జర్నలిజం కెరీర్లోకి ప్రవేశించాలనుకునే వారికి ఆ ఫీల్డులో వివిధ రకాల అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. సమాజంలో మార్పును ఆకాక్షించేవారికి, సమాజంలోని బలహీనతలను రూపు మాపాలనుకునేవారికి ఇది చక్కని మార్గం. ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలన్న ఆశతో ముందుకు సాగేవారికిదో సదవకాశం. జర్నలిస్టులు తమలోని సృజనాత్మకతను సమాజ సేవకోసం వినియోగించగలగాలి. సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కార మార్గం చూపగలగాలి. అలాంటి ఆశయం, లక్ష్యం ఉన్నవాళ్లకు ప్రింట్ మీడియా చక్కటి అవకాశాలు కల్పిస్తోంది. ప్రింట్ మీడియాకు సమాజంలో, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మెప్పించడంలో, పాఠకులను ఆకట్టుకోవడంలో, నమ్మకాన్ని కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో ప్రతి ఏడాదీ సుమారు 4,000 వార్తా పత్రికలూ, వార పత్రికలూ కొత్తగా రిజస్టరవుతున్నాయి. అవి పురోగమిస్తున్న కొద్దీ వాటిలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. చాలా మంది ఉద్యోగార్థులూ, యువతీ యుకులూ పత్రికారంగంపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దిన పత్రికలూ, వార పత్రికలూ, పక్ష పత్రికలూ, మాస పత్రికలూ అని వీటిలోనూ వివిధ రకాలుంటాయి. దిన పత్రికలకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిలో విలేకర్లుగా, ఫొటో గ్రాఫర్లుగా, సంపాదకులుగా, ఉపసంపాదకులుగా, ఫీచర్స్, బిజినెస్, క్రీడలు లాంటి ప్రత్యేక విభాగాల్లో సంపాదకులుగా, లైబ్రేరియన్లుగా, ఇతర విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
Source: www.porutelangana.com
No comments:
Post a Comment