ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ నెల 31న తన నివేదికను కేంద్రానికి అందచేయనున్న నేపథ్యంలో 'కవ్వింపు ప్రసారాల'కు తెర దించాలని జాతీయ ప్రసార సంస్థల సంఘం (ఎన్‌బిఎ) న్యూస్ ఛానళ్లకు సూచించింది. సంచలనాత్మకమైన, రెచ్చగొట్టే, కవ్వించే అంశాలకు సంబంధించిన వార్తా కథనాలను ప్రసారం చేయకుండా తగు జాగ్రత్త వహించటం అవసరమని ఎన్‌బిఎ తన సభ్యులైన అన్ని ఛానళ్ల సంపాదకులకు సూచించింది. ఈ అంశానికి సంబంధించిన అన్ని వార్తాంశాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని, ప్రజా ప్రయోజనాలను, శాంతిని కాపాడుకునేందుకు వీటిని కచ్చితంగా అమలుపర్చాలని ఎన్‌బిఎ తన లేఖలో సూచించింది. న్యూస్ ఛానళ్లు తాము అందచేసే సమాచారం ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేదిగా వుండకుండా తగు జాగ్రత్త వహించాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించిన అంశాల ప్రసారంలో అన్ని నైతిక సూత్రాలతో పాటు తాము సమయానుసారంగా జారీ చేసే మార్గదర్శకాలకు కట్టుబడాలని సూచించింది. హింస, ఉద్యమం, ఆత్మాహుతి వంటి దృశ్యాల కథనాలను, నివేదికకు సంబంధించిన నిరసనలు, విజయోత్సవాల వంటి వాటిని ప్రసారం చేయరాదని సూచించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించిన వార్తాంశాల ప్రసారాల క్లిప్పింగ్‌లు, స్క్రిప్ట్‌లను అవసరమైతే భవిష్యత్తు పరిశీలనార్ధం జాగ్రత్త చేయాలని సూచించింది.
నేడు 'శ్రీకృష్ణ' మీడియా భేటీ
శ్రీకృష్ణ కమిటీ సభ్యులు దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విలేకరులతో పాటు జాతీయ మీడియా సంస్థలకూ ఆహ్వానం పంపారు. స్థూలంగా కమిటీ రాష్ట్ర పర్యటనల సారాంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి కమిటీ ఛైర్మన్ శ్రీకృష్ణతో పాటు ఇతర సభ్యులూ హాజరవ్వనున్నారు. శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చే తేదీతో పాటు ఇతర అంశాలపై టివి ఛానళ్లలో వస్తున్న కథనాలపై కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్ సోమవారమిక్కడ స్పందించారు.'మీడియాలో వస్తున్న పలు రకాల వార్తలపై నేను మాట్లాడను. కమిటీ ఈ నెల 31నే కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది ' అని ఆయన స్పష్టం చేశారు.
Source: www.prajasakti.com
No comments:
Post a Comment