Wednesday, December 15, 2010

సరిగమలతో ఉపాధి మార్గాలు

 ఎ.ఆర్‌.రెహమాన్‌ జయహో అంటే.. యావత్‌ ప్రపంచం జై కొట్టింది. సరిగమల సిరియని కీర్తించింది. ఎక్కడో అమెరికాలో మైకేల్‌ జాక్సన్‌ కన్నుమూస్తే విశ్వమంతా నివాళులర్పించింది. నిను మరువలేమంటూ నీరాజనాలు పలికింది. మొన్నటికి మొన్న మన రాష్ట్రానికి చెందిన శ్రీరామ్‌ను ' నువ్వే మా ఐడల్‌' అంటూ భరతావని జేజేలు పలికింది. 'ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానీ... భాధ పడకమ్మా నీవు దిగులు చెందకమ్మా' అంటూ చిన్నారి మధుప్రియ ఆంధ్రప్రదేశ్‌ మొత్తాన్ని ఆలోచింపజేసింది. వీరందరి నేపథ్యమూ ఒక్కటే... అదే సంగీతం. ప్రపంచంలో ఏ రంగమైనా పేరు ప్రతిష్టలు, కావాల్సినంత డబ్బు సంపాదించగలిగే శక్తి సమకూర్చుకో గలదేమో గానీ... హృదయాన్ని కదిలించే శక్తి ఒక్క సంగీతానికే మాత్రమే వుంది. వినోద ప్రపంచం విస్తరిస్తున్న నేటి ితరుణంలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. యువతరానికి ఆశాకిరణంలా వెలుగొందుతున్న ఈ సంగీత సామ్రాజ్యంలో ఎలాంటి అవకాశాలున్నాయి. శిక్షణ ఎక్కడ లభిస్తుంది. ఎలాంటి అర్హతలు అవసరం తదితర విషయాలు తెలుసుకుందాం.

సంగీతంలో ప్రతిభ కనబర్చాలంటే... ఆ రంగంలో రాణించాలంటే... ట్యాలెంట్‌ ఒక్కటే సరిపోదు. సంప్రదాయ సంగీత వారసత్వం కలిగిన వారైనా సరే సాధన, శిక్షణ తప్పనిసరి. ఏదేని సంగీత శిక్షణా కేంద్రంలో ప్రవేశిండమే మ్యూజిక్‌ ప్రపంచంలో రాణించేందుకు వేసే తొలి అడుగు. దీనికి తోడు కాలనుగుణమైన అభిరుచులను ఆహ్వానిస్తూ... ఆస్వాదిస్తూ అందించగలిగే నేర్పును ఒడిసి పట్టకోగలగాలి. అంతటి దీక్షాదక్షత అలవర్చుకోవాలి. అంకిత భావంతో నిరంతర సాధనకు సిద్ధపడాలి. అప్పుడే సముచిత స్థానం దక్కుతుంది.

సంప్రదాయ, జానపద, జాజ్‌, పాప్‌ ఫ్యూజన్‌.. తదితర వైవిధ్యమైన సంగీత రీతులున్నట్లే... ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు కూడా మ్యూజిక్‌ రంగంలో ఉన్నాయి. నేపథ్యగానం, స్వరకూర్పులేగాక కంపోజర్‌, సాంగ్స్‌రైటర్‌, మ్యూజిక్‌, పబ్లిషర్‌, మ్యూజిక్‌ జర్నలిస్టు, డిస్క్‌ జాకీస్‌, వీడియో జాకీస్‌, మ్యూజిక్‌ థెరపిస్ట్‌, ఆర్టిస్ట్‌ మేనేజర్‌, పిఆర్‌... ఇలా ఎన్నో రకాలుగా స్థిరపడవచ్చు. స్వయం ఉపాధి పొందేందుకు కూడా ఈ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఇంట్లోనే ప్రయివేటుగా మ్యూజికల్‌ క్లాసెస్‌ చెప్పొచ్చు. మ్యూజిక్‌ స్కూల్‌ను నడపవచ్చు. వివిధ సందర్భాలను పురస్కరించుకొని సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తూ కూడా ఉపాధి పొందవచ్చు. టివి ఛానళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడం, మ్యూజిక్‌ ఛానెళ్ల పాపులారిటీ పెరుగుతుండటం, పెద్ద పెద్ద కార్పొరేటు సంస్థలు, తమ ఉత్పత్తుల ప్రచారం కోసం సంగీతోత్సవాలు (మ్యూజికల్‌ ఈవెంట్లు) నిర్వహిస్తుండటంవల్ల నేడు ఈ రంగం వ్యాపార సుస్థిరత సాధిస్తోంది. ఏ చిన్న అవకాశం తగిలి సక్సెస్‌ అయినా.. అవకాశాలు, డబ్బు, ప్రతిష్ట వెతుక్కుంటూ వస్తాయి. సరైన ప్రణాళిక, అంకుఠిత దీక్ష, నిరంతర సాధనవుంటే ఈ రంగంలో స్థిరపడవచ్చు.

ఎలాంటి అర్హతలు ఉండాలి: సంగీతంలో రాణించాలంటే ప్రత్యేక అర్హతలేవీ ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఏదేని మ్యూజిక్‌ కోర్సు చేయాలంటే మాత్రం కనీసం ఇంటర్మీడియట్‌ అయినా పూర్తి చేసి వుండాలి. మ్యూజిక్‌ను కెరియర్‌గా ఎంచుకునేవారికి సంగీతమంటే అభిమానం, ఆసక్తి ఉండాలి. స్పందించే గుణం, మ్యూజికల్‌ సెన్స్‌ ఉండాలి. వేదికపై అనర్ఘళంగా గళం విప్పగలిగే దృఢ మనస్తత్వం తమదైన ప్రత్యేక ముద్ర, విభిన్నత, ప్రత్యేకత, క్రియేటివిటీ ఆవిష్కరించగలగాలి. ఇవి లేకపోతే సాధన ద్వారా అలవర్చుకోవాలి. మంచి ప్రతిభ ఉండికూడా నలుగురికీ తెలియకపోతే అది వృథాప్రయాసే అవుతుంది. కాబట్టి ఈ రంగంలో రాణించాలనుకునే వారికి ప్రచారం కూడా తప్పనిసరి.అందుకే సంబంధిత నిపుణులతో, వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలి. కాలనుగుణ అభిరుచులకు అనుగుణంగా శిక్షణ పొందేందుకు సిద్ధపడాలి. వీలైనప్పుడల్లా డెమో క్యాసెట్స్‌ విడుదల చేయాలి. వివిధ కార్యక్రమాలతో తరచూ మీడియా దృష్టినీ, తద్వారా సంగీత ప్రియులనూ ఆకట్టుకోగలగాలి.

కోర్సులు/శిక్షణ: మ్యూజిక్‌ వినోదమే కాదు, ఇప్పుడో పెద్ద వ్యాపారం కూడా. లెక్కలేనన్ని శిక్షణా సంస్థలు ఈ రంగంలో వెలుస్తున్నాయి. పట్టణాల్లో చాలావరకు ప్రాథమిక సంగీత శిక్షణా కేంద్రాలు ఉంటున్నాయి. మన రాష్ట్రంలో ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖప్టణం), నాగార్జున యూనివర్సిటీ(నాగార్జునాసాగర్‌), శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ (తిరుపతి) వివిధ రకాల సంగీత కోర్సులను అందిస్తున్నాయి.

మ్యూజిక్‌ కంపోజర్‌/సాంగ్స్‌ రైటర్స్‌: మంచి రచనాశైలి కలిగినవారు స్వర రచన, గేయ రచనలో ప్రవేశించవచ్చు. ఈ కోర్సులు చేసేవారు సంగీత కూర్పు, గేయ రచనలో విడివిడిగా లేదా రెండింటిలోనూ రాణించవచ్చు. కంపోజర్లు ప్రేక్షకుల అభిరుచులను ఆకళింపు చేసుకొని సరికొత్త బాణీలు కూర్చాల్సి వుంటుంది. ఇందుకోసం సంగీతంలో విభిన్న రీతుల్లో పట్టు సాధించాలి. అలాగే సౌండ్‌పై కూడా స్పష్టమైన అవగాహన పెంచుకోవాల్సి వుంటుంది. గేయ రచన చేయదల్చుకున్నవారు కూడా ప్రేక్షకుల నాడి తెలుసుకోవాలి. చెప్పాల్సిన భావాలను అర్థం చేసుకొనేవిధంగా, సంగీత బాణీలకు అనుగుణంగా ప్రజలకు చేరువయ్యే పదజాలంతో పాటల లిరిక్స్‌ రాయాల్సి వుంటుంది. ఇందులోనే జింగిల్‌ రైటర్స్‌ అనే మరో కేటగిరి వుంది. ఎఫ్‌ఎం, రేడియో, టివిలలో వచ్చే ప్రకటనలకు ప్రత్యేకంగా లిరిక్స్‌ రాసేవారు ఈ విధంగా వ్యవహరిస్తారు. కంపోజర్లు/గేయ రచయితలు సినిమాలకు సంగీతం అందించవచ్చు. వాణిజ్య జింగిల్స్‌లోనూ రాణించవచ్చు. జానపద గీతాలతో చక్కని ఆల్బమ్స్‌ రూపొందించి ఖ్యాతి గడించవచ్చు. ఈ రెండు రకాల కోర్సులు చేసేవారు వ్యాపార దృక్కోణం అర్థం చేసుకోవాల్సి వుంటుంది. అంది వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలగాలి. కాపీరైటర్లు, నెట్‌వర్కింగ్‌, పబ్లిషింగ్‌, కాంట్రాక్టులు, ప్రదర్శన హక్కులు వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. మ్యూజిక్‌ కంపోజర్లు, అడ్వర్టయిజింగ్‌ కంపెనీలలోనూ, మ్యూజిక్‌ పబ్లిషింగ్‌ సంస్థల్లోనూ, సినిమాల్లోనూ, టివి ఛానళ్లలోనూ, రేడియోలలోనూ పనిచేయవచ్చు. జింగిల్‌ రైటర్లు, నిర్మాతలతో, వివిధ సంస్థల డైరెక్టర్లతో పరిచయాలు ఏర్పర్చుకుంటే, ఆయా సంస్థలకు వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తూ ఉపాధి పొందవచ్చు. ఆ తర్వాత సినిమాల్లో, టివిల్లో అవకాశాలు చేజిక్కించుకోవచ్చు.

Source: www.prajasakti.com

No comments:

Post a Comment