Thursday, January 27, 2011

రామోజీ రావు వర్సెస్ వైయస్ జగన్

ఈనాడు దినపత్రిక రామోజీరావు, సాక్షి మీడియా అధిపతి వైయస్ జగన్ మధ్య మరోసారి వార్ చోటు చేసుకుంది. సాక్షి మీడియాలో పెట్టుబడులపై రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు దినపత్రికలో పతాక శీర్షిక కింద వార్తాకథనం ప్రసారమైంది. మొదటి పేజీ, రెండో పేజీ మొత్తం అదే వార్తాకథనంతో నిండిపోయాయి. సాక్షి మీడియాకు కోట్లాది రూపాయల పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయంపై, అందులో ఎవరెవరు పట్టుబడులు పెట్టారనే విషయంపై పూర్తి వివరాలతో ఆ కథనం ప్రచురితమైంది. దీంతో జగన్ వర్గం ఎదురు దాడికి దిగింది. సాక్షి టీవీ చానెల్‌లో జగన్ వర్గానికి చెందిన నాయకులు రామోజీరావుపై దుమ్మెత్తి పోస్తున్నారు. సినీ నటి రోజా రామోజీ రావును తప్పు పట్టారు. వార్తాకథనాన్ని ప్రచురించడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పాపం - అవినీతి కూపం సాక్షి అంటూ ఆ వార్తాకథనం ప్రచురితమైంది. జగన్ సాక్షి మీడియాలో పెట్టింది 8 లక్షల రూపాయలు మాత్రమేనని, ఇతరుల నుంచి కొట్టింది 1246 కోట్ల రూపాయలని ఈనాడు దినపత్రిక ఆరోపించింది.

ఈనాడు వార్తాకథనం లీడ్ ఇలా సాగింది - సాక్షిని నడిపేది 'జగతి పబ్లికేషన్స్‌' సంస్థ. దీనికి ప్రారంభ పెట్టుబడి రూ.73.56 కోట్లు. ఆ మొత్తం జగన్‌ ప్రమోటర్‌గా ఉన్న 'కార్మెల్‌ ఏషియా' అనే కంపెనీ నుంచి వచ్చింది. కార్మెల్‌ ఏషియాలో జగన్‌ వ్యక్తిగత పెట్టుబడి అక్షరాలా రూ.8 లక్షలు! జగన్‌కే చెందిన మరో కంపెనీ సండూర్‌ పవర్‌ మరో రూ.12 కోట్లు సమకూర్చింది. ఈ రూ.12 కోట్ల 8 లక్షలూ పోను... మిగతాదంతా కూడా... వైఎస్‌ ప్రభుత్వం ద్వారా భారీ ప్రయోజనాలు దక్కించుకున్న మ్యాటిక్స్‌ ప్రసాద్‌ సంస్థలు, పెన్నా ప్రతాపరెడ్డి సంస్థ, ఇండియా సిమెంట్స్‌, ల్యాంకో గ్రూప్‌కు చెందిన జూబ్లీ మీడియా సంస్థల వంటివి తెచ్చి పెట్టినవే. అయితే ఇంతటి మొత్తాలు తెచ్చినా 'జగతి'లో ఆ సంస్థల మొత్తం వాటా 30.69 శాతం. చాలా తక్కువగా పెట్టుబడి పెట్టిన జగన్‌ సంస్థల వాటా మాత్రం 69.31 శాతం! ఇక్కడే ఉంది అసలు కిటుకు.

"జగన్‌ దందాల యాత్రలో 'సాక్షి' ఒక పిసరు మాత్రమే. ప్రభుత్వం నుంచి ఆగమేఘాల మీద అనుమతులు, భారీ సున్నపురాయి నిక్షేపాలు, ఉద్దర పెట్టుబడులతో ఆరంభమైన 'భారతీ సిమెంట్స్‌' ఇప్పటికే వేల కోట్లు కురిపించింది. అటు ప్రభుత్వాధికారాన్నీ.. ఇటు కార్పొరేట్‌ చట్టాలనూ ఏకకాలంలో కాలరాస్తూ వై.ఎస్‌. తండ్రీతనయులు నిర్భీతిగా సాగించిన బడా దోపిడీ గురించి ఎవరెంతగా మొత్తుకున్నా.. ఇన్నేళ్లుగా పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఆ అక్రమ దందాల దూకుడుకు కళ్లెం వేసే సత్తా ఉన్నవారే కరవయ్యారు" అని ఈనాడు వ్యాఖ్యానించింది. ఆ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు, పెట్టుబడులు పెట్టిన సంస్థల వివరాలను ఈనాడు దినపత్రిక ఇచ్చింది.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment