Monday, December 27, 2010

సొంత అజెండాలతో మీడియా

వికీలీక్స్‌ నిర్వాహకుడు జూలియన్‌ అసాంజే ఎంత సంచలనం సృష్టించారు. అమెరికా బలహీనతలను, దాష్టీకాలను నగంగా చూపించారు. ఒక్క అమెరికానేకాదు అనేక దేశాలకు సంబంధించిన రహస్యాలను చేధించిన తీరు అబ్బురపరుస్తుంది. నిజానికి అలాంటి వ్యక్తికి ఎంతటి గౌరవం దక్కాలి. కాని ఏమి జరుగుతోంది. జరిగిన తప్పులకు చెంపలేసుకుని సరిచేసుకోవలసిన అమెరికా ఎలా వ్యవహరిస్తోంది. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ గందరగోళం సృష్టిస్తున్న అమెరికా ఇప్పుడు అసాంజేను వేటాడుతోంది. ఆయనను అమెరికా జైళ్లకు తరలించాలని చూస్తోంది. అక్కడికి వెళితే తనను హత్య చేస్తారని స్వయంగా అసాంజే ప్రకటించడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంటే అమెరికాతో సహా అనేక దేశాలలో పైకి సూక్తులు చెప్పేదొకటి, చేసేదొకటి అన్నది అర్థం అయిపోవడం లేదూ... చివరికి అసాంజేని సెక్స్‌ సంబంధిత కేసులు పెట్టి వేధిస్తున్న తీరు ప్రజాస్వామ్యం పేరుతో ఉన్న వ్యవస్థలోని డొల్లతనాన్ని వెల్లడిచేస్తోంది.

ప్రపంచంలో ఉన్న వ్యవస్థలన్నిటిలోకి సర్వోత్కృష్టమైనది ప్రజాస్వామ్యం. అంతమాత్రం చేత ఈ వ్యవస్థలోను లోటుపాట్లు లేవని కాదు. కాని ఆ లోటుపాట్లు హద్దులు దాటిపోతున్నట్లనిపిస్తుంది. ఇదేదో మన దేశానికో, మన రాష్ట్రానికో పరిమితం అని కాదు. ప్రపంచం అంతటా ఉన్న పరిణామక్రమమే. అలాగే ఇప్పటికిప్పుడు ప్రజాస్వామ్యం, మీడియా పాడైపోతున్నాయని కూడా మనం అనుకోనవసరం లేదు. ఇప్పుడున్న సమస్యలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. ఇకపై ఉంటాయి. కాకపోతే కొంచెం తరతమ బేధాలతో, ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో ఏమి జరుగుతోందో చూడండి. వికీలీక్స్‌ నిర్వాహకుడు జూలియన్‌ అసాంజే ఎంత సంచలనం సృష్టించారు. అమెరికా బలహీనతలను, దాష్టీకాలను నగంగా చూపించారు. ఒక్క అమెరికానేకాదు అనేక దేశాలకు సంబంధించిన రహస్యాలను చేధించిన తీరు అబ్బురపరుస్తుంది. నిజానికి అలాంటి వ్యక్తికి ఎంతటి గౌరవం దక్కాలి. కాని ఏమి జరుగుతోంది. జరిగిన తప్పులకు చెంపలేసుకుని సరిచేసుకోవలసిన అమెరికా ఎలా వ్యవహరిస్తోంది. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ గందరగోళం సృష్టిస్తున్న అమెరికా ఇప్పుడు అసాంజేను వేటాడుతోంది. ఆయనను అమెరికా జైళ్లకు తరలించాలని చూస్తోంది. అక్కడికి వెళితే తనను హత్య చేస్తారని స్వయంగా అసాంజే ప్రకటించడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంటే అమెరికాతో సహా అనేక దేశాలలో పైకి సూక్తులు చెప్పేదొకటి, చేసేదొకటి అన్నది అర్థం అయిపోవడం లేదూ... చివరికి అసాంజేని సెక్స్‌ సంబంధిత కేసులు పెట్టి వేధిస్తున్న తీరు ప్రజాస్వామ్యం పేరుతో ఉన్న వ్యవస్థలోని డొల్లతనాన్ని వెల్లడిచేస్తోంది. నోబుల్‌ శాంతి బహుమతిని పొందిన లియు జియాబోను జైలు నుండి విడుదల చేయడం లేదని చైనాను విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ఐరోపా దేశాలు ఎలా స్పందించాయో మనం చూశాము. మరి అసాంజే విషయంలో కూడా ఆ దేశాలు అదే విధంగా స్పందించాలి కదా. నా దృష్టిలో ఇంతవరకు జర్నలిజం చరిత్రలో ఇంత సంచలనం సృష్టించిన వ్యక్తి మరొకరు లేరని అనుకుంటాను. ఇక మన దేశానికి వద్దాం. నీరా రాడియా టేపులు వ్యవహారం మన జర్నలిస్టుల లొసుగులను బట్టబయలు చేసింది. అయితే దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్న చందంగా మన వ్యవస్థ నడుస్తోంది. జర్నలిస్టులు, రాజకీయవేత్తలు, బ్యూరోక్రాట్లు మిలాఖతై అక్రమాలకు పాల్పడుతున్న సందర్భాలు ఒక్క ఢిల్లీలోనే కాదు, అన్ని రాష్ట్రాలలోనూ జరుగుతున్నాయి. అంతదాకా ఎందుకు మన రాష్ట్రంలో జరగడం లేదని చెప్పే సాహసం నేను చేయలేను. జర్నలిస్టు మిత్రులలో కొందరు మీడియా సంస్థలకు అధిపతులయ్యారు. అందరిని అనజాలం కాని కొంతమందిపై ఆరోపణలు ఉన్నది అవాస్తవమని ఎవరం చెప్పగలం. అంతమాత్రాన వారినందరిని ఆక్షేపించే పరిస్థితి లేదు. పైగా వారు చెప్పే నీతి వాక్యాలను ప్రజలు కూడా శ్రద్ధగా వినాల్సిందే. నా అనుభవంలో ఒకటి కనిపించింది. పైరవీలు చేసే జర్నలిస్టులే అనండి, మరొకరనండి. వారికి రెండు రకాల అడ్వాంటేజెస్‌ ఉంటున్నాయి. ఒకటి ముందుగా వారికి సమాచారం లభిస్తుంది. లేదా సమాచారాన్ని వారు సృష్టించగలుగుతున్నారు. తద్వారా వారు సంబంధిత వ్యక్తులతో కలిసి అక్రమార్జన చేయగలుగుతున్నారు. అదే సమయంలో తమకు కావలసిన రీతిలో ఆ సమాచారాన్ని వినియోగించి ప్రజలను ప్రభావితుల్ని చేయగలుగుతున్నారు. మీరు అడగవచ్చు దీనికేమైనా ఆధారాలు ఉన్నాయా అని ఎన్నో ఉన్నాయి. ఒక్కటి మాత్రం చెబుతాను. సాధారణంగా టెండర్ల వ్యవహారం పూర్తి అయ్యాక ఏవైనా మార్పులు జరిగితే మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కాని ఓ ఓడరేవు విషయంలో ఇందుకు భిన్నంగా జరిగితే ఒకటి, రెండు మీడియా సంస్థలు ఏమని ప్రచారం చేశాయో తెలుసా? అసలు జరిగిన లోపాలను బయటపెట్టకుండా ఆ ఓడరేవు ఫలానా సంస్థకు దక్కడం వల్ల ఆ ప్రాంతానికి గొప్ప మేలు జరగబోతోందని, మరి అవే ప్రచార సంస్థలు ఇంతకుముందు ఇలాంటివి జరిగితే దారుణాలు జరిగినట్లు రాశాయి. ఇక మరో అంశానికి వద్దాం. నేను ప్రతిరోజు నా వృత్తిలో భాగంగా ప్రతిరోజు వార్త పత్రికలను విశ్లేషిస్తుంటాను. అందుకోసం 14,15 పత్రికలు చూసి విశేషాలు తెలుసుకుంటాను. ఆయా పత్రికలు ఒక విషయంపై వార్తలు విభిన్న తరహాలలో రాసే తీరు చూసి ఆశ్చర్యం వేస్తుంటుంది. ఉదాహరణకు ఇవ్వాళ్టి పత్రికలనే తీసుకోండి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చిత్తూరు జిల్లాలో ఘనస్వాగతం లభించినట్లు, నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం మొహం చాటేసినట్లు ఒక పత్రిక రాసింది. మిగిలిన పత్రికలలో అత్యధికం కిరణ్‌కు నిరసనలు ఎదురయ్యాయని, చేదు అనుభవం అని రాశాయి. ఇందులో దేనిని ప్రమాణంగా తీసుకోవాలి. మరి ఆ పత్రికకు అలా ఎందుకు కనిపించిందంటే ఏమి చెబుతాం. వారి ఎజెండాకు అనుగుణంగా రాశారనుకోవాలి. విజయవాడలో జగన్‌ సభ గురించి ఒక తెలుగు పత్రిక, ఒక ఆంగ్ల పత్రిక అతి తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా అతీతంగా ఉందని అనుకోనవసరం లేదు. ఒక టివీ ఖచ్చితంగా ఒక నాయకుడి ఎజెండా కోసం పనిచేస్తుంటే, మరో టీవీ వేరొక నాయకుడి కోసం పనిచేస్తోంది. ఇంకొక టీవీ సాధ్యమైనంత ఎక్కువగా విద్వేషాలు రెచ్చగొట్టడానికి విశేష కృషి చేస్తుంది. మరో రెండు టీవీలు ఒక వ్యక్తిని వ్యతిరేకించడం కోసం అధికారంలో ఉన్న వారికి, ప్రతిపక్షంలో ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తీరును గమనిస్తున్నాం. మరికొన్ని టీవీలు వ్యక్తిగత ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రసారాలు చేస్తున్నమాట కూడా నిజమే. అయితే ఇవన్ని జర్నలిస్టు ప్రమాణాలకు అనుగుణంగా అసలు పనిచేయడం లేదని అనజాలం. వారికి ఇబ్బంది లేనప్పుడు, వారి ప్రయోజనాలతో సంబంధం లేనప్పుడు ఆ ప్రమాణాలను పాటిస్తుంటారు. ఎవరైనా వృత్తిపరంగా ప్రమాణాలు పాటించడం కూడా కష్టంగా ఉన్న రోజులివి. ప్రభుత్వంలో ఉన్న వారితో ఉండే అవసరాల దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఏదోరకంగా ఇబ్బందులు వస్తాయనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులను ఉపయోగించి ఏదో ఒక కేసు పెట్టి వేధిస్తున్న సందర్భాలు మనకు తెలుసు. పార్టీలు, వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం టీవీలను, పత్రికలను పెడుతున్న రోజులలో మంచి ప్రమాణాలు ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. ఏ పార్టీవారు ఆ పార్టీ టీవీని చూసుకోవచ్చు. ఏ పార్టీవారు ఆ పార్టీ పత్రికను చదువుకోవచ్చు. ఇది కూడా ఒకరకంగా ప్రజాస్వామ్యమేనేమో? ప్రస్తుత మీడియా వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుందన్నది కూడా చర్చనీయాంశమే. ఎందుకంటే మన సమాజం కూడా అదే రీతిలో విభజనకు గురి అవుతోంది. అది కొంత బాధాకరం. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పదలిచాను. ఇటీవలి కాలంలో మీడియా, రాజకీయ పార్టీలు కలిసి ఒక్క అంశంలో సమాజానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని చెప్పదలిచాను. మన రాష్ట్రంలో ఎవరు ఏ విధంగా చనిపోయినప్పటికీ, దానిని అప్పుడు జరుగుతున్న రాజకీయ వివాదానికో, వ్యక్తికో జోడించి అందువల్లనే ఆత్మహత్య చేసుకున్నారనో, గుండెపోటుతో చనిపోయారనో చెప్పడం ఆరంభించారు. ఉద్యమాల కోసం ఆత్మహత్యలు, ఒక వ్యక్తిని ఒక ఊరు రానివ్వకపోయినా, రానిచ్చినా ఆత్మహత్యలు, ఒక నాయకుడిని అరెస్టు చేసినా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు రాజకీయపార్టీలు చెబుతున్నాయి. మీడియా కూడా విశేషంగా ప్రచారం చేస్తోంది. అంటే అసలు ఆత్మహత్యల ఘటనలు జరగలేదని కాదు. నిజానికి ఆత్మహత్యలు చేసుకున్నవారి పూర్వాపరాలలోకి వెళ్లి రాసే ధైర్యం మీడియాకు లేని పరిస్థితి ఏర్పడడం బాధాకరంగా ఉంది. తాజా కాన్సెప్ట్‌ గుండెపోటు, ఎక్కడన్నా ఒకరిద్దరికి గుండెపోటు వచ్చి మరణించారని అనుకుంటే అర్థం వుంది. ప్రతిరోజు వందల సంఖ్యలో ఫలానా కారణంగా గుండెపోటు వచ్చి మరణించారని పత్రికలు, టీవీలు పోటీపడి రాస్తున్నాయి, ప్రసారం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మన రాష్ట్ర ప్రజలకు ఇదే సైకిక్‌ ప్రాబ్లమ్‌ వచ్చిందని ఇతర రాష్ట్రాల వారు అనుకునే ప్రమాదం ఉంది. ఇన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ మీడియాకు స్వేచ్ఛ ఉండాల్సిందే. రాబోయే రోజులు మరింత సంక్షోభ భరితంగా ఉంటాయని అంతా భయపడుతున్నారు. ఈ భయానికి మీడియా ఆజ్యం పోయకుంటే అదే పదివేలు.

Source: www.prajasakti.com

1 comment:

  1. inthaki meeru 4-raallu venkesaaraa ledaa?okavela aa panilo meeku kitukulu teliyakapothae,chennai"saakshi"-edition beuro vadda sishyarikam cheyaalsinde mari...

    ReplyDelete