Friday, June 3, 2011

తమిళనాడులో కేబుల్ వ్యవస్థ జాతీయం

తమిళనాడులో కొన్ని సంచలనాత్మక నిర్ణయాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. కేబుల్ టీవీ వ్యవస్థను జాతీయం చేయాలని అన్నా డి.ఎమ్.కె. ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడులో అరసు కేబుల్ వ్యవస్థ పేరుతో కేబుల్ పంపిణీ నడుస్తోంది. అయితే ఇదంతా డి.ఎమ్.కె.అదీనంలో ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నట్లుంది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని కేబుల్ వ్యవస్థను జాతీయం చేయాలని జయలలిత నిర్ణయం ఏ రకంగా అమలు సాధ్యమన్నది చూడాలి. ప్రభుత్వమే కేబుల్ వ్యవస్థను నిర్వహిస్తుందా? లేక ఆయా గ్రామాలలో, పట్టణాలలో, ప్యాకేజీలుగా చేసి వేలం పాటలు పెడుతుందా అన్నది చర్చనీయాంశం అవుతుంది.అంతేకాక, ఇప్పుడున్న కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి ఏమవుతుందన్నది కూడా, ఆపరేటర్లు ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరమైన పరిణామమే అవుతుంది.అంతేకాక మరికొన్ని నిర్ణయాలను కూడా జయలలిత ప్రభుత్వం తీసుకున్నది. కరుణానిధి ప్రభుత్వం ఆరంభించిన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని నిలిపివేయాలని జయలలిత నిర్ణయించారు. దీనివల్ల ఆశించిన ఫలితాలు రావడంలేదని ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు.కొత్త ఆరోగ్యశ్రీ పధకాన్ని ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. కాగా కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయ భవన నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణకు కమిషన్ ను కూడా వేశారు.ఈ భవనానికి పన్నెండు వందల కోట్ల రూపాయల వ్యయం అయింది. ఈ భవనంలోకి తాను రాబోనని జయలలిత భీష్మించుకుని పాత సచివాలయం బూజు దులిపి అక్కడికే వెళుతున్నారు.ఇప్పుడు ఏకంగా విచారణకు ఆదేశించారు. తమిళనాడులో రాజకీయాలు పరస్పర ద్వేషపూరితంగా సాగుతుంటాయి. అందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. కరుణానిధి ప్రభుత్వం రూపొందించిన మెట్రో రైల్వే స్కీమ్ బదులు మోనో రైల్వే లైన్ ను తీసుకువస్తామని ప్రకటించారు. ఇవన్ని గవర్నర్ ప్రసంగంలో జయలలిత ప్రభుత్వం ప్రటించింది. 

Source: kommineni.info

No comments:

Post a Comment