Tuesday, January 4, 2011

వివాహ వ్యవస్థకి అద్దం పట్టే ‘రాధాకళ్యాణం’

భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో మహోన్నతమైనది. సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే వివాహ వ్యవస్థ ఎంతో ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. అగ్నిసాక్షిగా వేసే మూడు మూళ్లు.. ఏడడుగులే నూరేళ్ల జీవితాన్ని పండిస్తాయన్న బలమైన నమ్మకమే మన వివాహ వ్యవస్థకు ఉన్నతమైన ఉదాహరణ. అలాంటి వివాహ వ్యవస్థకి పసుపు తాడుతో పరిచయమైన ఓ పడుచు పిల్లే రాధ. వివాహం ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందనే ఆసక్తికరమైన కథాంశంతో అశేష ప్రేక్షకులకు అరుదైన కానుకగా జీ తెలుగు అందిస్తున్న ‘రాధా కళ్యాణం’ జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైంది.ఈ ధారావాహిక సోమవారం నుంచి శుక్రవారం వరకు రా.8.30 గంటలకు ప్రసారమవుతుంది. రాధ.. ఓ పేదింటి అమ్మాయి. అందం, అమాయకత్వమే ఆమెకు అలంకారాలు. అందరి అమ్మాయిల్లాగే ఆమె కూడా కన్నవాళ్ల కష్టాలు తీర్చాలనుకుంటుంది. వాళ్ల కన్నీళ్లు తుడవాలనుకుంటుంది. బాగా చదువుకుని వాళ్లకు అన్నీ తానై అండగా నిలవాలని కోరుకుంటుంది. అయితే రాధ ఆశలను, ఆశయాలను ఏ మాత్రం పట్టించుకోని తల్లిదండ్రులు.. ఆమెకి సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసి సాగనంపాలని నిర్ణయించుకుంటారు.అలాంటి పరిస్థితుల్లో రాధ ఏం చేస్తుంది? ఆమె కలలు ఫలిస్తాయా? ఆమె ఆశయం నెరవేరుతుందా?ఆమె పెళ్లికి తల్లిదండ్రులు అంతగా కంగారు పడటానికి గల కారణాలేంటి? వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలా శాసిస్తుంది? ఇలా ఎన్నో అనూహ్యమైన మలుపులతో ఆశ్చర్యచకితులను చేసే సన్నివేశాలతో ఆద్యంతం హృద్యంగా సాగిపోయే అపురూప ధారావాహిక ‘రాధా కళ్యాణం’.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment