Friday, June 3, 2011

టివీ చానళ్లపై ఫిర్యాదులు సబబా

రాష్ట్ర చరిత్రలో మీడియాపై విమర్శలు తరచూ జరుగుతుండేవే. కాని ఇటీవలి కాలంలో వాటిని కూడా రాజకీయాలలో ఒక భాగంగా చూస్తున్నారు. ఆయా మీడియా సంస్థలు ఏదో ఒక రాజకీయపార్టీకి అనుకూలంగా ఉంటున్నాయన్న భావన అనేది కొత్త విషయం కాదు. 1950వ దశకంలో కూడా ఇలాంటి సమస్యలు ఉండేవి. అప్పట్లో విశాలాంధ్ర కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన పత్రిక. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మిగిలిన పత్రికలు ఆంధ్రపత్రిక, ప్రభ,జ్యోతి వంటివి పైకి పార్జీలవని చెప్పకపోయినా, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేవి. 1955 లో ఆంధ్ర రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఆంధ్రపత్రికలో ఒక వార్త వచ్చిందని చెబుతారు. సిపిఐ నాయకుడు మాకినేని బసవపున్నయ్య రైతుల భార్యలకు సంబందించి తీవ్రంగా మాట్లాడారని ఒక ప్రచారం జరిగిందట. దాంతో సిపిఐ మీద పెద్ద ప్రభావం పడిందని అంటారు. ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా 1982లో టిడిపి ఆవిర్బావం తర్వాత ఈనాడు పత్రిక అప్పట్లో ఎన్.టి.రామారావును సమర్ధించడం చారిత్రక అవసరంగా భావించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేసేవారు. అయినప్పటికీ ప్రజలు బాగా రిసీవ్ చేసుకోవడంతో అంత ఇబ్బంది ఎదురుకాలేదు. 2004 ఎన్నికలకు ముందు వార్త పత్రిక రాజశేఖరరెడ్డి పాదయాత్రకు అత్యంత ప్రాముఖ్యత నిచ్చి, కాంగ్రెస్ అనుకూల వైఖరి తీసుకుంది. ఆ తర్వాత ఆ పత్రికాధిపతి కాంగ్రెస్ నుంచి ఎమ్.పి కూడా అయ్యారు. 1995లో టిడిపి చీలినప్పుడు అప్పుడే కొత్తగా వచ్చిన ఈటివీ చంద్రబాబుకు అండగా నిలబడిందన్నది బహిరంగ రహస్యమే. అలాగే ఆంధ్రజ్యోతిపై లక్ష్మీపార్వతి ఓ బహిరంగ సభలోనే ధ్వజమెత్తి రామోజీరావును, ఆంధ్రజ్యోతిలో అప్పటికి రిపోర్టరుగా ఉన్నరాధాకృష్ణపై విమర్శలు చేశారు. తాజాగా ప్రస్తుత రాజకీయాలలో కొన్ని చానళ్లు వై.ఎస్.జగన్ అనుకూల వైఖరి తీసుకుంటే మరికొన్ని జగన్ వ్యతిరేక వైఖరిని తీసుకున్నాయి. తదగుణంగా వార్తా కధనాల ప్రసారం జరుగుతోంది. ఎక్కువ ఛానళ్లు ఏదో రకంగా ఏదో పక్షం వైపు ఉంటున్నాయన్న అబిప్రాయం ఉంది.

అయితే ఇది కొత్త రూపు దాల్చి ఎన్నికల ప్రచారంలో కూడా పత్రికలవారిని విమర్శించడం వరకు వెళ్లింది. అంతటితో ఆగకుండా ఆయా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా లేనవి భావించే మీడియాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వారు చేసే ప్రచారం అంతటిని పెయిడ్ న్యూస్ గా పరిగణించాలని డిమాండు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా జగన్ కు చెందిన సాక్షి మీడియాపై తరచు విరుచుకుపడుతుంటారు. వై.ఎస్.జగన్ తన ప్రచారంలో రామోజీరావు, రాధాకృష్ణ, రవిప్రకాష్ లు రాష్ట్రానికి పట్టిన శని అని ఆరోపించారు. ఇప్పటికే టిడిపి నేతలు నామా నాగేశ్వరరావు తదితరులు సాక్షిపై ఫిర్యాదు చేసి వచ్చారు. దానికి పోటీగా వైనెస్.ఆర్.కాంగ్రెస్ నేతలు మరికొన్నిటిపై ఫిర్యాదుచేశారు. తాజాగా ఎబిఎన్, టివీ 9లు తమకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ అభ్యర్ది డి.ఎల్.రవీంద్రరెడ్డికి అనుకూలంగా టివి 9, టిడిపి అభ్యర్ధి మైసూరారెడ్డికి అనుకూలంగా ఎబిఎన్ వ్యవహరిస్తున్నాయని,వాటిలో వచ్చే వార్తలను పెయిడ్ న్యూస్ గా పరిగణించాలని ఫిర్యాదు చేశారు. ఈ రకమైన ఫిర్యాదుల ధోరణి మాత్రం లేటెస్ట్ ట్రెండ్ గా భావించాలి. గతంలో ఏదో విమర్శలు చేసుకుని ఊరుకునేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ఫిర్యాదుల వల్ల పెద్దగా ఏమి ఒరగకపోవచ్చు. కాని ఒకరి క్రెడిబిలిటిని మరొకరు దెబ్బతీయడేమే ఈ ఫిర్యాదుల ఉద్దేశంగా కనబడుతుంది. ఇలా టీవీ ఛానళ్లపై ఫిర్యాదులు సబబా అంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరకనంత దూరానికి మనం వచ్చేశాం. కనుక ఇప్పుడు జరిగేదాన్ని చూసి ఒహో ఇలా జరిగిందన్నమాట అని సరిపెట్టుకోవడమే బెటర్ గా ఉంది.

Source: kommineni.info

No comments:

Post a Comment