Tuesday, June 21, 2011

ఇదిగో నాయిక - అదిగో తాళి

తెలుగు చానల్స్ పరిస్థితి రోజు రోజుకు శృతిమించి పోతోంది. ఒక నాయకుడు ఇంటికి వెళితే మాట్లాడేందుకు బయటకు రాలేదట ఇంటి ముందు కెమెరాతో కాపు కాసి అదే టీవిలో లైవ్‌గా చూపించారు. మీరే చూడండి మేం ఇంటి ముందు ఎంత సేపటి నుంచి పడిగాపులు కాస్తున్నా ఆయన బయటకు రావడం లేదు అని కామెంట్స్‌తో చూపిస్తున్నారు. అంటే రాజకీయ నాయకులకు సొంత జీవితం ఉండకూడదా? వాళ్లకు ఇష్టం ఉన్నా లేకున్నా కెమెరాతో రాగానే బయటకు పరిగెత్తుకు రావాలా?
***

అందమైన హీరోయిన్... ఏదో ఇంటర్వ్యూలో మాటవరసకు తాను ప్రేమలో పడ్డానని, అతగాడెవరో చెబితే ఆశ్చర్యపోతారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారట! (నిజంగా ఆమె అలా చెప్పారా? లేదా అనేది కూడా అనుమానమే) ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ప్రస్తావించింది(ట). అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్నట్టు ఇంతకు మించిన మసాలా ఇంకేముంటుంది. దానికి అటు తమిళ మీడియా కథలల్లితే తెలుగు మీడియా చాలా తెలివిగా తమిళమీడియాలో వచ్చిన వార్తలు అంటూ మరింత మసాలా జోడించి వార్తలు ప్రసారం చేశాయి. తమిళంలో వార్తలు వస్తే, తమిళంలో ఇలా వార్తలు వచ్చాయి అంటూ ఎన్‌టీవి హీరోయిన్ అనుష్క, వర్థమాన హీరో నాగచైతన్యకు దగ్గరుండి పెళ్లి చేయించింది. వయసులో కూడా అనుష్క నాగచైతన్య కన్నా చాలా పెద్దగా కనిపిస్తారు. ఏదో హీరోల వంశం కాబట్టి నాగచైతన్య హీరోగా సినిమాలు చేసేస్తున్నారు కానీ మరీ పిల్లాడిలానే కనిపిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ అయిన అనుష్క, నాగచైతన్యలకు మీడియా పెళ్లి చేసేసింది. ఇద్దరూ తెలుగు నటులే. నాగచైతన్య తాత కూడా హీరో. తండ్రి హీరో. వారుండేది నగరం నడిబొడ్డునే. ఇక అనుష్క కర్నాటకకు చెందిన వారైనా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. వీరేమీ మరో గ్రహానికి చెందిన వాళ్లు కాదు. ఏదో తమిళ పత్రికలో ఏమో రాసేశారని ఎన్‌టీవి అదే పనిగా వీరి నిశ్చితార్థం వార్తను ప్రసారం చేసింది. పత్రికల్లో ఏదో మూలకు వచ్చే వార్త కన్నా టీవిలో కొన్ని పాటలు, అనుష్క, నాగ చైతన్యల క్లిప్పింగ్స్‌తో నిశ్చితార్థం వార్తను ప్రసారం చేస్తే పాపం వాళ్ల పరిస్థితి ఏం కావాలి. సినిమా వాళ్లు అంటే ప్రజల్లో వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండడం సహజమే కానీ అదే సమయంలో వాళ్లు కూడా మనుషులే. వాళ్లకు సంబంధించిన వార్తలు ప్రసారం చేసేప్పుడు నిర్ధారణ చేసుకోవడం మంచిది. గతంలో రకరకాల గాసిప్స్ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఏకంగా పెళ్లిళ్లు చేసేస్తున్నారు.
***

టిడిపి బహిష్కృత ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డిని ఏదో వివాదంలో లాక్కురావడానికి టీవి9 తెగ ప్రయత్నించింది. విషయం తెలిసిన ఆయన చానల్ పిలుపును తిరస్కరించి వెళ్లడానికి నిరాకరించారు. దాంతో ఆయన ఇంటి ముందు కెమెరాతో బైఠాయించి రమ్మన్నా బయటకు రావడం లేదు అని వార్తలు. ఇదేం దౌర్జన్యం. గతంలో ఇదే విధంగా బెదిరింపులకు దిగితే చీరాల ఎమ్మెల్యే చానల్స్ వారి దిమ్మతిరిగి పోయేట్టుగా ఎదురుదాడి మొదలు పెట్టారు. అసెంబ్లీ జరిగేప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అని అన్నిచానల్స్‌ను ఆయన పిలిచి ఒకటి రెండు చానల్స్‌వారి భాగోతాలను చెప్పడం మొదలు పెట్టారు. కొన్ని చానల్స్ లైవ్ కట్ చేసినా మిగిలిన చానల్స్ ప్రసారం చేశాయి. ఈ దెబ్బతో ఒక్కసారిగా చీరాల ఎమ్మెల్యేతో చానల్స్ రాయబారాలు నడిపాయి. రమ్మంటే రావడం లేదు అని చూపిస్తారు. వస్తే చానల్ చర్చలో నాయకులు అక్కడే బూతులు తిట్టుకుని కొట్టుకునే పరిస్థితి తీసుకు వస్తారు. ఇదేం జర్నలిజం.
 
గౌహతి రైల్వే స్టేషన్ రైలులో పేలుళ్లకు తీవ్రవాదులు చేసిన ప్రయత్నాలను పోలీసులు వమ్ము చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన తెలుగు చానల్స్‌కు తీవ్ర నిరాశ కలిగించి ఉంటుంది. ఎందుకంటే ఉదయమే టీవి 9 చానల్ చూసినప్పుడు వారిలోని నిరాశ బ్రేకింగ్ న్యూస్‌లోనే కనిపించింది. పాల క్యాన్లలో బాంబులు అమర్చారు. అవి చాలా శక్తివంతమైనవి. పేలి ఉంటే ప్రాణనష్టం తీవ్రంగానే ఉండేది. అన్ని చానల్స్‌లో గౌహతి రైల్వే స్టేషన్‌లో రైలులోనే బాంబుల పేల్చడానికి జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేశారని చూపించాయి. టీవి9 మాత్రం గౌహతి రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుళ్లు అని బ్రేకింగ్ న్యూస్‌గా చూపింది. బాంబులు పేల్చడానికి జరిగిన ప్రయత్నం విఫలం కావడం, బాంబులు పేలడం రెండూ ఒకటేనా? టీవి9 వాళ్లే చెప్పాలి. బాంబులు పేల్చారు అని బ్రేకింగ్ వార్తగా చూపితే ఎంత మంది మరణించారు, ఎలా జరిగింది అనే ఆసక్తితో ప్రేక్షకులు టీవికే అతుక్కుపోతారు. అదే విఫలయత్నం అనేసరికి పెద్దగా ఆసక్తి ఉండదని టీవి9 వాళ్లు భావించినట్టున్నారు. అందుకే తీవ్రవాదుల కన్నా ఒక అడుగు ముందుకేసి గౌహతిలో బాంబులను హైదరాబాద్ నుండే పేల్చేశారు. హడావుడిగా చూపేటప్పుడు భాషా దోషాలు సహజమే కానీ ఇది అలాంటి దోషంగా కనిపించడం లేదు. కావాలనే ఆసక్తి రేకెత్తించడానికి ఉద్దేశపూర్వకంగానే బాంబులు పేలినట్టుగా పదే పదే బ్రేకింగ్ న్యూస్ చూపించారు. ఒకటిన్నర దశాబ్దాల తరువాత కూడా తెలుగు చానల్స్ ఇంకా బాలారిష్టాలు దాటలేదంటే నమ్ముదామా? ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా!

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment