పనిగట్టుకుని థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తేనే వినోదం అనే భావన క్రమక్రమంగా తగ్గిపోతోంది. అందుకే భారీ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్నాయి. వందల థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌గా మారుతున్నాయి. మరి వినోదం సంగతి..! అదిప్పుడు బుల్లితెర వంతు. చేతిలో రిమోట్ ఉంటే, ప్రపంచంలో ఏ జరుగుతుందో తెలుసుకోవచ్చు. వీలైతే విజ్ఞానమూ దక్కుతుంది. అలిసిపోతే అలరించే కార్యక్రమాలకూ తక్కువ ఉండదు. వెండితెర కన్నా వాడివేడిగా వడ్డింపులు బుల్లితెరపై వీనుల విందు నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల వద్దకే కాన్సెప్ట్ అనేది బాలీవుడ్ స్టార్స్ బాగా అర్థం చేసుకున్నారు. దాని ఫలితమే పలు రియాల్టీ షోలు. వీటి మహిమేంటో హిందీ తారలు ముందుగానే పసిగట్టారు. 'కౌన్ బనేగా కరోడ్‌పతి' అంటూ అమితాబ్ బచ్చన్ చేసిన షో జాతీయస్థాయిలో సంచలనం సృష్టించింది. టీవీ కార్యక్రమాన్ని నడపటంలోనూ నవ్యతను బిగ్ బి చూపారు. ఇప్పుడు ఆయన బాటలో పలువురు తారలు నడుస్తున్నారు. దీంతో టీవీ ఛానళ్ల టిఆర్‌పి రేటింగ్స్ అమాంతంగా పెరిగిపోయాయి. ఇక్కడా వీరు పోటీపడుతున్నారు.

షారూక్ 'జోర్ కా జట్కా'
ఓ పక్క సినిమాల్లోనూ, మరోపక్క ప్రకటనల్లోనూ రెండు చేతులా సంపాదిస్తున్న బాలీవుడ్ తారలకు బుల్లితెర రియాల్టీ షో కాసులు కురిపిస్తున్నాయి. అందరి కళ్లు వీటి మీదే పడ్డాయి. కింగ్ ఖాన్ షారూక్ 'జోర్ కా జట్కా' అనే షో చేయడానికి అంగీకారం తెలిపాడు. అంతర్జాతీయంగా వస్తున్న 'వైప్ అవుట్' షోకి ఇది అనుకరణ. మరో ప్రముఖ ఛానల్‌వారు 'రతన్ కా రిస్తా' అనే షో చేయమని కూడా అడిగారట. అమ్మాయిల డ్రీమ్ హీరో హృతిక్‌రోషన్ 'డ్యాన్స్ ఒలింపిక్స్', అందాల భామ మల్లికా శెరావత్ 'చక్ ధూమ్ ధూమ్ టీమ్ ఛాలెంజ్' షోలు చేయడానికి గ్రీన్ సిగల్ ఇచ్చేశారు. చేతిలో సరైన సినిమాలు లేని మల్లిక బుల్లితెర అయినా కలిసొస్తుందని ఆశతో ఉంది. స్వయంవరం పేరుతో రాఖీసావంత్ చేసిన రియాల్టీషో వివాదమూ, వినోదమూ రేపింది. ప్రీతీ జింటా 'గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్', లారాదత్తా 'అబ్ ఇండియా తోడేగా' షోలు చేయడానికి అంగీకారం తెలుపడానికి ఆసక్తి చూపుతున్నారు !
వినూత్నంగా ప్రేక్షకుల్ని ఆకర్షించే రియాల్టీ షోలు చేయడానికి బాలీవుడ్ తారల మధ్య గట్టీ పోటీ ఏర్పడింది. పోటీ కొన్ని హద్దులుదాటం వల్ల చిక్కులు కూడా ఏర్పడుతున్నాయి. సరదాగా వినోదాన్ని అందించాల్సిన షోలు శ్రుతిమించుతున్నాయి. హద్దులు దాటితే ఏదైనా ప్రమాదమే కదా!
Source: www.prajasakti.com
No comments:
Post a Comment