Tuesday, June 21, 2011

వ్యక్తిగత జీవితాలకు దర్పణం ‘లక్ష్మీ టాక్ షో’

భారీ సెట్టింగ్‌లతో.. భారీ ఇన్వెస్టిగేషన్‌తో - మాటల తూటాల్ని ప్రయోగిస్తూ సాగుతోంది ‘లక్ష్మీ టాక్ షో’. అన్ని ఇంటర్వ్యూల్లానే ఇందులో అక్కడక్కడ పటాటోపం కనిపిస్తున్నప్పటికీ - అతిథుల మనోభావాలకు దర్పణం పడుతోంది కూడా. ఎప్పుడూ నవ్వుతూ కనిపించని చంద్రబాబు నాయుడు నవ్వనూ వచ్చు. కీరవాణి భావావేశాన్నీ, తనలోని త్రీ డైమన్షనల్ ఎమోషన్స్‌నీ చూడొచ్చు.

ఆయా వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో ప్రేక్షకులకు తెలీని ఎన్నో అంశాలు ఇందులో చోటు చేసుకుంటూ మరో కోణాన్ని చూపుతోందీ ‘టాక్ షో’.

ఇదే మన తక్షణ కర్తవ్యం
ఒకప్పుడు సగటు ప్రేక్షకుల మనసుల్ని రంజింపజేయటానికి వెండితెరపై ‘సెపరేట్’ విభాగం ఉండేది. ఏ క్లబ్ డాన్స్‌ల రూపేణానో.. కథలో మధ్యమధ్య వచ్చిపోయే శృంగార కామెడీ సీన్లలోనో ‘ఎక్స్‌పోజింగ్’ ప్రస్తావన వస్తూండేది. ఆ యుగం గడిచి - ఇప్పుడు హీరోయినే్ల హొయల్ని వొలకబోయటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూంటే - ప్రస్తుతం ఆ ట్రెండ్ మారి హీరోలు సైతం మేం మాత్రం తక్కువ తిన్నామా? అంటూ - ఎక్స్‌పోజింగ్‌కి సిద్ధం. రణబీర్ కపూర్ ‘సావరియా’ చిత్రంలో.. జాన్ అబ్రహాం ‘దోస్తానా’లోనూ చిన్నపాటి టవల్‌తో యూత్‌ని ఆకట్టుకుంటే ఆ ‘సంస్కృతి’ ఛానళ్ల క్కూడా పాకింది. స్టార్ వన్‌లో ప్రసారమవుతున్న ‘రంగ్ బదల్తీ ఒధాని’లో కరన్ టక్కర్ అటువంటి ‘ఫీట్’ చేశాడు. ఏదేం మహానుభావా? అని నోరెళ్లబెడితే - కరన్ అభిమానుల కోరిక.. మా తక్షణ కర్తవ్యం అంటూ పాచికలు కదిపారు. ఇకనేం? త్వరలోనే - టీవీ హీరోల స్థానంలో కథానాయికలు కూడా ‘కథానుసారం’గా ఎక్స్‌పోజింగ్‌కి సిద్ధపడతారేమో?!

నీతి సూత్రాలు!
‘ఆ టీవీ సీరియళ్ల కంటే తాగొచ్చి మీరు రోజూ చెప్పే కథల్లో కొత్తదనం’ ఉంటోందంటూ కితాబిచ్చే మహిళల ‘జోక్’ మరీ పాతకాలంనాటిది. ఇప్పుడు రోజులు మారాయి. కథల ట్రెండ్ మారింది. చెప్పిన అబద్ధం చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తూ రోజులు వెళ్లదీసే యూత్‌కి మరీ విడమరిచి చెప్పక్కర్లేదు. కానీ ఇదే కానె్సప్ట్‌తో జూన్ 19న ‘వి’ ఛానెల్ కొత్త తరహా కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. ‘లవ్ కియా తో డర్నా క్యా’. మరో విధంగా రేపటి తరానికి ‘వి’ సరికొత్త పాఠాలివి. రోజూ ఆలస్యంగా వచ్చే కుర్రాడు/ కుర్రది తల్లిదండ్రుల సూటిపోటి నిలదీతల్ని ఎదుర్కోటానికి ‘అబద్ధాల’ చిట్టా అన్నమాట. ఈ రోజుల్లో ప్రేమలో పడటం సహజం. ఇంటికి ఆలస్యం రావటమూ అంతే సహజం. ఏ రెస్టారెంట్‌లోనో గర్ల్/బాయ్‌ఫ్రెండ్‌తో పీకల దాకా మెక్కేసి ఇంట్లో ముద్ద ముట్టకపోవటం ఇంతే సహజం కదా. మరి ఏ కారణం చెప్పి - తల్లిదండ్రుల్ని ‘పటాయిస్తారో’ చెప్పేందుకు బోలెడన్ని నీతి సూత్రాలు ఉన్నారుూ షోలో. ఇకనేం? పాఠాలు వల్లె వేయటమే తరువాయి.

సీరియళ్లకిక సెలవ్?
ఏనాటికైనా ఛానెళ్లలో ‘సీరియల్’ కనిపించని రోజు వస్తుందా? వస్తుందంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఏళ్ల తరబడి వీక్షకులు ‘సీరియళ్ల’ని చూసిచూసి ‘బోర్’ ఫీలవుతున్నారనీ.. అందుకు సాక్ష్యం టిఆర్‌పి రేటింగ్‌లే నంటూ చెప్పుకొస్తున్నారు. ఏదో ఒకనాటికి ‘సీరియళ్లు’ అదృశ్యమయ్యే అద్భుత గడియలు వచ్చి జనం ఊపిరి పీల్చుకుంటారని జోస్యం చెబుతున్నారు. తాజాగా ‘బాలికా వధు’ ‘లాడూ’ ‘ఉత్తరాన్’ ‘పవిత్ర రిస్తా’ ‘ఏ రిస్తా క్యా కెహలాతా హై’ ‘లగీ తుఝసే లగాన్’ ‘ప్రతిజ్ఞ’ ‘యహా మే ఘర్ ఘర్ కెహలీ’ ‘ససురాల్ ఝెండా ఫూల్’ మరో ఏణ్ణర్థంలోనో రెండేళ్లలోనో క్లైమాక్స్‌కి చేరుకుంటాయి. గత ఆరు నెలల కాలంలో ‘గులాహో కా దేవ్‌తా’ ‘పర్దేశ్ మే మిలా కోయి అప్నా’ ‘కిస్మత్’ ‘అరక్షణ్’ ‘మేరా నామ్ కరేగీ రోషన్’ ‘సంజోగ్ సే బనీ సంఘిని’ ‘తో బాత్ హమారీ పక్కీ’ ‘ప్యార్ మే ట్విస్ట్’ ‘గీతా కా ధర్మయుధ్’ ‘మాతీ కీ బన్నో’ మరో ఏడెనిమిది నెలల్లో ముగించనున్నట్టు భోగట్టా. ‘మేరీ నామ్ కరేగీ రోషన్’ నిర్మాత జె.డి.మజేతియా మాటల్ని చూస్తే ఆ మాట నిజమేననిపిస్తుంది. ‘ఏ సీరియల్ అయినా టిఆర్‌పి రేటింగ్‌ని గెలుచుకుంటే బతుకు సాగిస్తుంది. కథాగమనం ‘వీక్’గా ఉన్నప్పుడు కథని కంచిలో కలిపేయటం ఒక్కటే మార్గం’ అంటాడాయన. ఏ సీరియల్‌కి టిఆర్‌పి రేటింగ్ పెరుగుతుందో? ఏ కథ ఆకట్టుకుంటుందో? సినిమాలకు మల్లేనే ‘సీరియళ్ల’ విషయంలోనూ ఒక అంచనాకి రాలేక పోతున్నాం. అటువంటప్పుడు కథని కొన్ని నెలలకి కుదించటమే’ అంటూ వంత పాడుతున్నాడు ‘అరక్షణ్’ సీరియల్ నిర్మాత దర్శకుడు రవీందర్ గౌతమ్. ఇలా అంటున్నారే గానీ - సీరియళ్లు నిర్మించకుండా మాత్రం ఉండరు కదా?! పోనిద్దాం. ఇదీ ఒకందుకు మంచిదే. కొత్తకొత్త కథలు చూట్టానికి వీలుపడుతుంది.
 
Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment