Tuesday, January 4, 2011

600 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ‘అభిషేకం’

సౌభాగ్య మీడియా పతాకంపై దాసరి నారాయణరావు నిర్మిస్తున్న ‘అభిషేకం’ (ఈటీవీ) డైలీ సీరియల్ ఇటీవల 600 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ - టీవీ అంటే చాలా మందికి చిన్నచూపు ఉంది. సినిమాలు రాకపోతే టీవీ సీరియల్స్‌లోకి వెళ్లాలని నటీనటులు అనుకుంటారు. ఆ అభిప్రాయం తప్పు. ప్రపంచ వినోద చరిత్రలో ఉన్నత స్థానం టీవీదే. టీవీలో కనిపించే ఆర్టిస్టులను జనం ఎక్కువగా గుర్తు పడతారు. తెలుగు వారిలో చిన్నతెరకు ముందుగా వచ్చింది నేనే. 1988లో ‘విశ్వామిత్ర’ సీరియల్ చేశాను. మొట్టమొదటిసారిగా బీటాకామ్ వాడాం. తర్వాతి కాలంలో నేను బిజీగా ఉండటంతో చేయలేక పోయాను. నా సతీమణి పద్మకు సీరియల్స్ అంటే చాలా ఇష్టం. సీరియల్ అనేది చిన్న విషయం కాదు. ప్రారంభించటం మన చేతుల్లో ఉంటుంది. ముగింపు మన చేతుల్లో ఉండదు. ఈ సీరియల్ ప్రారంభమై మూడు సంవత్సరాలయింది. డబ్బుల కోసం కాకుండా మంచి సీరియల్ తీయాలన్న ఉద్దేశంతో ఈ సీరియల్‌ని చేయటం జరిగింది. ఇదే కాకుండా ‘తూర్పు - పడమర’ ‘శివరంజని’ సీరియల్స్ నిర్మిస్తున్నాను. వీటివల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. ఈ సీరియల్‌కు ‘ప్రేమాభిషేకం’ సిల్వర్ జూబ్లీ చేసినట్టు 1000 ఎపిసోడ్లు పూర్తయిన తర్వాత పెద్దఎత్తున ఫంక్షన్ చేస్తాను. నా శిష్యుడు కొమ్మనాపల్లి గణపతిరావు ప్రతిభావంతుడు. ఈ సీరియల్ విజయం దీనికి పనిచేస్తున్న యూనిట్‌దేనంటూ వివరించారు.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment