టాలెంట్ హంట్స్, గేమ్ షో వగైరాలకు ఉన్న ఆదరణ దృష్ట్యా టీవీ అంటే వెంటనే గుర్తుకొచ్చే సీరియల్స్ వెనుక స్థానంలోకి వెళ్లిన మాట నిజమే. అయితే ధారావాహికలు లేకపోతే ఛానల్‌కు రెగ్యులర్ ప్రేక్షకుల కొరత ఏర్పడుతుందన్న మాటా వాస్తవమే. అందుకే టీవీ ఉనికికి ఊపిరరులైన సీరియల్స్‌పై అడపాదడపా దృష్టి పెట్టడం జరుగుతోంది. కానీ ఆ దృష్టి కేవలం యాంత్రికమైనదని, అంతకు మించి ప్రాధాన్యత ఏమీ ఇవ్వడం లేదని చూపరుల్లో కలుగుతోంది. అలాంటి అభిప్రాయానికి బలమైన ఉదాహరణ ‘మమతల కోవెల’ (జెమిని టీవీలో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు)
ఉద్దేశం ఉదాత్తమైనదే..
కారణాంతరాల వల్ల ఆగిపోయిన స్నేహితుడి చెల్లెలి వివాహం అభాసుపాలు కాకుండా ఆమెనే వెనుకా ముందు చూడకుండా ప్రేమ్ వివాహం చేసుకుంటాడు. అంతవరకూ ఆ అబ్బాయి మంచితనాన్ని మనం అందరం స్వాగతిస్తాం. కానీ తీరా ఆ అమ్మాయిని తన తల్లిదండ్రులకు వెంటనే భార్యగా పరిచయం చేయడానికున్న అభ్యంతరాలను ఆమెకు దారిలో వివరించి, అందుకు మధ్యే మార్గంగా నిన్ను నేను స్నేహితుడి చెల్లెలిగా, అర్జెంటుగా ఉద్యోగ విధుల నిమిత్తం నీ భర్త సింగపూర్ వెళ్లినట్లు పది రోజులు మా ఇంట్లో ఉంచిన తర్వాత అసలు సంగతి చెప్తానంటాడు. ఇది ఏ రకమైన ట్విస్టో అర్థం కాదు. అంతటి ఉదాత్త నాయకుడి వ్యక్తిత్వం ఈ మలుపు వల్ల మంట కలిసే ధోరణే కన్పడుతోంది తప్ప మంచి జరిగే సూచనలేవీ కనిపించడం లలేదు. ఎందుకంటే అతనికి అంతకు ముందే మేనరికం దాదాపు ఖాయమైంది. ‘మా తల్లిదండ్రుల్ని ఒప్పించగలననే నమ్మకం నాకుంది’ అని వివాహానికి ముందు చెప్పి ఈ విధంగా చేయడం అతని మాటకు అతనే విలువనివ్వని వైనానికి అద్దం పడుతుంది. ఇలాంటి వాటివల్ల కొత్త తిరకాసుల్ని సామాన్య జనానికి నేర్పినట్లు అవదా? అన్న ప్రమాదకర ఆలోచనా బయల్దేరుతుంది. సరే.. ఇవన్నీ ఇతమిత్థమైన భాగాలకు పరిమితమై పోయిన సీరియల్స్ కావు కనుక, ప్రజాదరణ అంశాలను అప్పటికప్పుడు రాబోయే భాగాల్లో జోడించే అవకాశం ఉంది కనుక ఆ ధోరణిలో మున్ముందు భాగాలు ఉంటాయేమో చూద్దాం.
వీరి గొంతుకలకు డబ్బింగా..
‘మమతల కోవెల’ కథా కథనాల సంగతి అలా ఉంచితే కొన్ని అత్యంత కీలకాంశాలకే ఎసరు పెట్టినట్లు అనిపించింది. అసలు జెమిని టీవీ సీరియల్స్ అంటేనే మిగతా సమకాలీన ఛానల్స్‌తో పోలిస్తే అనువాద ధారావాహికల జోరెక్కువ అన్న వాదన ఉంది. ఆ వాదనకు మరింత ఊతమిచ్చేలా ఈ సీరియల్‌లో అంశాలున్నాయి. ఇది స్ట్రెయిట్ సీరియల్లే అయినా తెలుగు వారికి బాగా పరిచయమైన ప్రదీప్, రమేష్ తదితరుల గొంతుకలకు ఎరువు గొంతుకలు వాడారు. ముఖ్యంగా ప్రదీప్ నోటి వెంట వస్తున్న వాయిస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎలాగంటే ఒకో శరీరాకృతికి తగిన గొంతు ఒకోలా ఉంటుంది. అందులోనూ ఆ స్వరం చిరపరిచితమైన తర్వాత దానికి బదులు మరో గళం ఆ నటుడి ద్వారా వినడం కర్ణ కఠోరంగా ఉంటుంది. ఇందులో అదే జరిగింది.
ఇవి అవసరమా?
ఇందాకా చెప్పుకున్నట్లు చిన్నతెర అటు జాతీయపరంగా చూసినా ఇటు ప్రాంతీయపరంగా పరికించినా టాక్ షోలు, గేమ్ షోలే రాజ్యమేలుతున్నాయి. వీటిలో ఉన్న మూలాంశమేదైనా ఓ ప్రముఖుడు, లేదా ప్రముఖులతో వారి బాపతు విషయాన్ని కూలంకషంగా చర్చించడం తదితరాలు జరుగుతున్నాయి. అయితే వీటిల్లో వారిని పరిచయం చేసే వారి టాలెంట్‌నూ ప్రదర్శించడానికి చేస్తున్న ప్రయత్నాలే అనవసర మనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో సెలబ్రిటీస్ అని పరిచయం చేసే వ్యక్తీ ప్రముఖుడే అవడంతో ఈ స్వంత.. ఘోష మరీ ఎక్కువగా ఉంటోంది. ‘సాక్షి’ టీవీలో శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 9.30కి వస్తున్న ‘లెజెండ్స్’ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటున్న కార్యక్రమమే. దానిని నిర్వహిస్తున్న వ్యాఖ్యాత్రీ, సంగీత పరంగా ఎన్నదగిన కృషి చేసినవారే. ఆ సంగతి కార్యక్రమ ఆవిష్కరణలో తెలుస్తూనే ఉంది. అయితే పాల్గొంటున్న ప్రముఖులు ఆమెతో ‘ఇంతసేపూ మా చేత ఇన్ని పాటలు పాడించావు. నువ్వు నా కోసం పాట పాడవా’ అని అడగడం, వెంటనే యాంకర్ పాటందుకోవడం తదితరాలు షోకు అంతగా వనె్న తేవు. ఈ విధంగా గాయని చిత్ర, గాయకుడు రామకృష్ణలతో ప్రసారం చేసిన ఎపిసోడ్స్‌లో జరిగింది. అలాగే ఈటీవీలో ప్రతి గురువారం రాత్రి వస్తున్న ‘ప్రేమతో మీ లక్ష్మి..’ వైవిధ్య రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వారితో ముఖాముఖి ఏర్పాటు చేయడం వరకూ బాగానే ఉంది. ఇంకా కొందరిని పరిచయం చేసేటపుడు ఇంకాస్త ముందస్తు కృషిని నిర్వాహకురాలు చేసుంటే కార్యక్రమం ఇంకా బాగా రాణించేది అన్న భావం సర్వత్రా ఉంది. ఆ లోపం జూన్ 16న ప్రసారమైన రాజకీయ నాయకుడు వెంకయ్య నాయుడు కార్యక్రమంలో కొట్టొచ్చినట్టు కన్పడింది. వాస్తవానికి ఆయనకి అనేక అంశాలపై అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం ఉన్నా, ఆనాటి సంభాషణ వాక్చాతుర్యం, జోకులు వంటి వాటిపైనే ఎక్కువ కేంద్రీకృతమైంది. అంతకన్నా ప్రాధాన్యతాంశాలపై ఫోకస్ చేసి ఉంటే బావుండేది. ఇందులో కూడా యాంకర్‌కు చెందిన అంశాలు ‘నేను మా నాన్ననే ఎంపిక చేసుకుంటా.. నాన్న చెప్పారు.. లాంటివి అసంగతమనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా భాష, ఉచ్ఛారణ పట్ల ఈ కార్యక్రమ సారధులు శ్రద్ధ వహించాలి.
‘వావ్’లోనూ ఆ తీరే..
ఇక నటుడు సాయికుమార్ నేతృత్వంలో ఈటీవీలో శుక్రవారం రాత్రి 9.30కి వస్తున్న ‘వావ్’లోనూ ఇందాక ప్రస్తావించుకున్న స్వోత్కర్ష.. లు కన్పడుతున్నాయి. సాయికుమార్ అనగానే జ్ఞాపకమొచ్చే ప్రామాణిక గళ నైపుణ్యం బాపతు మచ్చుతునకలు దాదాపు ప్రతి ఎపిసోడ్‌లోనూ దర్శనమిస్తున్నాయి. ప్రసార మాధ్యమాల విషయంలో కార్యక్రమానికై కేటాయించిన సమయం అత్యంత ప్రధానమైంది కనుక, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సెకనూ సద్వినియోగమయ్యేలా, ప్రేక్షక ప్రయోజనపూరితంగా తీర్చిదిద్దితే అందరూ అభినందిస్తారు.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment