Friday, February 25, 2011

'రామ్ ఢమాల్ వర్మ' పై కథనం: TV-9 కు లీగల్ నోటీస్!

ఎవరిమీదనైనా...ఎలాంటి కార్యక్రమమైనా... ప్రసారం చేస్తానని విర్రవీగుతున్న TV-9 ఛానల్ తిక్కకుదిర్చే పని ఎట్టకేలకు ఒక వ్యక్తి  చేసాడు.  ఆయన...ఎప్పుడేమి చేస్తాడో, ఎప్పుడేమి చెబుతాడో తెలీని వ్యక్తే అయినా...ఆయన చర్య ఈ తలతిక్కల చానెల్స్ కు ఒక గుణపాఠం అవుతుందన్న ఆశాభావం నాకుంది. ఆ వ్యక్తే...స్టార్ దర్శకుడు....రామ్ గోపాల్ వర్మ. ఆయన చేసినట్లు చెబుతున్న ప్రకటన ఇలా ఉంది.
"With regard to an extremely derogatory programme done by TV9 on me titled 'Ram Dhamaal Varma' where they have attributed many false quotes to me of which one example is 'Prekshakullu Verri Vedhavulu'. I am here by informing that I am initiating criminal action against TV9 for defamation with a criminal intent"

ఈ గొడవకు కారణమైన కార్యక్రమం "రామ్ ఢమాల్ వర్మ" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని TV-9 ఫిబ్రవరి 23 (బుధవారం) సాయంత్రం ప్రసారం చేసింది. జర్నలిజం ప్రమాణాల పరంగా చూస్తే ఈ కార్యక్రమం నిజంగా ఒక చెత్త. వర్మపై వ్యక్తిగతంగా కసితో చేసిన పరుషమైన మాటల దాడి. శాస్త్రీయ విశ్లేషణలేని  ఎల్లో జర్నలిజం. వర్మే కాక ఎవరిపైనైనా ఇంత దారుణమైన దాడి చేయడం తగని పని. 

I-News లో కనిపించిన చల్లా శ్రీనివాస్, HM-TV లో పనిచేసిన ప్రభు అనే 'సినీ విశ్లేషకులను' స్టూడియోలో కూర్చోబెట్టి భద్రి అనే యాంకర్ యమ కసితో ఈ ప్రోగ్రాం చేసారు. వర్మ కెరీర్ గ్రాఫ్ అథఃపాతాళానికి పడిపోయింది...ఆయన తీసిన లేటెస్ట్ సినిమా అప్పలరాజ్ ది మోస్ట్ వరస్ట్ ఫిలిం అనుకుంటున్నారు...వంటి కామెంట్స్ భద్రి చేసారు. 
ఆ చల్లా శ్రీనివాస్ అయితే వర్మ..."ఇష్టమొచ్చిన సొల్లు వాగుతున్నాడు...", "గారడీ చేస్తున్నాడు", "చేతగాని...చేవలేని డైరెక్టర్", "ఇంట్రావర్ట్" వంటి కామెంట్స్ తేలిగ్గా చేసారు. "ఆయన క్రియేటివిటీని రీ చార్జ్ చేసుకోవాలి," అని కూడా అయన సలహా ఇచ్చారు. "రామ్ గోపాల్ వర్మ అంటే భయపడే స్థితిలో జనం వున్నారు," అని ప్రభు చెప్పారు. మధ్యలో...యండమూరి కూడా ఏదో మాట్లాడినట్లు వున్నారు...నేను అది మిస్ అయ్యాను. 

ఇక ఈ ప్రోగ్రాం కొనసాగుతున్నప్పుడు ఆ చానెల్ తెర మీద కనిపించిన వాక్యాలు ఇవి: 
--వర్మకు మతి భ్రమించిందని కామెంట్లు
--రోజు రోజుకీ పేరుప్రతిష్టలు మసకబారుతున్నాయి
--అతని సినిమాలు చూస్తే ప్రేక్షకులకు తిప్పలే
--ఇప్పుడు తీస్తున్నవన్నీ పరమసోది సినిమాలే
--సినిమా మేకింగ్ పై వర్మ శ్రద్ధ తగ్గింది

ఇలా సాగిన ప్రోగ్రాం ఎవరోచెప్పి చేయిస్తే...ఈ చానెల్ చేసిందన్న అనుమానం కలగకమానదు. 'వర్మ కెరీర్ గ్రాఫ్' అంటూ ఒక ప్రోగ్రాం ను కూడా ఇందులో ప్రసారం చేసారు. అందులో...చానెల్ కున్న కక్కుర్తి రోగం ప్రకారం నడుము తిప్పే భామల, సొగసులు చూపే సుందరాంగుల ఫిలిం క్లిప్స్ చూపించి కుతి తీర్చుకున్నారు. 

ఈ ప్రోగ్రాంతో వర్మకు మండిందట. అలా మండడం నిజానికి మంచి పరిణామం. ఇది కోర్టులో నలిగి...ఈ ప్రోగ్రాం చేసిన వారి నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయడమో, వ్యక్తిగత దాడి చేసినందుకు సంబంధీకులకు అరదండాలు వేయడమో చేస్తే బాగుంటుంది. మిగిలిన చానెల్ ఎజమానులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. 

వర్మ ఒక ఐదు కోట్లు ఇస్తే....రవి ప్రకాష్ నుంచి ఈ కార్యక్రమం ఆధారంగా ఒక యాభై కోట్లు నష్టపరిహారం పొందే మార్గం చెప్పడానికి మా అబ్రకదబ్ర సిద్ధంగా ఉన్నాడు. వర్మా....ఆర్ యూ రెడీ? 
 
Source: apmediakaburlu.blogspot.com

1 comment:

  1. వర్మ గారు ఎలాంటి చర్య వారి మీద తీసుకోవాలంటె శివ సినేమాలో హీరొ భవాని గాడిని ఎత్తులను చిత్తు చేసినట్టు, చివరికి భవాని వొంటరి ఎలా ఐపొతాడొ ఆలా ఐపోవాలి ఈ మీడీయా వాళ్ళు వర్మ చేతిలో. ఆయన ఊరికినే సామాన్యుల లా ఒక కోర్ట్ నోటిస్ పంపి చేతులు దులుపుకోకుడదు.

    All the Best VARMA

    ReplyDelete