‘అబ్బే! ఏం సీరియల్సండీ. అన్నీ అన్నాచురల్లే... ఒక్కటీ వాస్తవానికి దగ్గరగా ఉండదు..’ అంటూ అనేక మంది ప్రేక్షకులు చేసే తీవ్ర వ్యాఖ్యానాలు వింటూంటాం. వాటన్నిటికీ దాదాపు సమాధానంగా మాటీవీలో ‘మా పసలపూడి కథలు’ (సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 7.30కి ప్రసారమవుతోంది) వస్తోంది.
అన్నీ చక్కగా కుదిరాయి
ఒక్కో సీరియల్లో, మిగతా విషయాల మాటెలా వున్నా ఫలానా రోల్ పవర్‌ఫుల్‌గా వుందనో ఆ ఎపిసోడ్ అదరగొట్టిందన్న అభిప్రాయాలు వస్తూంటాయి. కానీ పసలపూడి కథల్లో మాత్రం ఎంచుకున్న టైటిల్ పాట (మా పసలపూడి కథలండీ, మీ కథలు కల కథలండీ...) దగ్గర్నుంచీ, నటీనటుల భావప్రకటన, వారి సంభాషణా తీరు, సంఘటనలు జరిగినప్పుడు వారు స్పందించే విధానం.. ఇలా అన్నీ కూడా కచ్చితంగా తీర్చిదిద్దిన విషయం ధారావహిక సింగిల్ ఎపిసోడ్ చూసినవారైనా ఒప్పుకుంటారు. కథాపరంగా చెప్పుకోవాలంటే అన్ని ఊళ్లల్లో వున్నట్లే ఆ గ్రామం పసలపూడిలోనూ విభిన్న భావాల వ్యక్తులున్నారు. వాళ్ల జీవన రీతుల్లో ఎదురైన అంశాలకు చలించిన పద్ధతీ, దాన్ని ఊరి పెద్ద కట్టడి చేసిన వైనం, తప్పుకు సముచిత శిక్ష విధించడం తదితరాలు కొన్ని భాగాలు స్పృశిస్తే, ఇంకొన్ని భాగాలు తనకుమాలిన ధర్మమమని మనకనిపించినా ఎంపిక చేసుకున్న పంథాకు పిసరంత కూడా పక్కకు జరక్కుండా పయనం సాగించే హోటల్ రాజు ఉదంతాన్ని తెలియపరిచాయి. అంతిమంగా దీని వెనుక ఉన్న భావం - మనిషి సజావుగా తన జీవితం సాగించాలంటే అవలంబించాల్సిన సంగతులు చెప్పడమే.
టైటిల్ సాంగ్ కసరత్తు
సీరియల్ సిగ్నేచర్ ట్యూన్‌గా చెప్పుకోదగ్గ టైటిల్ సాంగ్‌కి నిర్వాహకులు చేసిన కృషి ఎన్నదగ్గ విధంగా చిన్న తెరపై కన్పడింది. పాట ఎత్తుగడ తదితరాలు సీరియల్ కథాకారుడు (వంశీ)పై ఉన్న సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ బాణీకి దీటుగా పాటలో సాహిత్యం సమతూకంగా నడిచింది. ‘మైమరపులిక మొదలండీ...’ అంటూ మొదలైన పాటలోని రెండో లైను అంత్య ప్రాసలేసుకుంటూ ఆహ్లాదంగా సాగింది. అన్నిటికన్నా హైలైట్ ‘ఆత్మీయతలూ, ఆవేదనలూ చేస్తున్న లీల..’ అన్న వాక్యం. దీనికి ప్రతిగా విషాదచ్ఛాయల్లో వచ్చిన గీతమూ.. జీవన గతులూ, స్మృతులూ.. అన్నదీ గుండెను తాకింది. ఇక పాత్రధారుల్లో అందరూ ఈ మధ్య.. (ఆ మాటకొస్తే ఏ మధ్యైనా) వాటిల్లోలా కాకుండా ప్రతి పాత్ర పరిధి నెరిగి ప్రవర్తించింది. దాంతో ఓవర్ యాక్షన్ అన్న మాట రానే లేదు. మచ్చుకో సీను.. రాజు భార్య ప్రసవమప్పుడు ప్రసూతి గది బయట గ్రామస్థుల హావభావాల్నే చూద్దాం. లోపల ప్రసవ వేదనలు పడుతున్న భవానీ (రాజు భార్య)కు ఏమవుతుందోనన్న ఆందోళననూ, ఏమీ కాకూడదన్న ప్రార్థనను, పురుడు సజావుగా అయి, తల్లీ బిడ్డా క్షేమంగా ఉండాలన్న భావనను కేవలం కళ్లల్లోనూ, చేతులు తిప్పుతూనూ ఓ వనితపై అభినయింపజేసిన పద్ధతి సైలెంట్‌గా వీక్షకుల్ని ఆకట్టుకుంది. అలాగే ‘మామయ్య తనకు మాలిన ధర్మం చేస్తున్నాడంటూ, దానికి కారణాల్ని తల్లితో ఓ పాత్ర వివరించిన తీరు సహజంగా అనిపించింది.
చావడం కూడా చేతకాదు
సంభాషణలపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపినట్లు ఈ సీరియల్ పోకడ చెప్తోంది. అలా అని ఇందులో నేలవిడిచి సాము చేసే రీతి డైలాగులు లేవు. కొంత కొత్త రీతి వెల్లివిరిసింది. జనవరి 24న చూపిన భాగంలో బుచ్చిరెడ్డి పాత్ర తన ప్రేమ గాఢతను వ్యక్తపరుస్తూ, ప్రేమికురాలితో ‘నువ్వు లేకుండా చావడం కూడా చేతకాదు’ అంటుంది. సాధారణంగా నువ్వు లేకుండా నేను బతకలేను అని ప్రేమికులు ఒకరితో ఒకరు అనుకోవడం మనకు తెలుసు. దాన్ని కాస్త పొడిగించి అనుకుంటా ఆ ప్రేమ తీవ్రతని ‘చావు’కి అన్వయింపజేస్తూ అనిపించారు. అలాగే వ్యవసాయ కూలి సుంకిని వేధిస్తూ ఆ ఊరి ఆకతాయి ‘నువ్వు ఫలానా సబ్బుతో ఒళ్లు రుద్దుకుంటే ఇంకా నీకు రంగు బాగా వస్తుంది’ అంటాడు. అందుకు ప్రతిగా సుంకి పాత్రధారిణి ‘ఉన్న రంగుతోనే వేగలేక ఛస్తున్నా’ నంటూ వేసిన వ్యంగ్యోక్తి బాగా పండింది. ఇంకొన్ని చోట్ల వాడిన మాటలు ‘వయసు మళ్లినా.. ఆకలి బతికే ఉంటుంది..’ వంటివి సూటిగా హృదయాన్ని స్పృశించాయి.
ఇలా ఎందుకు?
అన్నీ బానే ఉన్నా గడిచిన శుక్రవారం (జనవరి 28) చూపిన భాగంలో హోటల్ రాజు తను ప్రాణప్రదంగా చూసుకుంటున్న కూతుర్ని వేరే వారికి దత్తత ఇవ్వడానికి నిర్ణయించుకోవడం సమంజసంగా లేదు. దీనికి కారణం తన దానశీలత వల్ల ఆమెకు మిగిల్చేది ఏదీ లేదు కనుక, ప్రభుత్వ సదుపాయాలు వచ్చే వర్గాలకు తన పిల్లను దత్తతివ్వడం వల్ల ఆమె భవిష్యత్తుకు ఢోకా వుండదు అని చెప్పడం. వౌలికంగా దీని ఉచితానుచితాల మాట పక్కకు పెట్టినా ప్రధానంగా హోటల్ రాజు అందరి బాధల్ని తన బాధగా చూసుకునే వ్యక్తిగా చిత్రీకరించారు. అలాంటి మనిషి మనసు ఎంతగా చంపుకున్నా తన సొంత బాధ్యతల్నించి పలాయనం చేసే మనిషిగా మారడం అసాధ్యం. ఇది అసలు ఆ పాత్రకిచ్చిన సమున్నత స్థానానికే పొసగనిది. ఎంతగా అతను ‘నేను మనసు మార్చుకున్న పరిస్థితినిబట్టి..’ అని అన్నా ప్రేక్షకుడు జీర్ణించుకోలేని ఘట్టం. ఇది కాకుండా వేరేలా ఈ సమస్యకి పరిష్కారం చూపొచ్చు. దాన్ని దర్శకుడు ఆశ్రయిస్తే బావుండేది.
గోదావరి జిల్లాల మాండలికాన్ని ఒడుపుగా వాడుకుంటూ హాయిగా సాగిపోతున్న ‘పసలపూడి కథలు’ చూపే సమయం విషయంలోనే కాస్త వెసులుబాటు కలిగిస్తే బావుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ కార్యక్రమం రాత్రి 7.30కి వస్తోంది. వివిధ విధులు నిర్వహించే వ్యక్తులు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బస్సుల్నీ, ఆటోల్ని ఆశ్రయించి సీరియల్ సమయానికి టీవీ ముందు వాలిపోవడం కుదరని పని. అందుకే టీవీ భాషలో పేరొందిన ప్రాధాన్యతా సమయం అంటే రాత్రి 9 గంటలకు మారిస్తే అధిక శాతం వీక్షకులకు అనుకూలంగా ఉంటుంది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment