Tuesday, January 11, 2011

ముగిసిన ‘బిగ్’ ప్రహసనం?!

గత ఏడాది వచ్చిన అన్ని రియాల్టీ షోలలో అందరి దృష్టిని ఆకర్షించినదీ, అనేకానేక వర్గాల విమర్శలు ఎదుర్కొన్న షో ఏదైనా ఉందంటే అది నిశ్చయంగా బిగ్ బాస్ - సీజన్ ఫోరే! (కలర్స్ ఛానల్‌లో ఈ ఏడాది జనవరి 8 వరకూ ప్రసారమైంది)
వివాదాలకు కారణం?
విభిన్న ప్రవృత్తులు, విభిన్న రంగాలకు చెందిన అపరిచిత వ్యక్తులు నిర్దేశించినన్ని రోజులు మరే విధమైన బాహ్య ప్రపంచ సంబంధాలు లేకుండా ఒకచోట ఉన్నప్పుడు వారి స్పందనలూ, వారి మధ్య జరిగే సంభాషణల అనంతరం వచ్చే మానవ సహజ భావోద్వేగాలూ, తదితరాలెలా ఉంటాయో వాస్తవ ధోరణిలో చూపడమే ‘బిగ్ బాస్’ ప్రధాన ఇతివృత్తం. ఎప్పుడైతే వాస్తవికతకు అరమరికలు లేకుండా పట్టం కట్టినపుడు కొన్నికొన్ని సందర్భాలలో హద్దు మీరిన మాటలు, అప్పుడప్పుడు అభ్యంతరకర సంగతులు తెరపై దర్శనమిస్తాయి. అవి తప్పకుండా కొందరి కనె్నర్రకు గురవుతాయి. పెద్దలు మాత్రమే వినదగ్గ అలాంటి మాటలు కుదరవు అని చెప్పి ‘బిగ్ బాస్’ కార్యక్రమం షూట్ చేస్తున్న ఇంటి ముందు రాజకీయ పార్టీలు ధర్నా చేశాయి. కోర్టు జోక్యంతో ప్రసారం చేసే సమయ వేళలూ మారాయి. అయితే ఇవేవీ ‘బిగ్ బాస్’ని వీలైనంత జన సమీపంగా తీర్చిదిద్దే చాకుల్లాంటి నిపుణుల బృందంలో ఉండే అవిశ్రాంత స్ఫూర్తికి విఘాతం కలిగించలేదు. అందుకే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ది గ్రేట్ సల్మాన్ భాయ్ దగ్గర్నించీ లైట్ బాయ్ వరకూ అందరూ అభినందనీయులే అంటారు కార్యక్రమ సమర్పకులు. ఇన్ని ఇలా ఉన్నా కార్యక్రమాన్ని అత్యధికులు ఎన్ని పనులున్నా ప్రసార సమయానికి పని గట్టుకు వచ్చి టీవీ ముందు కూర్చునేవారనడం అతిశయోక్తి కాదు. అనేక మంది స్వానుభవం. దీనికి కారణం సల్మాన్ ప్రభావంతో గెస్ట్‌లుగా వచ్చిన ప్రముఖుల సందడి. ఈ ప్రముఖుల పరంపరలో దేశీ సుందరి కత్రినా నుంచి.. హాలీవుడ్ దేవకన్య పమేలా ఆండర్సన్ వరకూ ఉండటం.
నో స్క్రిప్ట్..
ఏ కార్యక్రమానికైనా ఉద్దేశిత అంశాల ఆవిష్కరణకు స్క్రిప్ట్ తప్పనిసరి. అంటే ఎవరు ఏం మాట్లాడాలీ అన్నది.. కానీ 96 రోజుల షూటింగ్‌లో 50 కెమెరాల మధ్య పదమూడు మంది వ్యక్తులకు ఏ రకంగా స్క్రిప్ట్ సప్లై చేయగలం? అని కార్యక్రమ నిర్మాణంలో ముఖ్యుడొకరు అంటున్నారు. అయినా దీని ఉద్దేశమే వ్యక్తుల వాస్తవ మనోభావాల వెల్లడి కనుక ముందుగా రాసుకునే వాక్యాల ఊతం అనవసరం. కానీ ఓ లైన్ మాత్రం అంటే విధి విధానాల సూచిక మాత్రం ఉండి తీరాలి.
మధుర క్షణాలు
ఇక ‘బిగ్ బాస్’ ఆఖరి ఎపిసోడ్‌లో విన్నర్‌గా నిలిచిన శే్వతా తివారీ, ఆ సందర్భంలో గురైన మనోభావాలు మధురంగా ఉన్నాయి. గతంలోనే రియాల్టీ షోస్‌లో పాల్గొన్న అనుభవం ఆమెకున్నా విజేతగా నిలిచిన సమయంలో నోట మాట రాక ఆనంద భాష్పాలతో కూతుర్ని, తల్లినీ మదికి హత్తుకున్న తీరు ప్రేక్షకుల్ని రియల్ మూడ్‌లోకే తీసుకెళ్లింది. ఇక ప్రైజ్‌మనీ కోటి రూపాయలున్న బ్రీఫ్‌కేస్ శే్వత చేతికి అందజేస్తూ సల్మాన్‌ఖాన్ - ఈ ఆనందంలో నువ్వది మోయలేవు. పక్కనున్న మరో అభ్యర్థి ఖలీ (వృత్తిపరంగా డబ్ల్యుడబ్ల్యు ఫైటర్) కి ఇయ్యి’ అనడం, అది ఆయన తీసుకోవడం ప్రేక్షకుల్ని ఆనందంలో ముంచెత్తింది. ఏది ఏమైనా ఈ తరహా షోలు మానవ నైజాల బహిర్గతకు వేదికలనుకోవచ్చా?

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment