Wednesday, February 9, 2011

మా టీవీ బోర్డు సభ్యుడిగారామ్‌చరణ్ తేజ


'మా' టీవీ మరో రెండు చానళ్లను ప్రారంభించింది. ఇప్పటికే మా, మా మ్యూజిక్‌తో అలరిస్తున్న 'మా' సంస్థ... కొత్తగా మా జూనియర్స్, మా సినిమా అనే చానళ్లను తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఈ రెండు చానళ్ల ప్రసారాలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. 'మా జూనియర్స్'ను ప్రఖ్యాత నిర్మాత డి.రామానాయుడు, 'మా మూవీస్' చానల్‌ను ఎవర్‌గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా 'మా' టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్, డైరెక్టర్లు రామకృష్ణ, అల్లు అరవింద్, అక్కినేని నాగార్జున, చలసాని రమేశ్ విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజను మా టీవీ బోర్డు సభ్యుల్లో ఒకరిగా చేర్చుకున్నట్లు ప్రకటించారు. "మేం అందరం కాస్త వయసు మళ్లిన వాళ్లమే. నేటి తరం టీవీ ప్రేక్షకులకు ఏ తరహా వినోదం కావాలన్న దానిపై మాకు మూస అభిప్రాయాలే ఉంటాయి. ఓ యంగ్ మైండ్ మా బోర్డ్ సభ్యుల్లో ఉంటే బాగుంటుందని ఎన్నాళ్లుగానో చెబుతున్నాను. అది ఈనాటికి కుదిరింది'' అని నాగార్జున తెలిపారు. "సరికొత్త ఆలోచనలు కలిగిన ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీలను మా బోర్డులో చేర్చుకోవడం ద్వారా బోర్డు సభ్యుల సగటు వయసు తగ్గుతుంది'' అని నిమ్మగడ్డ ప్రసాద్ చమత్కరించారు. "మా జూనియర్స్ ఓ చాలెంజింగ్ చానెల్. ఇందులో చిన్నారుల కోసమే కాకుండా నేటి యువతకు కూడా ఉపయోగపడే రీతిలో కార్యక్రమాలు ఉంటాయి'' అన్నారు. త్వరలో మరో రెండు రాష్ట్రాల్లో మా టీవీ ప్రారంభించే యోచనలో ఉన్నామని అల్లు అరవింద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment