డ్రెస్‌సెన్స్ చాలా అవసరం.
మ్యూజిక్: మ్యూజిక్ లైబ్రరీయన్:
సంగీతంలో పరిజ్ఞానముండి, లైబ్రరీ, రీసెర్చ్ అంశాల్లో శిక్షణ పొందినవారికి కాలేజీలు, సంగీత శిక్షణా సంస్థలు, లైబ్రరీల్లో అవకాశాలు లభిస్తాయి. అలాగే రేడియో, టెలివిజన్, చిత్ర నిర్మాణ సంస్థల్లోనూ మ్యూజిక్ లైబ్రరీయన్లకు అవకాశాలు లభిస్తాయి. ఏదైనా సంగీత కోర్సుతోపాటు ఇందులో ఉపాధి పొందాలనుకునేవారికి లైబ్రరీ సైన్సులో కనీసం బ్యాచులర్ డిగ్రీ ఉండాలి.
సంగీతంలో వివిధ రకాల కోర్సులు:
*బి.ఎ. (హానర్స్) మ్యూజిక్
*బి.ఎ. (విజువల్ ఆర్ట్స్/మ్యూజిక్/డ్యాన్స్/డ్రామా
*బి.ఎ.మ్యూజిక్
*బి.ఎ. తబలా
*బి.ఎఫ్‌ఎ సితార్
*బి.ఎఫ్‌ఎ తబలా
*సర్టిఫికెట్ కోర్సు (మ్యూజిక్)
*సర్టిఫికెట్‌కోర్సు (మ్యూజిక్ అండ్ డ్యాన్స్)
*సర్టిఫికెట్ కోర్సు మ్యూజిక్ అప్రిసియేషన్ అండ్ మ్యూజిక్)
*డిగ్రీ (మ్యూజిక్)
*డిప్లొమా ఇన్ మ్యూజిక్
*డిప్లొమా ఇన్ సితార్
*డిప్లొమా ఇన్ తబలా
*డిప్లొమా ఇన్ ప్రొఫిసెన్సీ కోర్స్ ఇన్ మ్యూజిక్
*ఎం.ఎ.మ్యూజిక్
*ఎంఫిల్ ఇన్ మ్యూజిక్
*పిహెచ్‌డి ఇన్ మ్యూజిక్
*యుజి డిప్లొమా కోర్సు ఇన్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్
*ప్రయివేటు డ్యాన్స్ అండ్ మ్జూఇక్ స్కూల్స్ అందించే వివిధ కోర్సులు
ఆంధ్రప్రదేశ్‌లో మ్యూజిక్ కోర్సులు అందిస్తున్న సంస్థలు
ఆంధ్రా యూనివర్సీటీ, విశాఖపట్నం : బిఎ మ్యూజిక్
నాగార్జునయూనివర్సిటీ, నాగార్జునాసాగర్ : బిఎ మ్యూజిక్
http://www.nagarjunauniversity.ac.in/
రాష్ట్రీయ సంస్కృతీ విద్యాపీఠ్ , తిరుపతి : బిఎ మ్యూజిక్
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం : బిఎ మ్యూజిక్
http://www.skuniversity.org/
శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ , తిరుపతి : బిఎ మ్యూజిక్
http://www.svuniversity.in/
సంగీత ఉపాధి కల్పవృక్షాలు
1. దూరదర్శన్ తదితర టెలివిజన్ ఛానెళ్లు
2. ఆకాశవాణి, ఇతర ప్రయివేటు ఎఫ్‌ఎం ఛానెళ్ల స్టేషన్లు
3. మ్యూజిక్ ఛానెళ్లు
4. ప్రభుత్వ సాంస్కృతిక, ప్రజా సంబంధాల శాఖలు
5. నిర్మాణ సంస్థలు
6. సంగీత పరిశోధనా సంస్థలు
7. మ్యూజిక్ ట్రూపులు
8. మ్యూజిక్ కంపెనీలు
9. విద్యా సంస్థలు, కళా కేంద్రాలు
10. ఫిజియో థెరపి ఆస్పత్రులు
Source: www.prajasakti.com