Thursday, June 2, 2011

ప్రజా ప్రశ్న - మనసు విప్పి మాట్లాడుతున్నారా?

‘నదీనాం సాగరో గతిః..’ అంటారు. అంటే నదులన్నీ ఎంత ఉధృతిలో ఎలా ఎలా ప్రవహించినా చివరకు కలిసేది సముద్రంలోనేనని. అలాగే తమ సృజనాత్మక శక్తి పరిపరి విధాలుగా ప్రకటితమైనా అంతిమంగా టీవీ అనే మహా సాగర పురోభివృద్ధిలో తామూ పాలుపంచుకోకుండా కుదరడం లేదు. ఆ జాబితాలో తాజాగా చేరిన వారు ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. (భరద్వాజ నటుడు కూడా. తొంభై దశకాల్లో నరేష్ (సీరియల్) నాయకుడిగా వచ్చిన ఓ చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించారు) ‘ప్రజా ప్రశ్న’ (టీవీ 5 ఛానల్‌లో ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు వస్తున్నది) కార్యక్రమంలో వారానికో అతిథిని ఇంటర్వ్యూ చేసే పాత్ర కూడా పోషిస్తున్నారు. భరద్వాజ తన వ్యాపార విస్తృతిలో భాగంగా టీవీ కార్యక్రమాలు అందించే ప్రక్రియలో భాగస్వామ్యం వహిస్తున్న ఇప్పుడో కొత్త పాత్రలో వచ్చారు. ప్రాథమికంగా కళారూపాలతో వంశానుగతంగా కూడా సంబంధం ఉన్న భరద్వాజకు ఈ కొత్త పనేం పెద్ద కొత్త అన్పించదు. అయితే ఇప్పటికే పలువురిలా ప్రముఖుల్ని ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టే సందడి చేసేశారు కనుక ఇందులో కొత్తదనం ఏముంది? లేదా ఎలా చేస్తే ఇంకా వీక్షకాదరణ ఉంటుందన్న దాని గురించే ఇక్కడ ప్రస్తావన..

‘ప్రజాప్రశ్న’లో భాగంగా ఇటీవల గురు కొండవీటి జ్యోతిర్మయి (అన్నమాచార్య భావవ్యాప్తి కార్యక్రమంలో ప్రసిద్ధురాలు) సినీ నటి కమ్ ఎమ్మెల్యే జయసుధ, తదితరులతో మనసులోంచి సమాధానాలు చెప్పించారు. మనసు విప్పడం.. అనే మాట ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చిందంటే, ఈ మధ్య వచ్చే ఇంటర్వ్యూల్లో లేదా ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొనే సదరు వ్యక్తి మనసు విప్పి మాట్లాడుతున్నారా? అంటూ వీక్షకుల నుంచి అభిప్రాయ సేకరణ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సేకరించడం, చివర్లో అవును, కాదు శాతాలు చెప్పడమూ ఏదో ఒక రూపంలో జరుగుతోంది. వాటి విశ్వసనీయత పట్ల ఇప్పటికే పలు సందేహాలు అనేక మంది వ్యక్తం చేశారు కనుక ఆ సంగతి అనవసరం. అయితే అసలు ఒక మనిషి మరొక మనిషిని ఓ విషయం గురించి అడిగితే దానికి ప్రతిగా చెప్పే అంశంలో నూటికి నూరు పాళ్లూ నిజం ఉంటుందనే ఉద్దేశం. మరి అలాంటి వౌలిక అంశాన్ని లెక్కచేయకుండా తిరిగి ‘నిజమా’ ‘మనసు విప్పండి..’ కరెక్ట్‌గా చెప్పండి’ లాంటి పదాలు వాడటం అసలు ఇంటర్వ్యూల ప్రక్రియనే అపహాస్యం చేసినట్లు. ‘ప్రజా ప్రశ్న’లో ఇలా మనసులూ, గట్రా విప్పి చెప్పమన్న ప్రస్తావన నేరుగా లేకపోయినా, ఆ రకమైన నిఖార్సు నిజాలు కావాలన్న సన్నటి వత్తిడి అడిగిన ప్రశ్నల్లో కన్పడింది. జ్యోతిర్మయి ప్రోగ్రాంలోనే ఆమె నడుపుతున్న ట్రస్టు, కార్యక్రమాల నిర్వహణ, పారదర్శకత తదితరాల్ని భరద్వాజ గుచ్చిగుచ్చి అడిగారు. దానికి సమాధానంగా జరుగుతున్న తీరు గురించి చెప్పారు. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించాలన్నా, ఇతర రంగాల కార్యక్రమాల మాదిరిగానే ధనం కావాలి. దానికి ఆర్థిక సహకారమూ అవసరం. ఇక్కడి ఈ ట్రస్టు విషయంలో జ్యోతిర్మయి చెప్పిన ప్రకారం ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమ ఆదాయ వ్యయాలే ఉంటాయి అని చెప్పారు. ఇదో రకంగా విమర్శలకు స్థానమివ్వని విధానం. అన్నింటికన్నా ఇక్కడ చూసుకోవాల్సింది వేగ యుగంలో నిరంతరం ఎవరి స్వార్థం వారు చూసుకునే పరిమిత ప్రపంచంలో బతుకుతున్న వారికి, జీవితమంటే ఇదే కాదు’ అంటూ అనేకానేక అంశాలపై దృష్టి నిలిపేలా ఆధ్యాత్మిక భావప్రాప్తిని ఏ రకంగా ఈ తరహా సంస్థలు చేయగలుగుతున్నాయని ఆ కోణంలోంచి చూస్తే కొండవీటి కృషి ప్రశంసనీయమే.

ఇంపైన రాగాలు
జ్యోతిర్మయి జ్ఞప్తికి రాగానే ఆమె వినిపించే మధుర రాగాలు ఒక్కసారి కళ్ల ముందు కదలాడతాయి. అదీ భావసహితంగా, వేరేగా అర్థాన్ని వివరించాల్సిన పని లేకుండానూ ఉంటాయి. అలాంటి మధుర కీర్తనలెన్నో జ్యోతిర్మయి ఆలపించారు. వాటిలో ‘బ్రహ్మమొక్కటే..’ ‘నారాయణా నీ నామమే గతి..’ విశేషంగా అలరించాయి. అంతకన్నా మరీ సంతోషపెట్టింది అన్నమయ్యలోని సంస్కరణ తత్వం. రైతులకు కల్తీలేని ఎరువులు అందివ్వాలనే తపన ఆనాడే వ్యక్తపరిచిన విధానాన్ని జ్యోతిర్మయి బాగా చెప్పారు.

సబబైన సలహా!
భరద్వాజకే కాదు.. చాలామందికి అనిపించిన ప్రశ్న ఇందులో ఒకటి ప్రస్తావితమైంది. అందరి అభిప్రాయమూ, లక్ష్యమూ అన్నమాచార్య భావప్రాప్తి అయినా వేర్వేరు వ్యక్తులు వేర్వేరు విధాలుగా (శోభరాజు, జ్యోతిర్మయి మొదలైనవారు) కృషి చేసే బదులు అందరూ ఒకే గొడుగున పని చేయచ్చు కదా.. అని. దానికి కొండవీటి చెప్పిన సమాధానం అంతగా సంతృప్తి పరచలేక పోయింది. అయితే అలా చేయడం తప్పు కాదు, ‘చేయచ్చు’ అన్న స్థూల అభిప్రాయానికి రావడం శుభసూచకం.
 
Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment