Tuesday, December 28, 2010

ఫేస్‌బుక్ చెంత నుండగ..ఇక వెతకక్కర్లేదు..

నూతన నటీ నటులు కావలెను - చక్కటి రూప లావణ్యాలూ.. మాట తీరు.. హావభావాలు ఉన్న అందమైన అమ్మాయి/ అబ్బాయిలు.. మేం ఫలానా బ్యానర్‌పై నిర్మించబోయే సరికొత్త చిత్రంలో నటించేందుకు వర్ధమాన నటీనటులకు ఆహ్వానం. వెంటనే పోస్ట్‌కార్డ్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేయండి - అన్న పత్రికా ప్రకటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే అంశం. చాన్నాళ్ల పాటు సాగిన మహా ప్రహసనం. గంటల కొద్దీ స్టూడియోల బయట పడిగాపులూ.. ఏ చెట్ల నీడనో అవకాశం కోసం ఎదురుచూస్తూ ఛాయ్ నీళ్లతో గడిపేసిన రోజులూ.. ఆడిషన్లు.. స్క్రీన్ టెస్ట్‌లతో సతమతమయ్యే డైరెక్టర్లు... - ఇలా రోజుల తరబడి కంటి మీద కునుకు లేకుండా ఉన్న రోజులవి. ఆ పరిస్థితుల్ని దాటి - తాజాగా ‘స్టార్ హంట్’ని పట్టుకోటానికి కొన్ని ఛానెళ్లు వినూత్న ఒరవడిని సృష్టించి ‘క్యాష్’ రోజులూ ఉన్నాయి. ప్రస్తుతం ఓంకార్ ‘జీనియస్’ అందుకు ఉదాహరణ. ఐతే - ఫ్రెష్ టాలెంట్‌ని చేజిక్కించుకోటానికి ఇన్ని వ్యయ ప్రయాసలూ - ప్రహసనాలూ - పరిస్థితులను దాటి కేవలం ఒక్క ‘క్లిక్’తో సెలక్షన్లు ముగిసి పోతున్నాయి. సోషల్ నెట్‌వర్క్ సైట్స్ అంటే ఆర్కుట్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్.. - ఏ సైట్ ఓపెన్ చేసినా చాలు. టన్నుల కొద్దీ టాలెంట్ స్టంట్‌లు. దర్శకుడు రాజన్ సాహి మాటల్లోనే చూస్తే - ‘బిదాయ్’ ‘చాంద్ చుపా బాదల్ మే’ ‘ఏ రిస్తా క్యా కెహలాతా హై’లోని నటీనటులంతా - ఫేస్ బుక్ నుంచో.. ఆర్కుట్ నుంచీ స్క్రీన్‌పై వెలసిన వారే నంటాడు. ‘నటన’ పట్ల ఆసక్తి చూపని యువతీ యువకులు ఈ ప్రపంచంలోనే ఉండరంటే అతిశయోక్తి కాదేమో?! అంతలా జన జీవనంతో పెనవేసుకు పోయింది నటన. ‘వెబ్ సైట్ల’ ద్వారా టాలెంట్‌ని పట్టుకోవటం - అతి సులువైన మార్గం. ఎందుకంటే - ఇక్కడ సమయం వృధా కాదు. ఫేస్ బుక్‌లో వారివారి అభిప్రాయాలనూ.. నటనా ప్రవేశాన్నీ బేరీజు వేసుకుని ‘ఇంటర్వ్యూ’కి ఆహ్వానిస్తే సరిపోతుంది. మా క్రియేటివ్ టీంకి కూడా చెప్పేది అదే అంటాడు.
యూ ట్యూబ్‌లో ‘ఇండియన్ ఐడల్’ ఆడిషన్ వీడియో చూట్టం ద్వారా నేహా ‘చాంద్ చుపా...’కి సెలెక్ట్ అయింది. నేహా ఒక్కత్తె కాదు. అమ్రితా పురి కూడా. ఫేస్‌బుక్‌లో ఒక యాడ్ చూసి తన ఫొటోల్ని మెయిల్ చేసిందామె. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. ప్రైవేట్ ఛానెళ్లలో తనదైన ప్రతిభను చాటుతూ బాలాజీ టెలీ ఫిలిమ్స్ ద్వారా ఎన్నో సీరియళ్లను అందించిన ఏక్తా కపూర్ సైతం ఇదే పంథాని అవలంబిస్తోంది.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment