Tuesday, January 25, 2011

ముసుగు తీయించే ‘అంతర్ముఖం’?!

ప్రపంచ చరిత్రలో ఏ ఛానల్‌లోనూ ఇప్పటివరకు ప్రసారం కాని విధంగా తొలి సైకలాజికల్ గేమ్ షో అంటూ మాటీవీలో ఇన్నాళ్లూ ప్రోమోలతో ఆసక్తిని రేకెత్తించిన ‘అంతర్ముఖం’ జనవరి 2న మాటీవీ బుల్లితెరపై ఉదయం పది గంటలకు ప్రత్యక్షమయింది. తొలి ఎపిసోడ్ అంత కిక్ ఇవ్వకపోయినా షోను నిర్వహించేది యండమూరి వీరేంద్ర నాథ్ కావడంతో ప్రేక్షకుల్లో షో పట్ల ఏ మాత్రం నిరాశ కలగలేదు. ఈ షోకు జడ్జీలుగా వ్యవహరించడానికి మ్యాజిక్ మాంత్రికుడు పట్ట్భారామ్, సినీ నటి రోజా, ప్రముఖ ఎనలిస్ట్ మైత్రేయిలు తెరపైకి వచ్చారు.

తొలి ఎపిసోడ్‌లో తొలి పార్టిసిపెంట్‌గా ‘జోగిని’ శ్యామలకు అవకాశం రావడం షోపై ఇంట్రస్ట్ పెంచింది. ‘అంతర్ముఖం’ ఫార్మేట్ విషయానికొస్తే ప్రతి వారం ముగ్గురు పార్టిసిపెంట్స్‌కి అవకాశం కల్పిస్తారు. వారు నాలుగు రౌండ్స్‌లో పార్టిసిపేట్ చేసి జడ్జీల నుండి మార్కులు తీసుకుంటారు. ఫైనల్‌గా ఎవరైతే ఎక్కువ మార్కులు తీసుకుంటారో వారు ఎపిసోడ్ విజేతగా ఉంటే రెండవ స్థానంలో వుండేవారు సేఫ్ జోన్‌లో ఉంటారు. మూడవ స్థానంలో వున్న వారు మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇలా వచ్చిన కొంతమందిలో వారిలో వారికే పోటీని వివిధ టిపికల్ రౌండ్స్‌లో జరిపిన తరువాత ఫైనల్‌గా అంతర్ముఖం షో విజేతను ప్రకటిస్తారు.

అంతర్ముఖం షో గతంలో బాలీవుడ్ ఛానల్స్‌లో ప్రసారమైన ‘సబ్‌కా సామ్నా’కి ఛోటా కాపీలా వుందన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. అయితే ఆ రేంజ్ ప్రశ్నలు ఉంటాయా? అన్నది మరికొన్ని ఎపిసోడ్‌లు జరిగితేగాని చెప్పలేం. ప్రతి ఎపిసోడ్‌కి వచ్చే పార్టిసిపెంట్స్ వారు ఎంపిక చేసుకున్న కుటుంబ సభ్యులను స్నేహితులనో షోకి హెల్పర్స్‌గా తెచ్చుకోవచ్చు. అంతేకాక షోలో పార్టిసిపెంట్ చెప్పిన సమాధానాలపై కూడా వారు వ్యాఖ్యానించాల్సి ఉంటుంది. నాలుగు రౌండ్స్‌గా జరిగే ఈ షోలో ‘నాలో నేను’ అనే రౌండ్‌లో ప్రతి ఒక్కరూ అద్దం ముందు నిలబడి తనలోని మనిషి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇది కొత్తగా అనిపించింది. ఇక ‘నువ్వా నేనా?’ అనే రౌండ్ ప్రోమోలకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక సమస్యపై ముగ్గురు పార్టిసిపెంట్స్ మధ్య వాదోపవాదాలు మోస్తరు స్థాయి నుండి తీవ్ర స్థాయి వరకు జరిగే అవకాశం ఉంది. ఎంత తీవ్ర స్థాయిలో జరిగితే షోకి అంత మంచిదన్న సత్యం సగటు ప్రేక్షకుడికి తెలిసిందే!

తొలి ఎపిసోడ్‌లో యండమూరి కొన్ని విశ్లేషణలతో నేను ఏకీభవించని బింకం ప్రదర్శించడం రోజా నా పక్షం అని వ్యాఖ్యానించడం ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. యండమూరి షో నిర్వహించడంలో నారద మునిగా జడ్జీల చేత సరదాగా వ్యాఖ్యానించబడ్డారు. జడ్జీలు కూడా పార్టిసిపెంట్ వ్యాఖ్యానాలను పూర్తిగా విని దానిపై తమదైన శైలిలో స్పందించి మార్కులు వేయడం గమనార్హం. రోజా పాలిటిక్స్‌లో పాత్ర పోషించిందన్న విషయాన్ని తాత్కాలికంగా మరిచిన యండమూరి రాజకీయ నాయకుల్లా వాదించకండని వ్యాఖ్యానించి నాలిక్కరచుకోవడం జరిగింది.

అన్నపూర్ణా స్టూడియోలోనూ, విజయవాడలోనూ సెలక్షన్స్ జరుపుకున్న అంతర్ముఖం ఆదివారం మాత్రమే ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రసారం కావడం అనేది ఎక్కువగా జాబ్ హోల్డర్స్‌ని బిజీ పీపుల్స్‌ని ఆకర్షించడానికేనన్నది అర్థవౌతుంది. షోను నిర్వహించే యండమూరి తన నవలా ప్రక్రియ ద్వారా పర్సనాలిటీ ప్రోగ్రాంల ద్వారా, రచనల ద్వారా కోట్లాది ప్రేక్షకులకు సుపరిచితులు కావడంతో ఈ షో వీక్షకుల శాతం ఎక్కువగా ఉండటంతో రేటింగ్‌లో ముందుంటున్నదనేది వాస్తవం. బుల్లితెరపైకి వచ్చే ఏ నూతన గేమ్ షో అయినా మొదట్లో సాధారణ ప్రేక్షకునితో మొదలై తరువాత సెలబ్రిటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కొనసాగుతాయి. ఆ తరహాలో ఈ షో కూడా పోతుందన్న నిజం వీక్షకులకు తెలిసిందే. అలా కాకుండా కొనసాగితే అది అద్భుతమనే చెప్పాలి.

ఇక షో విషయానికొస్తే పార్టిసిపెంట్‌ని అడిగే ప్రశ్న నీకు ఇలా జరిగితే? నువ్వే ఆ స్థానంలో ఉంటే? నిన్ను సలహా అడిగితే? అనే విధంగా ప్రశ్నలు వేయడం వలన మనసులో కచ్చితమైన నిజం ఎంతవరకు బయటకు వస్తుందనేది చెప్పలేం. కాని అంతర్ముఖం అంటేనే ముసుగు తీసి మాట్లాడటం. నిజంగా పార్టిసిపెంట్స్ ముసుగు తీసి మాట్లాడినా యండమూరి మరియు జడ్జీల వితండ వాదం వారిని తికమక పెట్టడానికి అవకాశం ఉంది. అయితే జీవితంలో ముసుగు లేకుండా మనిషి జీవించగలగడం సాధ్యమా? అనేది అంతర్ముఖం తేల్చనుందా? అనేది ప్రశ్న. ఒకప్పుడు నవలా రచయితగా నూతన వొరవడితో ఉత్సుకతను రేపి ప్రస్తుతం పర్సనాలిటీ పాఠాలు రాస్తూ నేడు అదే తరహా గేమ్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న యండమూరి బుల్లితెరపై ఎన్ని సంచలనాలకు తెర లేపనున్నారో చూడాలి. ఆయన రచనా ప్రక్రియలో అద్భుత ఆవిష్కరణగా చెప్పుకునే ‘అంతర్ముఖం’ నవల పేరే గేమ్ షోకి పెట్టడం విశేషం.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment