నేను నిర్మాతగానే హ్యాపీ!
- హేమమాలిని -
ఒకప్పటి డ్రీమ్‌గర్ల్ హేమమాలిని తన బహుముఖ ప్రజ్ఞా ప్రాభవంతో ‘డ్రీమ్ ఉమెన్’గానూ పరిధి మేరకు సృజనాత్మక రంగంలో తన మార్కు చూపిస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే హేమమాలిని నిర్మాతగా ఉన్న ‘మాటీ కీ బనో’ ధారావాహిక సీరియల్ కలర్స్ టీవీలో రానున్నది. ఆ సందర్భంగా హేమమాలిని తన అనుభూతులూ, అభిప్రాయాలనూ తెలిపింది.
అప్పటికీ - ఇప్పటికీ ఎంతో తేడా..
నేను దాదాపు దశాబ్దం క్రితం ‘నూపుర్’ని టీవీ కోసం నిర్మించాను. భారతీయ సంస్కృతి, నృత్యం, సంగీతాల విశిష్టతల్ని చాటి చెప్పడానికి ఉద్దేశించిన ధారావాహిక అది. తర్వాత ప్రముఖంగా టీవీ ఫీల్డ్‌లో నిర్మాతగా వచ్చినదిదే. అప్పట్లో ఛానల్స్ ఇన్ని లేవు. పోటీ లేదు. ఇప్పుడంతా ఇరవై నాలుగ్గంటల ప్రసారాల మయం. దాంతో దీనికి ప్రజాదరణ ఉంటుందో అదే ప్రసార యోగ్యత దక్కించుకుంటుంది. టిఆర్‌పి లే అన్నీ నిర్దేశిస్తాయి.
నిర్మాతగానే హ్యాపీ
అవును. కేవలం మాటీకీ..కు నేను నిర్మాతగానే ఉన్నా. అదే నాకు హ్యాపీ. ఎందుకంటే నాకు ఏ శాఖను ఆ శాఖను ఓ యజ్ఞంగా ఫలితాలకై పరిశ్రమించే మంచి టీమ్ దొరికింది.
గ్రామీణ ఇతివృత్తం...
‘నేనెందుకో టీవీలో వస్తున్న అత్యంత ఆధునిక పోకడల ఇతివృత్తాల పట్ల ఆసక్తి చూపలేక పోతున్నాను. అదే పరిస్థితి ప్రేక్షకులకీ వచ్చిందని చాలామంది అంటున్నారు. ఏది ఏమైనా ఓ వైవిధ్యత కోసం, ముఖ్యంగా భారతదేశం మూలాలు గ్రామాలే కనుక, అలాంటి రూరల్ ఆధారిత స్క్రిప్ట్‌కే తీసుకున్నా. మాటీకీ... లో కథ తన మూలాల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే తత్వం గల అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.
నేనూ చెప్తా...
ఛానలూ చెప్తుంది..
నేను నిర్మాతగా దర్శకుడు, కథకుడు పనుల్లో ఏమీ కలిగించుకోను. అయితే చెప్పిన కథలో ఏదైనా ముఖ్యమైన పాయింట్ మిస్సయిందని భావిస్తే సూచిస్తాను అంతే. అలాగే ఫలానా పాత్రకు ఫలానా వాళ్లే వుండాలని పట్టుబట్టను. కానీ డిజైన్ చేసిన రోల్‌కి వీళ్లయితే బావుంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాను. అలాగే ఛానల్ వారూ ట్రెండ్‌ను బట్టి, వారికున్న అనుభవాన్ని బట్టి సూచనలు చేస్తూంటారు. అయినా మేము ఎంచుకున్న కథకు కొత్తవారే సరైన న్యాయం చేకూర్చగలరని మా అందరి అభిప్రాయం అంటూ ముగించింది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment