ఆయనో మాటల మాంత్రికుడు. నవ్వితే సొట్టపడేబుగ్గలతో అవతలివారిని ఇట్టే పడగొట్టెయ్యగల చాతుర్యం ఆయనది. ప్రతి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలయ్యిందంటే అందరూ ఓ కప్పు కాఫీ చేత్తో పట్టుకుని టీవీల ముందుకు చేరిపోవడం ఇంటింటా కనిపిస్తోంది. ఇది తప్పక చూసి తీరవలసిన కార్యక్రమం అని అందరినోటా వినబడుతున్న ఏకవాక్యం. ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికున్న క్రేజ్ అలాంటిది మరి. పెద్దపెద్ద తారలను మాటలలో పెట్టి హాట్‌హాట్ విషయాలను రాబట్టడంలో కరణ్ తరవాతే ఎవరైనా. ఎక్కడో అంతరంగంలో నక్కినక్కి దాక్కుని, ముసుగేసుకుని కూర్చున్న రహస్యాలను బట్టబయలు చేయడంలో జోహార్‌కి జోహారులు చెప్పాల్సిందే. ఎంతో చురుకుగా, అందంగా, అర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎవరైనా కరణ్ తరవాతే. సరదా సినిమాలు తీసే కరణ్ బుల్లితెర గిలిగింతల ఉల్లాస సామ్రాజ్యానికి డాన్. కాఫీ విత్ కరణ్ పేరుతో వారం వారం సెలబ్రిటీలతో చాటింగ్ చేసి ప్రేక్షకులకు ఓ కప్పు కాఫీ అందిస్తున్నాడు.

కరణ్‌లాగ కాఫీ ఎవ్వరూ ఇవ్వలేరు. కరణ్‌లాగ సంభాషణ కూడా ఎవరూ చేయలేరు. ఈ మూడో సీజన్‌లో ప్రసారమవుతున్న కార్యక్రమంలో కేవలం సినీ పరిశ్రమ నుంచే కాక, స్పోర్ట్స్, కార్పొరేట్ రంగాల వారితో కూడా కరణ్ సంభాషిస్తున్నారు. కాజోల్, రాణి, ఫారూక్, ప్రియాంక, హృతిక్, సంజయ్ దత్, ప్రియాదత్, షాహిద్, కరీనా, కరిష్మా, జాన్, బిపాసా... ఇలా ఎందరో కనువిందు చేస్తున్నారు. దీనికి ఎంత క్రేజ్ ఉందంటే...
ఒక్కసారిగా ఈ కార్యక్రమ అభిమానులు ఎంతోమంది తమ కుర్చీలకు టైమ్ సెట్ చేసుకున్నారు! ప్రతి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ఆ కుర్చీ ఆటోమేటిక్‌గా టీవీ ముందుకు వచ్చేలాగ, టీవీ దానంతట అదే ఆ చానల్‌కు ట్యూన్ అయ్యి ఆన్ అయ్యేలాగ, ఎక్కడున్నా సరే సదరు వ్యక్తిని సెల్‌ఫోన్ ఇంటికి తీసుకువచ్చేలాగ సిద్ధమయ్యారంటే ఈ ప్రోగ్రామ్ చేస్తున్న కరణ్ ఎలా ఆకట్టుకుంటున్నాడో తెలుస్తుంది. ఏదో మొక్కుబడిగా కాక చాలా లాజికల్‌గా మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఆద్యంతం ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా చేస్తున్నాడు కరణ్.
నిరుడు నవంబరు 7న ప్రారంభమైన మూడవ సీజన్‌లో ఇప్పటికే ఎందరో ప్రముఖులతో 15 ఎపిసోడ్లలో కబుర్లాడాడు కరణ్. అంతకుముందు 2004 నవంబరు 19న మొదటి సీజన్, ఫిబ్రవరి 11, 2007న రెండవ సీజన్ ప్రారంభమయ్యి విజయవంతంగా నడిచాయి. మూడో సీజన్ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఒక డైనమిక్, ఎనర్జిటిక్, టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా ఓ కార్యక్రమాన్ని ఇంత హిట్ చేసినందుకు... హ్యాట్సాఫ్ టు కరణ్...!!!
Source: www.sakshi.com
No comments:
Post a Comment