Tuesday, February 1, 2011

వీక్షకుల తీర్పు

జీ తెలుగు సోమ, మంగళ వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తున్న ‘అయ్యారే’ కార్యక్రమం ‘నాచోరే’ వీక్షకులను అలరిస్తోంది. ఇప్పుడిది సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అందమైన ఆరుగురు భామల అభినయ హేల ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతోంది. సహజంగానే ఇలాంటి షోలను చూడాలంటే భయమేస్తుంది. వీటికో ఆనవాయితీని ఆపాదించి పెట్టారు. జడ్జిమెంట్ సీట్లలో ఆసీనులయిన వారు ఉత్తర దక్షణాలతో బాంధవ్యాలను కలిగి ఉంటారు. వెనకా, ముందూ, పక్కల మెంటర్స్ మతులు పోగొట్టేస్తారు. అంతేకాదు పార్టిసిపెంట్స్, మెంటర్స్ భలే సరదాగా తిట్టుకుంటారు. నెట్టుకుంటూ ఉంటారు. సై అంటే సై.. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఊగిపోతూంటారు. ఇందులో సీనియర్ అని లేదు.. జూనియర్ అని లేదు. బస్తీ మే సవాల్ అనేయటమే అక్కడ ఆనవాయితీ. క్వొశ్చన్ మార్క్ ఫేస్‌లతో ఇదై పోతారు ప్రేక్షక మహాశయులు. ఎంత గొప్పగా రక్తి కట్టించాం అనుకుంటారు కాబోలు నిర్వాహకులు.
-కొంగర ఉమామహేశ్వరరావు (తెనాలి)

వీక్షణం
ఇటీవల టీవీ-9లో ప్రసారమైన ‘ఇంటర్వ్యూ’ (మద్దెలచెర్వు సూరి కేసుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్ రీడర్ శ్వేతారెడ్డితో రజనీకాంత్ నిర్వహించిన ఇంటర్వ్యూ) సందేహాస్పదంగా అనిపించింది. ఇదేదో ‘లాలూచీ’ వ్యవహారంలా ఉంది. ప్రశ్న వేస్తూనే ‘హింట్’ ఇచ్చే విధానం చూస్తే లీక్ అయిపోయిన ప్రశ్నపత్రం మాదిరిగా అనిపించింది. వీక్షక ప్రేక్షకుల అభిప్రాయంలోని యధార్థ పరమార్థం ఏమిటో?
-నిట్టల సూర్యమణి, న్యాయవాది
తాడేపల్లిగూడెం

అర్థం కావటంలేదు?
ఏదైనా వార్తా ఛానల్ పెట్టి వార్తలు చూద్దామంటే వార్తలు చదివే వ్యక్తి చెప్పే వార్తలు వినాలో లేక కింద మూడు లైన్లలో అటూ ఇటూ పరుగెడుతున్న వార్తలు చదవాలో అర్థం కావటంలేదు. వాళ్ల ఛానల్ మనం చూస్తున్నాం కదా అని మరీ అంత హింస పెట్టడం భావ్యమా?
-యం.రాజేంద్రప్రసాద్ (వౌలాలి)

బోర్ కొట్టే సీరియల్స్
జీటీవీ హిందీ ఛానల్స్‌లో ప్రసారమవుతున్న సీరియల్స్ ‘చోటీ బహు’ ‘కసమ్ సే బను మై తేరీ దుల్హన్’ ‘అంత్రా, ‘ఘర్ కీ లక్ష్మీ భేటియా’ ముగించినందుకు సంతోషంగా ఉంది. కానీ అగ్లేజనం, సంని, దిల్‌సే దియా వచన్ లాంటి సీరియల్స్ ముగింపునకు వచ్చినా ఎందుకో మరలా వాటికి అనవసరమైన కథను జోడించి ముందుకు ‘సాగు’తున్నారు. కథను సుఖాంతం చేసే సమయంలో ముగింపు చేస్తే బావుంటుంది. ‘అగ్లేజనం’ సీరియల్‌ను ఇంకా రెండు సంవత్సరాల వరకు పొడిగించనున్నారని పేపర్‌లో చదివి షాక్‌కి గురయ్యాం. కాబట్టి టీవీ ఛానల్స్ వారు ఇలాంటి పిచ్చి అలవాట్లను మాని వీక్షకులకు బోర్ కొట్టే సీరియల్స్‌ను తక్షణం ఆపి మంచి షార్ట్ సీరియల్స్‌ను ప్రసారం చేస్తే బావుంటుంది.
-మహమ్మద్ యూసుఫ్ (కాజీపేట)

పాడుతా.. తీయగా..
చిన్నారి గాత్రాలు చిందించు రాగాలు
శ్రోత్రపేయ మగుచు సుధలు కురియ
పాడుతా తీయగా పలువురు మెచ్చంగ
అనుచు పాడుచునుండ హర్షమొదవు
మధుర మంజుల గాన మహితా స్రవంతిలో
ముంచి తేల్చగ చాల మోదమగును
జానపదములాది సంగీత బాణీలు
ఉర్రూతలూగింప నుత్సహింప
పిన్న, పెద్దల మెప్పించ నెన్నదగుచు
ఆంధ్ర జనులను మురిపించి అలరుచుండి
బాలబాలిక ప్రతిభకు పదును పెట్టు
మంచి కార్యక్రమమిదియ ఎంచి చూడ
-కరణం రాజేశ్వరరావు (హిందూపురం)

అనవసరమైన చర్చ?
ఒక తెలుగు న్యూస్ ఛానెల్‌లో హోమో, ట్రాన్స్‌సెక్సువల్, లెస్బియన్‌లకి బిడ్డల దత్తత అనే విషయం మీద అదేదో అతి గొప్ప నాగరిక విషయమైనట్లు చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీళ్లకి కూడా పిల్లల్ని పెంచుకునే హక్కు ఉందని ఒక మేధావి తెలియజేశారు. ఈ చెత్త కామ వికార ప్రోగ్రాంని హైలైట్ చేయడంవల్ల అదేమీ తప్పు కాదని మరి కొందరు యువకులు ఈ విధంగా తయారైతే దేశం ఇక బాగుపడదు.
-యశ్వంతరావు శేషగిరిరావు (ధవళేశ్వరం)

ఇబ్బంది?!
రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ‘సుందరకాండ’ సీరియల్‌ని సా.6 గంటలకు మార్చటం వల్ల కంటిన్యూగా చూసే ప్రేక్షకులకు ఇబ్బంది కలుగుతోంది.
-గొలుగూరి వెంకటరెడ్డి (అనపర్తి)

పాత సినిమాలు
జెమిని కామెడీ ఫంగామాలో కొత్త సినిమాలలోని కామెడీ సీన్లు మాత్రమే వేస్తున్నారు. అలాగే పాత సినిమాల్లోనూ ఎన్నో హాస్య సన్నివేశాలున్నాయి కదా. వాటిని ప్రసారం చేస్తే బాగుంటుంది.
-ఎన్.ముఖర్జీ (తాడేపల్లిగూడెం)

అడగక..
జెమిని ఛానల్‌లో రాత్రి 10 గంటలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారమవుతున్న ‘అడగక ఇచ్చిన మనసు’ హాయిగా ఉంటోంది. కుటుంబమంతా చూడదగ్గ సీరియల్. జోక్స్‌తో పంచ్ డైలాగులతో ఉంది. నటీనటులు సహజంగా నటిస్తున్నారు. ప్రసార సమయాన్ని మారిస్తే ప్రేక్షకులకు మరింత చేరువ కాగలదు.
-గాదిరాజు రంగరాజు (చెరుకువాడ)

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment