Monday, December 27, 2010

బుల్లితెరపై సినీస్టార్స్‌ !

పేక్షకులు మరిచిపోలేని ఆర్టిస్ట్‌గా నిలబడటమంటే అందరికీ సాధ్యం అయ్యేపని కాదు. కానీ ఏదోవిధంగా ప్రేక్షకుల చూపులో నిలబడటం సులభమే !ఈ విషయాన్ని బాలీవుడ్‌ ఎప్పుడో గ్రహించింది. అందుకే బిగ్‌ బి అయినా, కింగ్‌ ఖాన్‌ అయినా తమదైన బుల్లితెర కార్యక్రమాలతో ఎల్లవేళలా ప్రేక్షకుల ఇంట నడయాడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, షారూక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, కరణ్‌జోహార్‌, అనుపమ్‌ఖేర్‌, ఫరాఖాన్‌, ప్రియాంకా చోప్రా...ఇలా పెద్ద పెద్ద చుక్కలన్నీ బుల్లిపెట్టెలోకి ప్రవేశించాయి. గ్లామర్‌ ఫీల్డ్‌లో నిలబడాలంటే...వెండితెర వెలుగొక్కటే సరిపోదని గ్రహించారు. ఈ గ్రహింపు ఇప్పుడు టాలీవుడ్‌లోకీ ప్రవేశించింది. సాయికుమార్‌, జయప్రద, రాధిక, సుహాసిని, రోజా, ఇంద్రజ, జగపతిబాబు, దేవయాని, లక్ష్మీప్రసన్న, సుమలత, సిమ్రాన్‌, రాజమౌళి...మొదలైన తారాతోరణం బుల్లితెరపై రంగులీనుతోంది. అందులోని కొంతమంది తారల వెలుగులు ఎలా ఉన్నాయో చూద్దాం...
జయప్రద : ఈ అందాల భామ కొన్నాళ్లు రాజకీయ ప్రయాణం చేశారు. 'జయప్రదం' అనే కార్యక్రమంతో తిరిగి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కేవలం సినీ ప్రముఖుల ఇంటర్వ్యూకే ఈ కార్యక్రమం పరిమితమైంది. ప్రముఖ కథానాయకులతో, దర్శకనిర్మాతలతో పనిచేసిన అనుభవం జయప్రదకు ఉండటం వల్ల టీవీ షో నిర్వహణ సలుభతరమైంది. తోటి నటీనటులు, చిత్రనిర్మాణం, కెరీర్‌ ప్రారంభంపై పలువురు నిర్మోహమాటంగా మాట్లాడటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆసక్తికరమైన విషయాలు సినీస్టార్స్‌ నోట రావటంతో, షో బాగా క్లిక్‌ అయింది.

రాధిక : డైనమిక్‌ లేడీగా పేరుతెచ్చుకున్న నటీమణి రాధిక. సిల్వర్‌స్క్రీన్‌ నుంచి తప్పుకున్న తర్వాత, బుల్లితెరపై తనదైన ప్రయాణాన్ని మొదలెట్టింది. నిర్మాతగా, నటిగా, రాడన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ యజమానిగా...ఇలా బహుముఖ ప్రజ్ఞాపాటవాన్ని చూపుతోంది. శివయ్య, లక్ష్మీ, చిట్టెమ్మ తదితర సీరియల్స్‌కు మంచి స్పందన లభించింది. టీఆర్పీ రేటింగ్‌లోనూ ముందున్నాయి. కుటుంబ కథనాలను సీరియల్స్‌గా ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతున్నారు.

రోజా : చెరగని చిరునవ్వుతో కనిపించే రోజా, ఓ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా బుల్లితెరపై సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించింది. ఊహించనట్టుగానే షో చాలా బాగా విజయవంతమైంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో పాత్రలు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఓ డ్యాన్స్‌ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. తనదైన శైలిలో, సందర్భానికి తగిన డైలాగ్స్‌తో మాట్లాడుతూ...వీక్షకులకు దగ్గరయ్యారు.

లక్ష్మీప్రసన్న : సినీ నటుడు మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న తొలి అడుగులు బుల్లితెరపైనే పడ్డాయి. 'లక్ష్మీ టాక్‌ షో' సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించటంతో, మరిన్ని ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. నటిగా, టీవీ ప్రయోక్తగా, నిర్మాతగా...గ్లామర్‌ ఫీల్డ్‌లో తనదైన ముద్రను చూపాలని తపనపడుతోంది. 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలో ప్రతినాయికగానూ కనిపించ నుంది. ఇందులో ఆవిడ నటకౌశలాన్ని, ఆసక్తిని చూసిన పలువురు సినీ ప్రముఖులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు.లక్ష్మీ టాక్‌ షో కార్యక్రమంలో... రాజకీయ, సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. దీంట్లో లక్ష్మీ చూపిన టాక్‌ షోకు ఫుల్లుగా మార్కులు పడ్డాయి. కొన్నాళ్లు విరామం తీసుకొని తిరిగి 'ప్రేమతో మీ లక్ష్మీ' ద్వారా మరో టీవీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సినీ నేపథ్యంతో బుల్లితెరకొచ్చిన వారిలో లక్ష్మీ ముందుభాగాన నిలుస్తోంది.

జగపతిబాబు : శోభన్‌బాబు-2గా సినీ పరిశ్రమ కొన్నాళ్లు భావించింది. కానీ ఫ్యామిలీ కథనాలకు సిల్వర్‌స్క్రీన్‌పై పెద్దగా చోటు లేకపోవటంతో, మాస్‌ పాత్రలకే పరిమితమయ్యారు. పూర్తిగా హీరో వేషాలు మానుకున్నాక మొదలెట్టడం కన్నా, ఓ వైపు హీరోగా కొనసాగుతూనే బుల్లితెరపై స్థానం సంపాదించాలని జగపతిబాబు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే 'రాజు రాణి జగపతి' అనే షో నిర్వహిస్తున్నాడు. స్వతహాగా జగపతిబాబు చాలా రిజర్వ్‌డ్‌ మ్యాన్‌. షో నిర్వహణ చేయగలడా అన్న అనుమానాలు మొదట ఉండేవి ! కానీ చాలా కూల్‌గా, సరదాగా బుల్లితెరపై తనదైన స్టైల్‌తో దూసుకెళ్తున్నాడు. మొత్తానికి మంచి మార్కులే కొట్టేసాడు.


రాజమౌళి : సంచలన దర్శకుడు రాజమౌళి పూర్వాశ్రమం బుల్లితెరే ! పలు సీరియల్స్‌ డైరెక్ట్‌ చేసిన అనుభవం ఉంది. అక్కడే కె.రాఘవేంద్రరావు శిష్యరికం లభించింది. ప్రస్తుతం తెలుగు టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకడిగా రాజమౌళి దూసుకెళ్తున్నాడు. ఈయన 'కమాన్‌ ఇండియా' అనే భిన్నమైన సబ్జెక్టుతో బుల్లితెర వీక్షకుల ముందుకొస్తున్నారు. సమాజంలో ఉన్న పలు విషయాలపై ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతున్నారు.వీళ్లేగాక ఇంద్రజ, దేవయాని, సుమలత, సిమ్రాన్‌ తదితర నటీనటులు బుల్లితెరపై చాలా సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించారు. విక్టరీ వెంకటేష్‌ కూడా ఓ మంచి ప్రోగ్రామ్‌ ద్వారా టీవీ వీక్షకులకు దగ్గరవడానికి ప్రణాళికలు వేస్తున్నాడంట ! స్వామి వివేకానంద జీవితకథ ఆధారంగా తయారవుతోన్న సీరియల్‌లో నటించే అవకాశముందని ఇండిస్టీ సమాచారం ! మంచి సబ్జెక్టుదొరికితే తాను బుల్లితెరపై చేయడానికి సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించాడు.

Source: www.prajasakti.com

No comments:

Post a Comment