Tuesday, February 22, 2011

గత జన్మ.. హాట్ కాన్సెప్ట్

వాస్తవాస్తవాల మాట పక్కన పెడితే - ‘గత జన్మ’ తాలూకు రహస్యాలను ఛేదించాలని ఎన్నో యుగాలుగా అనుకుంటున్నదే. 3 వేల ఏళ్ల క్రితం - ఈజిప్ట్‌లోని ఒక ప్రాంతం. ఒక ఇశ్రాయేలీయుడు.. ఆజానుబాహుడూ.. చేతిలో కర్ర.. మాసిన గడ్డం.. దేనికోసమో వెతుకులాట. దప్పిక గొని ఉన్నాడేమో? ఇసుక తిన్నెలూ.. ఎండమావులూ - దాటుకొని ఒకానొక కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు. అతను ఆ తెగ నాయకుడని వాళ్ల మాటల్ని బట్టి తెలుస్తుంది. పేరు ‘మోషుమోషు’. తెగలోని జనం కష్టాలూ కన్నీళ్లూ విని చలించి పోయి ఆ ప్రాంతాన్ని ఏలే రాజుకి విన్నవించుకునేందుకు వెళతాడు. చర్చలు విఫలమవుతాయి. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో తెగ గెలుస్తుంది. రాజు ఓడిపోతాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకు వయసు పైబడటంతో ఆ నాయకుడు మరణిస్తాడు. తమ ఆత్మీయుణ్ణి కోల్పోయినట్టు వారంతా భావిస్తారు. ఇది ‘రాజా’ చెప్పిన గత జన్మ కథ. మాటీవీలో బుధవారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతున్న ‘గత జన్మ రహస్యాలు’లో నటుడు రాజా తన పూర్వ జన్మలోకి వెళ్లి అనుభూతుల్ని పంచుకున్నాడు.

ఐతే - ‘గత జన్మ రహస్యం’ శాస్ర్తియంగా నిరూపించబడిన ప్రక్రియనా? లేక కేవలం ‘ఫేంటసీ’ మాత్రమేనా? ‘యజుర్వేదం’లో ‘గత జన్మ’కి సంబంధించిన పుట ఉంది. తపో బలం చేత పునర్జన్మల రహస్యాల్ని ఛేదించి ప్రస్తుత జన్మని సార్థకం చేసుకుంటూ - సరైన పంథాలో నడిపించేందుకు దోహదపడే ప్రక్రియ. ఈ హైటెక్ యుగంలో ‘జన్మ’ల రహస్యం అన్న  కాన్సెప్ట్ ఆసక్తి రేకెత్తించేదే. కానీ - ‘గత జన్మ’లపై అనేకానేక సందేహాలూ ఉంటాయి. ఆయా సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కార్యక్రమ నిర్వాహకులపై ఉంది. ఉదాహరణకు - రాజా విషయమే తీసుకుంటే - ౩ వేల ఏళ్ల వెనక్కి వెళ్లి రావటం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. మధ్యలో జన్మలేవీ లేవా? ఆయా జన్మలకీ ఈ జన్మకీ పోలికలూ పొంతన ఉన్నాయా? - పాప పుణ్యాలన్నీ గత జన్మ జ్ఞాపకాలేనా? ఇత్యాది అంశాలకు తెర తీసినట్టయితే - ‘గత జన్మ’ శాస్త్రం (?) కాకపోదు. ఏది ఏమైనప్పటికీ - అన్ని ఛానెళ్లు ఇదే పంథాలో వెళుతూ ‘గత జన్మ’ రహస్యాన్ని ఛేదించేందుకు గట్టి ప్రయత్నం మీదే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ‘స్టూడియో ఎన్’ ప్రారంభించిన ఈ కాన్సెప్ట్ మళ్లీ తెర మీదికి రావటం వెరైటీ ‘కాన్సెప్ట్’ల కోసం వెతుకుతున్న ఛానెళ్లకు హాట్ సబ్జెక్ట్.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment