Friday, December 17, 2010

జి శాట్‌ 5 పి ప్రయోగానికి సర్వం సిద్ధం !

సూళ్ళూరుపేట (వి.వి.) : సమాచార, సాంకేతిక రంగ సేవల బలోపేతానికి ఈ నెల 20వ తేదీ సాయంకాలం 4గంటల సమయంలో శ్రీహరికోటలోని రెండవ లాంచ్‌ప్యాడ్‌ నుంచి జి.ఎస్‌.ఎల్‌.వి-ఎఫ్‌06 (జియో సింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) వాహక నౌకద్వారా నింగిలోకి పంపనున్న జిశాట్‌ 5పి ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే తలపెట్టిన లక్ష్యం నెరవేరడంతోపాటు గత ఏడాది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పరీక్షించి కీలక క్రయోదశలో విఫలం చెందడంతో నిరాశ చెందిన శాస్త్రవేత్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఈ ప్రయోగ విజయం చక్కని వేదిక కానుంది.

ఈనెల12వ తేదీన శాటిలైట్‌ను రాకెట్‌కు అనుసంధానించి తదుపరి కార్యక్రమాలను అహర్నిశలూ శ్రమిస్తూ శరవేగంగా పూర్తిచేస్తున్నారు. 2310 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాన్ని 420 టన్నుల బరువు కలిగిన రాకెట్‌ ద్వారా నింగిలోకి పంపబడే జిశాట్‌ 5పి భూ ఉపరితలంనుంచి అత్యల్పంగా175 కి.మీ, అత్యధిక దూరం 35,975 కి.మీ.ల కక్ష్యలో భూమధ్య రేఖకు 19.3 డిగ్రీల వాలులో విస్తరించిన భూస్థిర మధ్యంతర కక్ష్య (జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ - జి.టి.ఒ)కు చేరుతుంది.అనంతరం దశలవారీగా రాకెట్‌ను నియంత్రిస్తూ ఉపగ్రహాన్ని షుమారు 36,000 కి.మీ. ఎత్తులో 55 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద వృత్తాకార భూస్థిర కక్ష్యలోకి చేరుస్తారు. సాంకేతిక పరిజ్ఞానం విరివిగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో సరిపడినన్ని ట్రాన్స్‌పాండర్లు అందుబాటులోలేవు.అందువల్ల ఇప్పటికే పలు టీవీ చానళ్ళ కార్యక్రమాలకు అంతరాయాలు కలిగిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని కొత్తసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగ పడనుంది. 1983లో ప్రారంభించబడిన ఇన్సాట్‌ వ్యవస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న తొమ్మిది ఉపగ్రహాల ద్వారా ఎస్‌ బ్యాండ్‌, సీ బ్యాండ్‌, అభివృద్ధిపరచిన సీ బ్యాండ్‌, కె.యు బ్యాండ్‌లలో మొత్తం 178 పనిచేసే ట్రాన్స్‌పాండర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రయోగించనున్న జిశాట్‌ 5పిలో పొందుపరచబడ్డ 24 సాధారణ, 12 అభివృద్ధిపరిచిన సీ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లు ఈ వ్యవస్థకు మరింత పరిపుష్టి కలిగిస్తాయి. వీటిద్వారా సమాచార, ప్రసార, వాతావరణ పరిశీలన, విపత్తుల సమాచారం, అన్వేషణ-రక్షణ వంటి వివిధ సేవలు ఇస్రో అందిస్తుంది.గత ఏడాది ఏప్రియల్‌ 15వ తేదీన స్వదేశీ తయారీ క్రయోజనిక్‌ ఇంజన్‌తో జి.ఎస్‌.ఎల్‌.వి-డి3 ద్వారా ప్రయోగించిన జిశాట్‌ 4 ప్రయోగం విఫలం చెందడంతో ఎప్పటిలానే రష్యానుంచి దిగుమతి చేసుకున్న క్రయో ఇంజన్‌తో ప్రస్తుత య్రోగాన్ని జరుపనున్నారు.13.7 సంవత్సరాల జీవిత కాలం సేవలందించేందుకు ఉద్దేశించిన ఈ ఉపగ్రహం ఇప్పటికే సేవలందింస్తున్న శాటిలైట్లకు జిశాట్‌ సిరీస్‌లో ఐదవదిగా నింగిలోకి పంపుతున్న జిశాట్‌ 5పి జతకలిసి సేవలను విస్తరించనుంది.

Source: www.visalaandhra.com

No comments:

Post a Comment