Tuesday, January 25, 2011

స్పష్టత లేని - ‘సంధికాలం’?!

ఏదో ఒక అంశంపై ప్రముఖులను రప్పించి వివరాలు ప్రేక్షకులకు వ్యాఖ్యాత ఊతంతో తెలపడం సాధారణంగా చర్చా కార్యక్రమాల్లో జరిగే తంతు. ఎంతసేపూ ఈ పద్ధతేనా, వైవిధ్యమొద్దా అన్న ఆలోచనా ఫలితమే వాటిల్లో నేరుగా అప్పటికప్పుడు సదరు అంశంపై ప్రేక్షకుల్ని కూడా ఫోను ద్వారా భాగస్వామ్యం కల్పించి పాల్గొనేలా చేయడం. ఇలాంటివి ఎలాగా ఇవి అధిక భాగం ప్రత్యక్ష ప్రసారాలైతేనే బావుంటుందన్న భావానికి పొడిగింపే. ఈ మోడల్ రోజూ ఉదయం చానళ్లలో వచ్చే రాజకీయ వార్తల చర్చలకు అనుసంధానం చేయడం ఎప్పట్నించో జరుగుతున్నదే. దాన్ని ఇప్పుడు రాజకీయేతర (ఎక్కువగా) చర్చలకూ వర్తింపజేయడం ఈ మధ్య జరుగుతోంది. అందులో భాగంగానే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ‘సంధికాలం’ చర్చా కార్యక్రమం ప్రసారం చేస్తోంది. కేవలం ‘సంధికాలం’ అనే టైటిల్‌నే ఉంచేస్తే కార్యక్రమం విషయావగాహనకు కొద్దిగా ఇబ్బందౌతుందన్న ఉద్దేశంతో ఉపనామంగా ‘ఓ ప్రజాస్వామిక చర్చ’ అని కూడా పెట్టారు. ఏతావతా నిర్వాహకుల ఉద్దేశం ఇదో డిస్కషన్ ప్రోగ్రామ్ అని.. ఓకే. ఇందులో ఈ మధ్య ప్రసారం చేసిన కాలాని కనుగుణంగా అంటే ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన ప్రత్యేక దినాలు (మదర్స్ డే, వేలంటైన్స్ డే, న్యూ ఇయర్ డే..) ఆ స్థాయిలో జరుపుకోవాల్సిన అవసరం వగైరాలు చర్చించడానికి ‘సెలబ్రేషన్ కల్చర్’ పేరిట జనవరి 1న (ఆంగ్ల నూతన సంవత్సర దినం) చూపారు. అలాగే ఇప్పటి తరానికి తెలియవలసినంతగా తెలియకుండా ఉన్న సంప్రదాయ పండుగలు (సంక్రాంతి) తదితరాల గురించి శనివారం (జనవరి 22) సమాచార విప్లవం లాభనష్టాలు అనే అంశంపై చర్చించారు. విచిత్రమేమిటంటే ఈ చర్చల మూడింటి వౌలిక ఉద్దేశం నిస్సందేహంగా ప్రశంసనీయమైనా అది అనేకానేక విధాలుగా వేర్వేరు కోణాలకు వెళ్లిపోతోంది. దాంతో చర్చా మూలాలకు సరైన న్యాయం జరగడం లేదు. ఉదాహరణకు ‘సమాచార విప్లవం’ విషయానికి వస్తే - తొలుతగా సమాచార విప్లవం అంటూ గతంలో సమాచారానికి కేవలం ఉత్తరాలు, టెలిగ్రామ్‌లు, ట్రంకాల్స్ తదితరాలు ఉండేవి. ఇప్పుడు వాటన్నిటినీ టీవీ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు అధిగమించాయి. దీనివల్ల మనందరికీ ఇప్పటికీ వినీవినీ చెవులు దిబ్బడేసేసిన ‘ప్రపంచం ఓ కుగ్రామం..’ అనే పదబంధాన్ని మన ముందుంచేశారు. సరే.. కానీ దీన్ని అదే విధంగా అంటే వీటి వల్ల ఉత్పన్నమయ్యే అనుకూల, ప్రతికూల అంశాలను స్పృశించడంలోనే విస్తృతి చేసుంటే బావుండేది. అలా కాకుండా మధ్యలో టీవీ దుష్ఫలితాలు, ప్రయోజనాలు అంటూ చాలా సుదీర్ఘంగా చర్చించారు. సమాచార అభివృద్ధిలో టీవీ ఒక భాగం. అంతేకానీ అదే అన్నీ కాదు. దీనికి అనుగుణంగానే ప్రేక్షకులు కూడా మా పిల్లలు టీవీకి విపరీతంగా వశమై పోయారు. ఎలా పరిష్కారం అంటూ ప్రశ్నించారు. దానికి పాల్గొన్న నిపుణులు సమాధానం చెప్పారు. అయితే ఇవి ఎంచుకున్న అంశానికి అంతగా దగ్గరైనవి కావు. పోనీ ఉపాంశంగా స్వీకరించినా ఎవరికి వారు తాము చూడతగ్గ ఛానల్సూ, చూడకూడనివి అంటూ స్వీయ నియంత్రణ చేసుకోవాలనే సలహాలే వచ్చాయి. కానీ ఇది ఆచరణలో పూర్తి స్థాయి ఫలితాలివ్వదు. అందుకు అధికారిక ఆసరా ప్రభుత్వ నియంత్రణ తదితరాలు తప్పనిసరి కావాలి. అలాగే పండుగ ఉత్సాహం ఈ తరంలో కానరావడం లేదు. విషయాలు తెలియడం లేదు అనే దానిపై జరిపిన చర్చ బానే జరిగింది. ముఖ్యంగా పండుగకు పల్లెకెళ్లొచ్చి తిరిగి పట్నానికి వస్తే ఆక్సిజన్ నింపుకొచ్చినట్లు ఉంటుందన్న ఉపమానం బాగుంది. అయితే దీని కోసమే విద్యా విధానమే మారాలి అన్న అంత సమంజసం కాదు. ఇక ప్రత్యేక దినాలపై జరిపిన చర్చ బాపతువి ఇప్పటికే అనేక ఛానల్స్‌లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చినవే కావడంతో ప్రత్యేకతేమీ తేలేక పోయింది. ఆధునిక పోకడలూ, జీవన భారాన్ని సదా మోయడం కారణంగా ప్రస్తుతం మగవాళ్లు ఎ.టి.ఎం. యంత్రాలై పోయారన్న అభిప్రాయం ఓక్కసారిగా మరిచిపోతున్న విలువల్ని గుర్తు చేసింది. అయితే న్యూ ఇయర్ డేకు గుర్తుగా అర్ధరాత్రి 12 గంటలకు చేసే సంబరానికి అర్థం ఏమిటి అంటూ ప్రశ్నించి అంతకు ముందు జరిగిన ఒక్క నిమిషానికి (11.59) తర్వాత వచ్చే పనె్నండు గంటలకు తేడా ఏమిటి అన్నది అంతగా అందరూ ఆమోదించరు. ఎందుకంటే ఓ ఉత్సవానికి సంకేతంగా అర్ధరాత్రి పన్నెండు దాటిన అనంతరం కొత్త తేదికి ప్రాతిపదిక కనుక ఆహ్వానం పలుకుతూ ఆనందిస్తారు. దానికీ భౌగోళిక మార్పులకీ సంబంధం పెట్టడం హాస్యాస్పదం. ఎంచుకున్న చర్చకు అనుగుణంగానే వివరణలూ, సలహాలూ, సందేహాలూ వుంటే ‘సంధికాలం’..లో స్పష్టత ఎక్కువగా ఉంటుంది.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment