ఛానెళ్ల తీరు మారదా?
నిరుత్సాహపరచిన నూతన సంవత్సర కార్యక్రమాలు
ప్రాథమికంగా ఆంగ్ల సంవత్సరాది మన సంప్రదాయానికి అనుగుణం కాకపోయినా ఏటా అంతకంతకు పెరిగిపోతున్న న్యూఇయర్ క్రేజ్‌ని వీలైనంతగా చిన్న తెర ఆవిష్కరించటంలో ఎప్పటిలాగే ఈ ఏడాది దాదాపు అన్ని ఛానల్సూ పోటీ పడ్డాయి. అయితే వాటిలో ఏవీ పెద్దగా చెప్పుకోతగ్గవి లేకపోవడమే బాధాకరం.
అన్నిటా అదే తంతు..
అంతకుముందు రోజుల్లో ఈ ఏడాదిలో జరిగిన ముఖ్య సంఘటనల్ని ‘మెరుపులూ - మరకలూ’ క్రికెట్ మూమెంట్స్ అంటూ పలు రంగాల్లోని విశేషాలను ఓ మాదిరిగా ఛానల్స్ చూపినా, సరిగ్గా కొత్త సంవత్సరం ముందు రోజున (డిసెంబర్ 31) చూపిన కార్యక్రమాలు మాత్రం ఒకే రీతిలో సాగాయి. అలా అంటే దీనికి ఛానల్స్ ఇచ్చే సంజాయిషీ - ఆనాడు ప్రధానంగా అన్ని నగరాల్లోనూ ‘నయా సాల్ కా జోష్’ పేరిట జరిగే గానా బజానాల ప్రత్యక్ష ప్రసారాల సమాహారమే ఇది కనుక తప్పనిసరి అంటారు. అలాగే అన్ని ఛానల్స్‌లోనూ అవే సాక్షాత్కరించాయి. ఉదాహరణకు హైదరాబాద్ నగరమే తీసుకుంటే ఇక్కడ ప్రధాన ప్రాంతాలు (హైటెక్స్, జూబ్లీహిల్స్ క్లబ్, కంట్రీ క్లబ్, గండిపేట, రామోజీ ఫిలిం సిటీ వగైరా)లో జరిగే పార్టీ వేడుకగానే కన్పించాయి. అలాగే గుంటూరు, విజయవాడ, విశాఖ కన్పించాయి. ఎక్కడైనా ఈ కార్యక్రమాల ఆధార సూత్రం (మితిమీరిన ఉత్సాహంతో సాధ్యమైనంత వేగంగా కన్పడే జర్కుల డాన్సులు) ఒక్కటే కనుక వాటిలో ఉండే పాటలూ ఒక్కటే. అలాంటి దానికో ఉదాహరణ.. ఇటీవల అందరి నోళ్లలోనూ, ముఖ్యంగా యువతరం నోట తరచుగా విన్పడుతున్న పాట ‘షీలా కీ జవానీ...’ (తీస్ మార్ ఖాన్ చిత్రంలోనిది) ప్రతి ప్రోగ్రాంలో కన్పించింది. ఒకవేళ అక్కడ అది ప్రదర్శితమైనా, ఆ పాటను అదే పనిగా కనీసం నిడివి తగ్గించే ప్రయత్నం కూడా చేయకుండా ఛానల్స్ ప్రసారం చేయడం, వస్తున్న కార్యక్రమాలపై నియంత్రణా లేమిని సూచిస్తోంది. ఇంకా విచారకరమేమిటంటే - వార్తలు వంటి సీరియస్ ప్రోగ్రామ్స్‌లోనూ సింహభాగపు సమయాన్ని ఈ పార్టీల ప్రమోదానికే అంకితం చేయడం.
పోకడ వేరైనా ఆకర్షణ శూన్యం..
ఇక కొన్నికొన్ని అనివార్య చట్రాల మద్య నలిగే దూరదర్శన్ - సప్తగిరిపై పెడసరపు పోకడలకు ఊతమివ్వకపోవడం శుభసూచకం. కానీ అది అవలంబించిన రీతిలో ప్రసారం చేసిన కామెడీ స్కిట్స్ (డిసెంబర్ 31 రాత్రి చూపినవి) లో ఏదీ ఆకట్టుకోలేదు. కారణం - కాలం చెల్లిన కామెడీ స్టఫ్ఫే ఈ స్కిట్స్‌కి మూలం. ఈ మాదిరి దానికి ఉదాహరణ - జనవరి 1న సప్తగిరిలో ఉదయంపూట ప్రేక్షకులు కోరిన వారికి అభినందనలు అందించే కార్యక్రమంలో ఉన్న యాంకరమ్మల ద్వయంలో ఒకరు ఓ జోక్‌ని ఇలా చెప్పారు. ‘ఒక పిసినారి భర్త హానీమూన్‌కి తనతోపాటు భార్యకీ టిక్కెట్టు కొంటే డబ్బు దండుగ అని తన కొక్కడికే టిక్కెట్టు కొనుక్కుని వెళ్లిపోయాడట...’ ఇది ఎంతటి పురాతన హాస్య గుళికో ఆలోచించండి.
యాంకర్స్ భాషా జ్ఞానం..
ఇక ఈ మధ్య విడుదలైన చిత్రాలను పదేపదే పొగడుతూ దీనికి న్యూఇయర్‌ని కనెక్ట్ చేస్తూ ప్రసారం చేసే కార్యక్రమాల సంగతిని మనం ప్రస్తావించలేం. ఎందుకంటే వాటిని ఎలా వుంటే బావుండాలని సూచించినా, అక్కడ వుండే వాణిజ్య కోణాలూ, ఆశ్రీత ఆప్యాయతలూ అందుకు అడ్డు వస్తాయి. వాటి నొదిలేస్తే కొత్త సంవత్సరం సందర్భంగా మహాటీవీ ‘ఫస్ట్ విష్’ అంటూ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పాపం... అందులో పాల్గొన్న పురుష, స్త్రీ యాంకర్లద్దరికీ కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా మలచాలన్న తపన ఉన్నా, దానికి తగిన కృషి చేయకపోవడం వల్ల ఏ రకంగానూ అవి ఆకర్షించలేక పోయాయి. యాంకర్స్ కు ముఖ్యంగా మాట్లాడే భాషపై మంచి పట్టు ఉండాలి. ఒకే పదానికి చెందిన ప్రత్యామ్నాయ పదాలు ఎన్ని ఎక్కువ తెలిస్తే అంతగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఎంతగా ఈ టైప్ కార్యక్రమాలను ఎంతటి ఉద్దండులు సమర్పించినా అందులో ప్రస్తావించే సంగతులు పరిమిత పరిధికి లోబడే ఉంటాయి. అలాంటి సందర్భంలో వ్యాఖ్యాతల్ని ఆదుకునేవి ప్రత్యామ్నాయ పద సమూహాలే!
సో.. గతాన్ని తలచి అదే పనిగా బాధ పడేకన్నా, భవిష్యత్తులో మంచికై ప్రయత్నిద్దాం. కనీసం 2011 చివరలో చూసే కార్యాక్రమాల్లోనైనా ఈ పోకడా.. పోరు తీరు మారుతుందని అనుకుందాం.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment