Tuesday, December 28, 2010

డిటిహెచ్‌లతో.. కేబుల్‌ పరిశ్రమకు పొంచి ఉన్న ముప్పు

నిన్నటి వరకు ఎదురులేని విధంగా టీవీఛానళ్ల ప్రసారాల్లో గుత్తాధిపత్యం సాధించిన కేబుల్‌ పరిశ్రమ మనుగడకు ప్రస్తుతం ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. టెలివిజన్‌ నిత్యావసరంగా మారింది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఇంట్లో టెలివిజన్‌ ఉండాలనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. ప్రస్తుతం టీవీ లేని ఇళ్లు చాలా అరుదుగా ఉన్నాయి. అప్పు చేసో, ఫైనాన్స్‌లోనో టీవీలను తీసుకుంటున్నారంటే అది ప్రజలను ఎంత ప్రభావితం చేసిందో తెలుస్తోంది. టీవీ ఉంటే సరిపోతుందా అంటే కుదరదు. కేబుల్‌ కనెక్షన్‌ ఉండాలి. దీంతో కేబుల్‌ కనెక్షన్‌కు డిమాండ్‌ పెరిగింది. కేబుల్‌ కనెక్షన్‌ కోసం ప్రజలు ఆరాటపడడంతో ప్రాంతాల వారీగా కేబుల్‌ ఆపరేటర్ల వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఈ వ్యవస్థ మంచి ఆదాయాన్నిచ్చింది. ఆర్థికంగా మంచి లాభాలను తెచ్చి పెడుతుండటంతో కేబుల్‌ ప్రసారాల వ్యవస్థలోకి పెట్టుబడిదారులు ప్రవేశించారు. పెట్టుబడిదారుల ప్రవేశంతో కేబుల్‌ వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. కేబుల్‌ వ్యవస్థ పట్టణాల వారీగా వికేంద్రీకరణ జరిగింది. అప్పటి వరకు కేవలం సినిమాల ప్రసారానికే పరిమితమైన కేబుల్‌ వ్యవస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుని దేశ, విదేశాల్లోని వివిధ ఛానళ్లను ప్రసారం చేయటం ప్రారంభించింది. ప్రాంతాల వారీగా కేబుల్‌ ప్రసారాలు చేస్తున్న ఆపరేటర్లు పెట్టుబడిదారులకు ఏజెంట్లుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేబుల్‌ పరిశ్రమ గుత్తాధిపత్యంలోకి వెళ్లింది. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా చెలామణి అవుతూ వచ్చింది. గతంలో కనెక్షన్‌కు నెలకు రూ.50 వసూలు చేసేవారు. గుత్తాధిపత్యంలోకి వెళ్లిన తర్వాత నెలకు రూ.100, తర్వాత రూ.150 వసూలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం రూ.175 వరకు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా నెల వారీ చెల్లించాల్సిన ధరలను దఫదఫాలుగా పెంచుకుంటూపోయారు. అప్పటి వరకు నెలకు వేలల్లో వస్తున్న ఆదాయం లక్షలకు చేరింది. దీంతో కేబుల్‌ ప్రసారాల వ్యవస్థపై పారిశ్రామికవేత్తల కన్నుపడింది. కోట్లాది రూపాయలను వివిధ ప్రకటనల కోసం ఎలాగూ ఖర్చు చేస్తున్నాం కాబట్టి ఛానళ్ల ప్రసార వ్యవస్థలోకి వెళ్లితే తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవటంతోపాటు లాభాలు సొంతం చేసుకోవచ్చనే భావన పారిశ్రామికవేత్తల్లో వచ్చింది. దీంతో వారు ఈ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే ప్రసారాలు (డెరెక్ట్‌ టూ హోమ్‌) పథకాన్ని వారు అందిపుచ్చుకున్నారు. కేబుల్‌ అవసరం లేకుండానే ఉపగ్రహం నుంచి నేరుగా ప్రసారాలు చేసే కార్యక్రమం ప్రారంభమైంది. మొదటిగా డిష్‌ టీవీ ఈరంగంలో ప్రవేశించి మంచి లాభాలను ఆర్జించింది. అనంతరం టాటాస్కై, బిగ్‌ టీవీ వచ్చాయి. ఇటీవల సన్‌డైరెక్టు, ఎయిర్‌టెల్‌, వీడియోకాన్‌ వంటి సంస్థలు ప్రవేశించాయి. మొదట్లో డిష్‌ ద్వారా ప్రసారాల సేవలు పొందాలంటే మొదట్లో సుమారు రూ.నాలుగువేల వరకు చెల్లించాల్సి వచ్చేది. రూ.150 నెలవారీ చెల్లించాల్సి వచ్చేది. అయితే ఈ రంగంలో పోటీ పెరగటంతో గత నెల నుంచి డిష్‌ కనెక్షన్‌కు కేవలం రూ.900 చెల్లిస్తే సరిపోతుంది. నెల వారీ రూ.99 చెల్లించాలి. డిష్‌ ద్వారా 135 నుంచి 200 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఛానళ్ల ప్రసారాలను అందిస్తున్నారు. దీంతో ప్రజలు డిష్‌ కనెక్షన్‌ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. డిష్‌ కనెక్షన్ల వ్యవస్థలో పోటీ నెలకొంది. సెల్‌ఫోన్‌ కనెక్షన్‌ విషయంలో వచ్చిన పోటీ కారణంగా వాటి ధరలు ఏ విధంగా తగ్గాయో అదేలా డిష్‌ కనెక్షన్ల ధరలూ తగ్గుతాయంటున్నారు. ఛార్జీలు తగ్గితే డిష్‌ కనెక్షన్లకు ఆదరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే రానున్న ఆరునెలల్లో కేబుల్‌ పరిశ్రమ సంక్షోభంలో పడుతుందని పలువురు చెబుతున్నారు. డిటిహెచ్‌ సేవలు బలపడటం వల్ల కేబుల్‌ వ్యవస్థ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Source: www.prajasakti.com

No comments:

Post a Comment