Monday, February 28, 2011

రాంగోపాల్ వర్మపై TV-9 తీరు అభ్యంతరకరం

ప్రేక్షకులు దేవుళ్ళని అన్న ఎన్టీర్ అనుకుంటే...ప్రేక్షకులు వెర్రి వెధవలు, దద్దమ్మలు, చవటలని రాంగోపాల్ వర్మ భావిస్తున్నారన్న ఓపెనింగ్ వ్యాఖ్యలతో చెత్త కథనాన్ని బుధవారం ప్రసారం చేసిన TV-9 ఆ దర్శకుడిని స్టూడియోలో మరింతగా అవమానించింది శుక్రవారం. దర్శకుడిగా కాకపోయినా...ఒక వ్యక్తిగా అయినా వర్మకు విలువ ఇవ్వకుండా...నోటికొచ్చిన ప్రశ్నలు అడిగి యాంకర్ రజనీకాంత్ ఆయనను అవమానించారు. ఇదొక వైపరీత్యం, అన్యాయం, ఆటవిక జర్నలిజం. 

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు...పైత్యం ముదిరి రాంగోపాల్ వర్మ అయ్యారనీ, వర్మ తీసిన సినిమా చూడడం ఏ జన్మలోనో చేసుకున్న పాపమనీ, వర్మకు ఇప్పుడు వాయిస్ ఓవర్ల పిచ్చి పట్టిందని, ఆయన డ్రాం గోపాల్ వర్మ అనీ ....విపరీత వ్యాఖ్యలు చేసిన ఆ చానెల్ పిలిస్తే...స్టూడియోకి వెళ్లి రెండు గంటల పాటు చెత్త ప్రశ్నలు ఎదుర్కోవడం వర్మ చేసిన పెద్ద తప్పు. కామ్ గా కేసువేసి మంచి లాయర్ను పెట్టుకోక...వర్మ ఆ స్టూడియోకి వెళ్ళారు. హద్దులు మీరి అతితెలివి ప్రశ్నలు వేయబోయిన రజనీకాంత్ ను ఆడుకొని రాంగోపాల్ వర్మ ప్రేక్షకులకు కనువిందు కలిగించడం బాగుంది కానీ...టీ.ఆర్.పీ.రేటింగ్ కోసం TV-9 ఇలా వివాదం సృష్టించి చీప్ ట్రిక్స్ కు పాల్పడడం బాగోలేదు. ఇది జర్నలిజం ఏ మాత్రం కాదు. తన తీరును అటు రవి, ఇటు రజని పునఃసమీక్షించుకోవాలి.    

ఏ దర్శకుడి కెరీర్లోనైనా...ఏ మనిషి జీవితంలోనైనా ఎగుడు దిగుళ్ళు సాధారణమే. వరస ఫ్లాప్స్ అనేది ఒక మహా పాపమయినట్లు, ఒక నెగిటివ్ స్టొరీ ప్రసారం చేసి సుద్దులు చెబితే...ఆయన ఆస్కార్ కొట్టేంత ఎదిగిపోతారనట్లు బిల్డప్ ఇవ్వడం బుల్లి తెర వీక్షకులను వెర్రి వెధవలను, దద్దమ్మలను, చవటలను చేసే ఒక విన్యాసం మాత్రమే!
 
Source: apmediakaburlu.blogspot.com

No comments:

Post a Comment