Tuesday, December 28, 2010

5న టీవీ న్యూస్‌ రీడర్స్‌కు జివిఆర్‌ ఆరాధన పురస్కారాలు

మీడియా రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న టీవీ న్యూస్‌ రీడర్స్‌కు జివిఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ పురస్కారాలను ప్రకటించింది. వచ్చే నెల 5న రవీంద్రభారతిలో ఈ పురస్కారాలను టీవీ న్యూస్‌ రీడర్స్‌కు ప్రదానం చేయనున్నారు. 13 చానెళ్ళకు చెందిన 13మంది టీవీ న్యూస్‌ రీడర్స్‌తో పాటు పదేళ్ళ పాటు ఈ విభాగంలో ఉత్తమ సేవలందించిన న్యూస్‌ రీడర్‌కు స్వర్ణపతకాన్ని ప్రదానం చేస్తారు. ప్రగతి మీడియా లింక్స్‌తో కలసి చేస్తున్న ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి సంబంధించిన బ్రొచర్‌ను ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకుడు పి. విజయబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూస్‌ రీడర్స్‌ హావ భావాలు సరిగ్గా ఉన్నప్పడే వారు చదివే వార్తాంశాలకు ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. తమ గళంతో వీక్షకులను ఆకట్టుకునే న్యూస్‌ రీడర్స్‌ను గళాకారులుగా భావించి వారిని ప్రోత్సహించడం అభినందనీయమని జివిఆర్‌ ఆరాధన సంస్థను ప్రశంసించారు. అనునిత్యం వార్తలతో జీవితం పెనవేసుకుపోయే టీవీ న్యూస్‌ రీడర్స్‌కు నంది అవార్డులను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసి దానిని సాధించిన ఘనత ఈ సంస్థకే దక్కుతుందని చెప్పారు.
సంస్థ చైర్మన్‌ గుదిబండ వెంకటరెడ్డి మాట్లాడుతూ గత ఆరేళ్ళుగా ఈ సంస్థ టీవీ న్యూస్‌ రీడర్స్‌కు పురస్కారాలను ప్రదానం చేస్తోందని వెల్లడించారు. ఈ పురస్కారాల ఎంపిక కమిటీలో జీడిగుంట రామచంద్రమూర్తి, తోట భావనారాయణ, వంగా మురళీకృష్ణారెడ్డిలు ఉన్నారని తెలిపారు. 5న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి సమాచార, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డికె అరుణ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. సన్మానకర్తగా సమాచార, పౌరసంబంధాలశాఖ కమీషనర్‌ సి. పార్థసారథి, సభాధ్యక్షునిగా పి. విజయబాబులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. జాగృతి విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఓ. శ్రీనివాసరెడ్డి టీవీ న్యూస్‌ రీడర్స్‌కు స్వాతగ సత్కారం చేస్తారని చెప్పారు. పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా పద్మశ్రీ డాక్టర్‌ శోభానాయుడు శిష్యురాలు శ్రుతకీర్తి, పద్మావతి ఆర్ట్‌ అకాడమీ డైరెక్టర్‌, నాట్యగురువు అయిన పి. క్రాంతి కిరణ్‌ శిష్యబృందంచే కూచిపూడి నృత్య విభావరి ఉంటుందని వెల్లడించారు.2010 జివిఆర్‌ ఆరాధన టీవీ న్యూస్‌ రీడర్స్‌ పురస్కారాలకు ఎంపి కైన వారి వివరాలను ఎంపిక కమిటీ సభ్యుడు జీడి గుంట రామచంద్రమూర్తి ప్రకటించారు. ఎం. త్రిమూర్తులు(దూరదర్శన్‌), రవీంద్ర(ఈ టీవీ-2), రాధిక(జెమిని), రజినీకాంత్‌ (టీవీ-9), ఎం. శిరీష (టీవీ-5), శ్వేతారెడ్డి(ఎన్‌టీవీ), సుప్రజ(ఐ. న్యూస్‌), పృథ్వీరాజ్‌(హెచ్‌ఎం టీవీ), సి. ప్రతిభ(స్టూడియో ఎన్‌), ఐశ్వర్య(సాక్షి), కార్తీక్‌(మహా టీవీ), విజయ చంద్రిక(ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి), ఎస్‌. శ్రీలతారెడ్డి(రాజ్‌ న్యూస్‌)లు ఉత్తమ న్యూస్‌రీడర్స్‌గానూ ఐ న్యూస్‌కు చెందిన సత్యానారాయణ(వాయిస్‌ ఓవర్‌)లు పురస్కారాలందుకోనున్నారు. పదేళ్ళ పాటు టీవీ న్యూస్‌ రీడింగ్‌ విభాగంలో విశేష సేవలందిస్తోన్న టీవీ-9కు చెందిన సుమతికి స్వర్ణపతకాన్ని అందించనున్నామని ప్రగతి మీడియా లింక్స్‌ సిఇఓ జి. ప్రగతి చెప్పారు. ఈ బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో కార్తీక డెవలపర్స్‌ ఎండి వివి రాఘవరెడ్డి కూడా మాట్లాడారు.

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment