Tuesday, December 28, 2010

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..

టీవీలో వచ్చే ప్రతి కార్యక్రమమూ తప్పనిసరిగా ఉన్న పనులు పక్కనపెట్టి లేదా పనులన్నీ టీవీ చూస్తూనో జరుపుకునే రోజులు ప్రస్తుతం నడుస్తున్నాయి. షాపుల్లో, హోటల్స్‌లో, మరో చోటో దాదాపు ప్రతిచోటా టీవీలు కనిపిస్తున్నాయి. మరి వారు చూపించే మంచి వైపు మొగ్గు చూపుతున్న వారూ ఉన్నారు. చెడువైపు ఇది వరకే ఉన్నవారు ఇంకా స్ఫూర్తిని పొందే కార్యక్రమాలు ఇటీవలి కాలంలో టీవీలో తరచూ కనిపిస్తున్నాయి. ప్రసార ఉద్దేశం ఒకటైతే జరిగేది మరొకటి అవుతుండటం గమనార్హం.
ఈ కోవలోకి వచ్చే ఒక కార్యక్రమం జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమవుతోంది. నిజానికి జి.కన్నడ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఒక కార్యక్రమానికి ఉన్న పేరును అలాగే తెచ్చి యాంకర్‌ను వేరుగా సెలెక్ట్ చేసి వారి ద్వారా సదరు కార్యక్రమాన్ని తెలుగు ఛానెల్‌లో ప్రసారం చేస్తున్నారు. ఆ కార్యక్రమం పేరు ‘బతుకు జట్కా బండి’. ఆ నిజానికి ఆ ఛానెల్ వారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో ఉన్న ఉద్దేశం గొడవలకు పాల్పడి దూరంగా ఉంటున్న వారి సంబంధాలను, వారి కర్తవ్యాలను వారికి గుర్తు చేసి వారికి హితబోధ చేయడం కావొచ్చు. కాని వారు చూపించేందుకు ఒక సబ్జెక్ట్‌ను ఎంచుకున్నప్పుడు వాటికి సంబంధించిన షూటింగ్ జరిపేటప్పుడు కెమెరాలతో చూపించే సందర్భంలో జరిగే కొన్ని అనివార్య తప్పులను నివారించి జనానికి చూడగలిగేది మాత్రమే చూపించి, చివరలో వారు చెప్పదలచుకున్నది చెబితే చాలా బావుండేది. కాని అక్కడ జరిగింది యథాతథంగా చూపించడం. వాటిలో కొన్ని బిట్లను పదేపదే కొద్ది రోజులు ముందుగానే ఒక వస్తువును కొనే వారి కొరకు శాంపిల్స్ చూపించినట్లుగా మా కార్యక్రమాన్ని చూడండని, టీవీ చూడటం అంతగా నచ్చని వారికి కూడా ఆ కార్యక్రమం చూసి తీరాలన్న తీరుగా చూపించారు. ఇందుకు వారు ఎంచుకున్నది చాలా అభ్యంతరకరమైన దృశ్యాలే కావటం విచారకరం.
విషయానికి వస్తే ఊరూ పేరూ తెలియని కారణంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి గురించి ప్రస్తావించడం లేదు కాని గత నెల 12వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రసారమైన బతుకు జట్కా బండి కార్యక్రమంలో ఒక భార్య ఒక భర్తకు మధ్యన నడిచిన గొడవను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ జంటలో భర్త భార్యను వదిలి రెండవ పెళ్లి చేసుకున్నాడన్నది ఆ భార్య అభియోగం. కేవలం అభియోగమే కాదు కాని అక్కడ రెండవ భార్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నందున అది నిజమే. అలాగే రెండవ భార్యకు ఈయనతో రెండవ పెళ్లి జరిగింది. మరి ఆ కార్యక్రమంలో మొదటి భార్య తన భర్త తనను కాదని రెండవ పెళ్లి అందునా పెళ్లయిన ఆమెతో కావడం. ఆమె మోజులో పడి తనను నిర్లక్ష్యం చేయడం. దాన్ని ఆ భర్త చిన్నపాటి కారణంతో సమర్థించుకోవడం కూడా అందులో కనిపిస్తుంది. ఇదంతా చూడటానికి ఒక విధంగా ఉంది. మరి ఇందుకు పరిష్కారం చూపే బాధ్యత సదరు ఛానెల్ తీసుకుంది. చట్ట పరిధిలో మాత్రమే జరిగే పరిష్కారాన్ని నేను చేస్తానని ఆ ఛానెల్ నెత్తికి ఎత్తుకొని పరిష్కారం మాట అటుంచి వారికి ఉన్న మర్యాదను కూడా తీసేసింది. వారిద్దరి సమస్యను యాంకర్ స్వయంగా వింటూ ప్రేక్షకులకు కూడా వినిపించింది. మరి సమస్యను వివరించే సందర్భంలో వారికీ వారికీ మధ్య మాటల యుద్ధం మాత్రమే జరిగినట్లయితే ఈ బాధంతా ఉండేది కాదు. వారిని కూర్చోబెట్టి చర్చోపచర్చలు జరిపి చివరకు వారు రెచ్చిపోయి ఒకరినొకరు చెప్పులతో కొట్టుకుంటూ ఉంటే వారిని విడిపించారు. అయితే వారు కొట్టుకోవడం సహజమే కాని దాన్ని యథాతథంగా చూపించడం అసహజం కాదా? మరి ఆ సంఘటనను చిత్రీకరించే స్టూడియో కెమెరామెన్ కూడా వారు కొట్టుకునే సందర్భంలో వచ్చి విడిపించే ప్రయత్నం చేసినట్లుగా టీవీలో కనిపించింది. మరి తరువాత ఎడిటింగ్ అనేదొకటి ఉంటుంది కదా? మరి వారికి ఇది అభ్యంతరకరంగా కనిపించలేదా? ఇలాంటి కార్యక్రమాలను చాలా ఛానెల్స్ చూపిస్తున్నాయి. కాకపోతే అది యధార్థ గాథ అయినప్పటికీ వారు పాత్రధారులను ఎన్నుకుని వారితో నటింపజేసి ఎంత వరకు చూపించాలో అంతవరకూ చూపించి చివరలో జరిగిన తప్పును గురించి నాలుగు విమర్శలు చేసి కార్యక్రమం ముగిస్తారు. కాని ఇక్కడ అలా జరగకపోగా కార్యక్రమం జరిగినంతసేపూ బ్రేక్‌లో ప్రతిసారి చెప్పులతో కొట్టుకోవడం చూపించి మరలా ఈ కార్యక్రమాన్ని ఈ ఛానెల్‌ను కాదని ఏ ప్రేక్షకుడూ పక్కకు పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రం ఎక్కువగా కనిపించింది.
ఈ విధమైన సమస్యలను చిత్రీకరించే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. సమస్యను ఎదుర్కొనే వారిలో సహజంగానే ఆవేశం ఉండొచ్చు. అందువల్ల ఎందరిలో ఉన్నా, ఎక్కడున్నా వారి ప్రవర్తన అలాగే ఉంటుంది కాబట్టి మధ్యలో ఎడిట్ చేయాల్సిన అవసరం కూడా మరిచిపోతే ఎలా? ఈ సందర్భంగా వీరు చూపించ దలచుకొంది గొడవలనా? తన్నుకోవడాన్నా? పరిష్కారాన్నా? అన్నది చివరి వరకూ అర్థం కాకుండా పోయింది. చివరలో కొంతమంది పెద్దలను కలిపి పరిష్కారాన్ని కూడా చూపించారు. బాగుంది కాని వారు సమస్యను పరిష్కరించలేక పోయారు కారణం వారు పరిష్కరించాలనుకొన్నా దాని తీవ్రత వారిని ముందుకు వెనుకకూ పంపించలేక పోయింది.

Sourcewww.andhrabhoomi.net

No comments:

Post a Comment